అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరు పట్టణానికి చాలా దూరంగా ఉండేది. ఆ ఊళ్ళో ఉండే రాములు, సీతాలు ఆలుమగలు. వాళ్ళకు లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది. అయితే ఎందుకో తెలీదు- ఆ పాప ఎప్పుడూ జబ్బు పడుతూ ఉండేది. బిడ్డ ఆరోగ్యం గురించి రాములికి, సీతాలికి చాలా దిగులుగా ఉండేది. పాప ఆరోగ్యం కోసం వాళ్ళు ఎందరో దేవతలకు మొక్కారు. ఎందరో స్వాములను దర్శించుకున్నారు. కోళ్ళను, మేకలను మొక్కులుగా సమర్పించుకున్నారు. అయినా ప్రయోజనం లేదు. పాప ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది.

ఒకసారి పాపకు చాలా జ్వరం వచ్చింది. 'కోడిని ఇచ్చుకుంటాను తల్లీ, పాపని బాగు చెయ్యి' అని పొరుగూరి దేవతకు మొక్కుకున్నది సీతాలు. ఆ మొక్కును తీర్చుకునేందుకు గాను ఆలుమగలు ఇద్దరూ వెళ్ళి కోడిని బలి ఇచ్చి వచ్చారు కూడాను. ఆ కూరను జ్వరంతో ఉన్నపాపకు తినిపించారు. దాంతో వ్యాధి మరింత ముదిరింది.

అట్లా ఎందుకైందో దేవతనే అడగాలన్నారు అందరూ. 'సరే అడుగుదాం' అని వాళ్ళిద్దరూ పక్క ఊరు పారిజాతం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళని చూడగానే పారిజాతం అంతెత్తున లేచి "ఏమిరా, మీ పాపకి భూతం పట్టింది. నాలుగు కోళ్ళు ఇచ్చుకోండి. గొర్రెను కోయండి" అన్నది. ఇంకేముంది, వీళ్ళు అప్పులు చేసి మరీ గొర్రెను కోసారు. మొక్కులన్నీ అప్ప జెప్పి ప్రసాదాన్ని బిడ్డకి కమ్మగా తినిపించారు. దాంతో పాప మరింత లేవలేని స్థితికి చేరుకున్నది. అనారోగ్యానికి విపరీత ఆహారం కూడా తోడవ్వటంతో ఆరోగ్యం మరింత క్షీణించటం మొదలు పెట్టింది.

ఆ సమయంలో ఊరికి వచ్చాడు సోమేష్. సోమేష్ పట్నంలో చదువుతున్నాడు. పాపను చూడగానే అతను "అయ్యో! ఇదేంటి, పాపను డాక్టరుకు చూపించండి వెంటనే. నాలుగు మందులు పడ్డాయంటే బాగైపోతుంది. ఊరికే ఎందుకు, ఇట్లా ప్రాణం మీదికి తెస్తారు?" అన్నాడు.

అప్పటికే అందరి చుట్టూ తిరిగి వేసారి పోయిన రాములు-సీతాలు మరునాడే బిడ్డను తీసుకుని డాక్టరు దగ్గరకు వెళ్ళారు. డాక్టరు పాపను పరిశీలించి పాపకు అరుగుదల సరిగా లేదని, జ్వరంతోబాటు పోషకాహార లోపం ఉందని చెప్పాడు. బిడ్డకు త్వరగా అరిగే తేలికైన ఆహారం ఇవ్వాలని, పండ్లు,కూరగాయలు తినిపించాలని చెప్పాడు. బజార్లో దొరికే కుర్‌పురేలు, నూనె పదార్ధాలు పెట్టకూడదన్నాడు. జ్వరం తగ్గేందుకు మందులు కూడా ఇచ్చాడు.

నాలుగు రోజులయ్యేసరికి బిడ్డ ఆరోగ్యం కుదురుకున్నది. అటుపైన వాళ్ళు డాక్టరుగారు చెప్పినట్లుగానే పాపకు పండ్లు, కూరగాయలు, పాలు ఇవ్వటం మొదలు పెట్టారు. చూస్తూండగానే పిల్ల బలంగా తయారైంది. ఇప్పుడు ఆ పాపకు ఐదు సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలేవీ లేవు. పాప చక్కగా చదువుతుంది. సంతోషంగా ఉంటుంది.

పిల్లలు బలంగా ఎదిగేందుకు సరైన ఆహారం అవసరం. మూఢనమ్మకాలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు.