కొత్తపల్లి-57 చేతిలో వాలగానే సంక్రాంతి రుచుల ఘుమఘుమలన్నీ మదిని తాకాయి. పల్లె ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుతున్న చిన్నారులు ఆనందార్ణవంలో మనసును హత్తుకున్నారు.

మాట తీరు సరిగా ఉంటే కలివిడితనం ఎంత పెంపొందుతుందో; జీవితం ఎంత హాయిగా సాగుతుందో ! సంపాదకీయం బాగుంది.

ఐదో తరగతి విద్యార్థిని తరుణిస్ఫూర్తి 'వడ్రంగి ఎంపిక' కథ ద్వారా 'ఎవరైనా చేసే పనిలో నైపుణ్యానికే విలువ, గుర్తింపు లభిస్తాయ'ని తెలియజెప్పిన తీరు స్ఫూర్తి దాయకం.

తొమ్మిదో తరగతి విద్యార్థిని లక్ష్మీతేజ 'పంతులుగారి మంత్రాలు' కథలో వెంగళప్ప పాత్ర సరదాగా వుంది.

చదువనేది మనిషికి ఎంత అవసరమో 'పట్టుదల' ద్వారా ఆరో తరగతి విద్యార్థి మక్సూద్ చక్కగా వివరించాడు.

వాళ్ల నాన్నలో మార్పువచ్చి రవికి చదువుకునే అవకాశం దక్కటం బాగుంది. నిజంగానే పట్టుదల ఉంటే దేన్నయినా సాధించవచ్చు.

ఏడో తరగతి విద్యార్థి అరవింద్ రెడ్డి సేకరించిన తెనాలి రామలింగడి కథ 'పారిపోయిన గిన్నెలు' పాతదే.

అయినా మళ్ళీ చదివించింది; పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. ఎదుటి వారిని అమాయకులుగా భావించి అతి తెలివితో లాభపడాలనుకునే వారికి ఈ కథ చెంపపెట్టు!

శారీరక శ్రమ చేయని వారిలో వచ్చే ఇబ్బందులను తొమ్మిదో తరగతి విద్యార్థిని యం చంద్రలేఖ కథ 'బైక్ కన్నా సైకిల్ మేలు' చక్కగా వివరించింది. తొలుత ఆడంబరాలకు పోయి, ఆరోగ్యం దెబ్బతిని, ఆనక సైకిల్ తెచ్చుకోవటం బాగుంది.

తొమ్మిదో తరగతి విద్యార్థిని టీ సాయిహేమాంజలి 'పెట్రోల్ సలహా' కథలో ఒక సామాజిక స్పృహ కనిపిం‌చింది.

పెట్రోల్ స్వగతానికి రామయ్య కథను జోడించి సందేశాత్మకంగా ముగించటంలో పరిణతి ఉన్నది.

నచ్చిన పనిని ఇష్టంగా చేస్తే ఫలితాలు ఎలా వుంటాయో 'యువకెరటం- ఎలినోర్ హార్డ్విక్ పరిచయం ద్వారా తెలిసింది. పిల్లలకు ఈ కథనం మంచి 'కిక్' ఇస్తుందనటంలో సందేహం లేదు.

ఆశపోతు ధనవంతుడు దిక్కులేని చావు ఎలా చచ్చాడో 'మోసం చేయాలనుకోకు!' కథలో డా.ఎం.హరికిషన్ సీమ మాండలికంలో చెప్పటం ఇతర ప్రాంతాల వారికి కొత్త అనుభూతి. చక్కని గురువు మార్గదర్శనంలో విద్యార్థులు ప్రతిక్షణం ఆనందిస్తూ గొప్పగా ఎదగగల్గుతారు. రమాదేవిగారు స్వయంగా మంచి టీచర్ అయివుంటారు- అందు వల్లే 'ఉపాధ్యాయ లక్షణం' కథని అంత బాగా మలచారని అనిపించింది.

నాలుగు సైన్స్ ట్రిక్కులు నేర్చుకొని జనాన్ని మోసగించి దోచుకున్న దొంగ సాధువు అసలు రూపాన్ని 'నీళ్ళతో వెలిగే ప్రమిదలు' కథలో ఎస్ శంకరశివరావు కళ్లకు కట్టిన తీరు మన అజ్ఞానపు మత్తును కచ్చితంగా వదిలిస్తుంది.

కష్టాల కొలిమిలో కాలినవారు ఎంత దృఢంగా, బలంగా తయారవుతారో మనకు భరోసాగా ధైర్యం నూరిపోస్తూ చెప్పింది, చిన్నిగారి అనువాద కథ 'టీ కప్పు ఆత్మకథ' . ఇక పిఎస్ నాగరాజు గారి 'కండచీమల నాయకుడు-నిద్రమత్తు ఏనుగయ్య' గేయకథ , కొత్తపల్లి సురేష్ 'జండా పాట' పిల్లల్ని చాలా
ఉత్సాహపర్చాయి.

కొన్ని కథల్లో వాక్య నిర్మాణం సాఫీగా లేదు. సంపాదకులు ఈ విషయమై కాస్తంత శ్రద్ధ తీసుకోవటం అవసరమేమో! కొత్తపల్లిలోని రంగుల బొమ్మలన్నీ కనువిందు చేశాయి. ఎవిఎం గారి కార్టూన్లు, చిట్టి పొట్టి జోకుల సంగతి సరేసరి! పుస్తకం చివరి పేజీలో 'కథలెందుకు?' నిజంగా కొసమెరుపే!