అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి నాలుగు వైపులా అడవి ఉంది. ఆ గ్రామంలో రామభద్రయ్య అనే వేటగాడు ఒకడు ఉండేవాడు. అతను మహా కౄరుడు- ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేవు అతనికి. అయితే అతని భార్య సీతమ్మ మంచిది, అమాయకురాలు.

వాళ్లకి ముగ్గురు కూతుళ్ళు. భార్య పిల్లలు ఎవ్వరికీ రామభద్రయ్య వేటాడటం ఇష్టం ఉండేది కాదు. "ప్రాణులను హింసించే ఆ వృత్తివద్దు; వేరే ఎదైనా కొట్టు పెట్టుకుందాం" అంటే కూడా అతను వినేవాడు కాదు. మొండిగా వేటాడటం తోనే సంపాదించేవాడు.

అతనంటే గ్రామస్థులకి కూడా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కౄరుడైన వేటగాడిని చూస్తే ఎవరికి ఇష్టం ఉంటుంది?

ఇలా ఉండగా ఒక రోజు ఎప్పటిలాగానే వేటాడి అడవి నుంచి వెనక్కి వస్తున్న సమయంలో రామభద్రయ్యకి అందమైన లేడి ఒకటి కనబడింది. ఆ సరికే చీకట్లు అలుముకుంటున్నాయి. అయినా సరే ఆ లేడిని దక్కించుకోవాలనుకున్నాడు. ధనుర్బాణాలు ఎత్తుకొని లేడి వెనుకాల పరుగు తీసాడు. మొదటి బాణం విసిరాడు- గురి తప్పింది. రెండవ బాణం విసిరాడు-మళ్ళీ గురి తప్పింది. ఇక మూడవ బాణం మటుకు సూటిగా పోయి లేడి మెడ మీద గుచ్చుకొంది.

విలవిల లాడుతూ కిందపడిన ఆ లేడి ఓ దేవతలాగా మారింది- "ఓరీ నీచుడా! నీ భార్యాబిడ్డలు ఎంత చెప్తున్నా వినకుండా, గ్రామస్థులు అసహ్యించుకుంటున్నా పట్టించుకోకుండా వేటాడటాన్నే నీ వృత్తిగా ఎన్నుకున్నావు. జీవించేందుకు అనేక మార్గాలున్నా ఇలా ఇతర ప్రాణులను హింసిస్తున్నందుకు నువ్వు తగిన శాస్తి అనుభవిస్తావు. నీకు కూడా లేడి జీవితం లభిస్తుంది చూడు!" అంటూ కన్ను మూసింది. మరుక్షణం రామభద్రయ్య కాస్తా లేడిగా మారిపోయాడు.

అతని కోసం రాత్రంతా ఎదురు చూశారు భార్యబిడ్డలు. ఉదయాన్నే లేచి తలుపు తెరిచిన సీతమ్మకు గడప మీద పడుకుని కనబడింది ఒక లేడి. ఆమె దాన్ని దూరంగా తరిమేసింది. పిల్లలతోబాటు అడవంతా గాలించటం మొదలు పెట్టింది రామభద్రయ్య కోసం. ఊళ్ళో వాళ్ళందరినీ అడిగింది. ఎవరిని అడిగినా "మాకు తెలియదంటే మాకు తెలియదు" అన్నారు. ఇట్లా రోజూ ఆ లేడి రావటం, సీతమ్మ దాన్ని తరిమేయటం జరిగింది. ఇట్లా మూడు రోజులు గడిచాయి.

నాలుగో రోజున ఇక లాభం లేదని పిల్లలిద్దరూ బడికి వెళ్ళారు. అడవిలో దిక్కుతోచకుండా తిరుగుతున్న సీతమ్మను చూసేసరికి లేడి రూపంలో‌ ఉన్న రామభద్రయ్య సంతోషం పట్టలేకపోయాడు. ఆమె దగ్గరికి రాబోయాడు. అదే సమయంలో ఆ లేడిని చూశాడొక వేటగాడు. వాడు దాన్ని వెంటాడి తరమటం మొదలు పెట్టాడు.

చేత విల్లంబులు పట్టుకొని యముడి లాగా వెంట పడుతూ ఆ వేటగాడు ఒకదాని తర్వాత ఒక బాణం వేస్తుంటే, ప్రాణభయంతో పరుగు తీశాడు రామ భద్రయ్య . ఆ హడావిడిలో లేడికి తగలాల్సిన బాణం ఒకటి నేరుగా పోయి సీతమ్మకి తగిలింది. వేటగాడికి భయం వేసింది. సీతమ్మను అక్కడే వదిలేని ఎటో పారిపోయాడు వాడు.

సీతమ్మ క్రింద పడి విలవిలలాడుతున్నది. గాయం నుండి రక్తం కారుతున్నది. భార్య దగ్గరే కూర్చొని ఏడవసాగాడు రామభద్రయ్య.

"ఏమండీ! ఎందుకు ఏడుస్తున్నారు? లేవండి- తెల్లవారింది" అంటూ కదుపుతున్న సీతమ్మను కళ్ళు తెరిచి చూశాడతను.

"కలగన్నారా, ఏదో‌చెడ్డకల వచ్చినట్లుంది?" అని అడుగుతున్నదామె.

రామభద్రయ్య కి అర్థమైంది- 'ఇదంతా కల' అని.

అయినా ఇక అతను వేటాడటం మానేశాడు. తన వృత్తిని మార్చుకున్నాడు.