ఆ రోజు మూడవ సెషన్ సైన్స్ పాఠాలు బోధించడానికి తరగతిలో అడుగుపెట్టారు రావుమాష్టారు.

"గుడ్ ఆఫ్టర్ నూన్ సార్!" అన్నారు పిల్లలు లేచి నిలబడి.

"గుడ్ ఆఫ్టర్ నూన్!" బదులిచ్చాడు రావు మాష్టారు.

అంతలో మీనశ్రీ మాష్టారు దగ్గరకు వచ్చింది. "సార్! నేనొక మంత్రశక్తిని చూపిస్తాను మీకందరికీ!" అంది.

మీనశ్రీ 'ఇన్‌స్పయిర్' పతక గ్రహీత. బడిలో విజ్ఞానాన్ని ప్రోత్సహించటం కోసం ప్రత్యేకంగా పని చేస్తున్నది.

"మంత్రశక్తా?! సరే, చూపించమ్మా!" అన్నారు మాష్టారు.

గాజుగ్లాసు నిండా నీళ్ళు తెచ్చి బల్లమీద ఉంచింది మీనశ్రీ. ఏడు అంగుళాల పొడవుండే బెండు పుల్లలు ఓ పది తీసుకు వచ్చింది- ఇళ్ళలో ఊడ్చుకునే పరకలు(చీపుర్లు) ఉంటాయి కదా, వాటిలోంచి.

"ఇవిగో ఈ పుల్లలను ఒక్కొక్కరూ వచ్చి తీసుకోండి. తరువాత నేను చెప్పినట్లు చేయండి!" అంది మీనశ్రీ.

పిల్లలు కొందరు గబగబా ముందుకొచ్చి ఒక్కొక్క పుల్లనూ తీసుకున్నారు. ఒక పుల్లను తన దగ్గర ఉంచుకొని, మరొక పుల్లను రావు మాష్టారు గారికి ఇచ్చింది మీనశ్రీ.

"ఇప్పుడు మీ దగ్గరున్న పరక పుల్లలను బాగా పరీక్షించండి. వాటిలో ఎటువంటి మోసమూ లేదు. అంతా నా మంత్రశక్తే పనిచేస్తుంది!" అన్నది పిల్లలతో.

"సరేలే, కానీ వీటితో ఏం చేయాలో తొందరగా చెప్పు!" అన్నాడు శేఖర్.

"తొందర పడొద్దు! ఇప్పుడు ఒక్కొక్కరూ రండి. మీ దగ్గరున్న పుల్లలను ఈ గాజు గ్లాసులోని నీళ్ళలో నిలపాలి. పుల్ల ప్రక్కలకు ఒరిగిపోరాదు- నీళ్ళ మధ్యలోనే నిలచి ఉండాలి. మీలో ఎంతమంది వీటిని నిలపగలరో చూద్దాం. పుల్లని నీళ్ళలో నిల్చేట్లు ఎవరు చేస్తే వాళ్ళకు ఓ 'పెన్ను' బహుమతిగా ఇస్తాను" అన్నది
మీనశ్రీ.

"బలేబలే!" అంటూ చప్పట్లు చరిచారు పిల్లలు.

ముందుగా యమున తన దగ్గరున్న పుల్లను గ్లాసులో నిలబెట్టింది. కానీ చేయి వదిలిన వెంటనే పుల్ల పక్కకు ఒరిగిపోయింది. యమున అలా చాలా సార్లు ప్రయత్నించింది. చివరికి "ఇక నా చేత కాదు!" అంటూ
వెళ్ళిపోయింది. మీనశ్రీ ఆ పుల్లను తీసుకున్నది.

అటు తర్వాత ప్రకా ష్ వచ్చాడు హుషారుగా. గ్లాసు ముందర నిలబడి ప్రార్థన చేసాడు. పుల్లను నీళ్ళలో నిలిపాడు- అలాగే చేతితో పట్టుకుని ఉన్నాడు- "ఇక వదులు పుల్లని!" అంది మీనశ్రీ. ప్రకాశ్ చెయ్యి తియ్యగానే పుల్ల కాస్తా పక్కకు ఒరిగిపోయింది.

తరువాత ఇందు, శిల్ప, భాగ్య, మనోహర్, గోపాల్- చివరికి రావు మాస్టారు కూడా ప్రయత్నించారు. పుల్లల్ని నీళ్లలో నిలపడం ఎవ్వరివల్లా కాలేదు.

"మీనశ్రీ! వీటిని నీళ్లలో నిలపటం మా వల్ల కాదు. నువ్వెట్లా చేస్తావో చూపించు!" అన్నారు మాష్టారు.

"అవును అవును" అని అరిచారు పిల్లలందరూ.

మీనశ్రీ‌ అందరి దగ్గరా ఉన్న పుల్లలను వెనక్కి తీసుకొని, వాటిని మేజాబల్ల మీద పరచింది. "ఎవరైనా ముందుకు రండి! ఈ పుల్లలలోంచి ఒక దాన్ని తీసి నాకు ఇవ్వండి" అన్నది. గాయిత్రి గబుక్కున ముందుకు వచ్చింది. ఒక పుల్లను తీసుకుని మాష్టారు గారికి యిచ్చింది. మాష్టారు పుల్లను బాగా పరీక్షించారు. అది మామూలు పుల్లే. దానిలో ఏ ప్రత్యేకతా లేదని నిర్థారించుకున్నాక, ఆయన దాన్ని మీనశ్రీకి ఇచ్చి, "దీనిని ఇక నిలబెట్టు" అన్నారు.

మీనశ్రీ పుల్లను తీసుకున్నది. దాన్ని నీళ్ళలో నిలబెట్టి పట్టుకున్నది. "ఒకటి-రెండు-మూడు! అబ్రకదబ్రా!" అని చెయ్యి వదిలింది. ఆశ్చర్యం! నీళ్ళ మధ్యలో నిటారుగా నిలబడే ఉంది పుల్ల! మీనశ్రీ ఆ పుల్లను బయటికి తీసి, మరొక పుల్లను చేతిలోకి తీసుకున్నది. మళ్ళీ ఏవో మంత్రాలు చదివి "అబ్రకదబ్రా" అంది. ఆ పుల్లకూడా నీళ్లలో నిటారుగా నిలబడింది!

"మ్యాజిక్ అంతా ఆ పుల్లలోనే ఉంది. దాన్ని నాకివ్వు- నేను నిలబెడతాను" అన్నాడు కిరణ్.

మీనశ్రీ నవ్వింది. "అట్లానా?! సరే! తీసుకో" అంటూ తను నిలబెట్టిన పుల్లనే కిరణ్ చేతికి ఇచ్చింది! కిరణ్ దాన్ని తీసుకుని‌ "అబ్రకదబ్రా" అంటూ నీళ్ళలో వదిలాడు. పుల్ల ప్రక్కకు ఒరిగిపోయింది! అందరూ పకపకా నవ్వారు.

"ఇంకా ఎవరైనా నిలబెట్టగలరా?" అడిగింది మీనశ్రీ. "దీన్ని నా మంత్రశక్తితోటే నిలిపానని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?!"

"అంత గప్పాలు అవసరం లేదమ్మా! మంత్రమూ లేదు; చింతకాయా లేదు!దీని వెనుకవున్న రహస్యం ఏంటో చెప్పెయ్యి! అన్నారు రావు మాష్టారు.

"చెప్పటం కాదు; అందరితోటీ చేయిస్తాను. ఇవిగో ఈ పుల్లలను మళ్ళీ తీసుకోండి" అని వాటిని తలా ఒక్కటీ ఇచ్చింది మీనశ్రీ. తరువాత అందరికీ ఒక్కొక్క 'గుండు సూది' ఇచ్చింది. "గుండు సూదా? దీనితో ఏం చేయాలి?" అడిగారు అందరూ.

"గుండుసూదిని పుల్లకు ఒక చివరన లోపలి వరకూ గుచ్చండి. ఇప్పుడు వాటిని నీళ్ళలో నిలపండి!

నిలబడకపోతే అడగండి నన్ను!" అన్నది మీనశ్రీ.

గుండు సూదులు గుచ్చిన పుల్లలన్నీ నీళ్ళలో నిటారుగా నిలబడ్డాయి!

"ఇందులో ఏ మంత్రమూ లేదు. ఇది సైన్సే! సూదిని గుచ్చినప్పుడు, పుల్ల అడుగు భాగం బరువవుతుంది కదా, దాని గరిమనాభి క్రిందికి జరుగుతుంది. ఫలితంగా పుల్ల నీళ్ళలో నిలువుగా వ్రేలాడగల్గుతుంది!" చెప్పారు రావు మాష్టారు.

"అవును సార్! క్రింద బరువు లేకుంటే పుల్ల స్థిరంగా నిలబడలేక ఒక ప్రక్కకు ఒరిగిపోతుంది" అంది మీనశ్రీ.

"మరి నువ్వు నిలబెట్టిన పుల్లల్లో‌ గుండు సూది లేదే?! మేం వాటిని బాగా పరీక్షించే ఇచ్చాంగా?" అడిగాడు సదాశివ.

గుండుసూది నా చేతిలోనే ఉన్నది! మీరు పుల్లని నాకు ఇవ్వగానే నేను మంత్రం చదువుతూ మీ చూపు మళ్ళించాను. అటుపైన మీకు కనబడకుండా సూదిని పుల్ల అడుగున దూర్చేశాను. ఇట్లా ఎవరికీ కనబడకుండా‌ చేసే పనిని మ్యాజిక్‌లో 'హస్తలాఘవం' అంటారు! కొంచెం సాధన చేశారంటే మీకూ అలవడుతుంది ఈ‌ విద్య" అన్నది మీనశ్రీ.

"మరి కిరణ్ నీ దగ్గరి పుల్ల తీసుకొని నిలబెట్టాడుగా, మరి అది ఎందుకు నిలబడలేదు?" అనుమానంగా అడిగింది గాయత్రి.

"అప్పుడు లాఘవంగా గుండు సూదిని తీసేసి ఇచ్చానుగా, అందుకు" నవ్వింది మీనశ్రీ, గుండుసూదిని తీసేసిన పుల్లలు రెండింటిని చకచకా గాయత్రి చేతిలో పెడుతూ!