మిట్టూరులో ఉండే రాముడు చిన్నగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో వాళ్ల అవ్వే వాడిని పెంచి పెద్ద చేసింది. వాడు కొంచెం‌ పెద్దవ్వగానే ఆ ఊరి షావుకారుని బతిమాలుకుని, రాముడిని అతని దగ్గర పనికి కుదిర్చింది అవ్వ. రాముడు చాలా అమాయకుడు. చెప్పింది చేయడం తప్ప సొంతంగా ఆలోచించడం తెలియదు వాడికి. వాడి అమాయకత్వాన్ని, ముందూ వెనుకా ఎవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, జీతం బత్తెం ఏమీ ఇవ్వకుండా వాడిచేత వెట్టికి చాకిరీ చేయించుకునేవాడు షావుకారు. వరి కుప్పలు నూర్చినపుడు మాత్రం నాలుగు బస్తాల వడ్లు ఇంటికి తీసుకు పొమ్మనేవాడు. అవ్వకు, రాముడికి వాటితో సంవత్సరమంతా గడిచేది కాదు. అవ్వ కూడా పొరుగిళ్ళలో వడ్లు దంచి, పిండి కొట్టి ఇంకాస్త సంపాదించబట్టి, అతి కష్టంమీద ఇద్దరికీ సరిపడా అన్నం దొరికేది.

'తను ముసలిదైపోతున్నది. తనకేమైనా అయితే రాముడి బ్రతుకేమవుతుంది?' అని చింత పట్టుకున్నది అవ్వకి. చివరికి వాడికి తగిన పిల్లనిచ్చి పెళ్ళి చేస్తే తప్ప లాభం లేదని నిర్ణయానికి వచ్చిన అవ్వ, మంచి పిల్ల కోసం నలుగురినీ విచారించింది. చలంగారిపల్లెలో వీళ్ళ దూరపు చుట్టం రంగయ్య కూతురు సీత చాలా తెలివైందని తెలిసిందామెకు. దాంతో‌వాళ్ళతో‌మాట్లాడి, ఒప్పించి, రాముడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చేసి ఊపిరి పీల్చుకున్నది.

కాపురానికి వస్తూనే సీతకు అర్ధమైంది- మెగుడి అమాయకత్వమూ, షావుకారు చేస్తున్న అన్యాయమున్నూ.

'ఏం చెయ్యాలి?' అని కొంచెం‌ ఆలోచించిన మీదట ఆమెకు అర్థమైంది- 'ముల్లుని ముల్లుతోనే తీయాలి'.

దానికి తగిన సమయంకోసం వేచి చూడటం మొదలుపెట్టిందామె.

ఒకసారి షావుకారు ఏదో పని మీద ఊరికి వెళ్ళాడు. అది తెలిసిన సీత రాముడిని పిలిచి "ఈ గుడిసెలో ఇద్దరికి తప్పితే మూడో మనిషి పడుకోవడానికి చోటు లేదు. నేను వచ్చినప్పటినుండీ పాపం అవ్వ బయటే పడుకుంటున్నది. వచ్చేది చలికాలం. ఇక మీదట ఇట్లా వీలు కాదు- మీ షావుకారి కొట్టంలో ఊరికే పడి ఉండే సామాను తెచ్చి, సాయంత్రానికల్లా రెండు గదులతో ఓ గుడిసె వెయ్యి" అని చెప్పింది. అమాయకపు రాముడు వేరే ఏమీ ఆలోచించలేదు. హుషారుగా పరుగెత్తి, అప్పటికప్పుడు చేతికందిన సామానల్లా తెచ్చి, రెండో రోజుకల్లా గుడిసె వేసేశాడు!

ఊరునుండి వస్తూనే విషయం తెలిసింది షావుకారుకి. రాముడిని రమ్మని కబురు చేశాడు. అయితే వాడితో పాటు సీత కూడా షావుకారు ఇంటికి వచ్చింది- "నమస్కారం బాబుగారూ! మీరు దయతో పంపించిన సామాను పుణ్యమా అని చక్కని ఇల్లు ఒకటి అమరింది. ఇకమీదట నాకు కూడా మీ ఇంట్లో పని ఇప్పించండి- మీకందరికీ బాగా రకరకాల వంటలు చేసి పెడతాను బాబుగారు " అన్నది అమాయకత్వం నటిస్తూ.

రాముడిని చెడామడా తిడదామని పిలిపించిన షావుకారుకి అప్పటికప్పుడే లోలోపల లెక్కలు వేసుకునే పని పడింది. కొంచెం ఆలోచించగానే ఆయనకి సంతోషం వేసింది కూడాను- 'జీతం లేకుండా తేరగా పని చేయడానికి వీడేకాక, వీడి పెళ్ళాం కూడా దొరికింది' అని.

మరి అప్పటికే ఉన్న వంట మనిషిని ఏం చేయాలి? షావుకారు ఆమెను తీసేసి సీతని వంట పనికి పెట్టుకున్నాడు.

పదిహేను రోజులు గడిచాయి. షావుకారు భార్య సరుకులు తెప్పించమని ఓ పెద్ద చిట్టా ఇచ్చింది షావుకారుకు.

దాన్ని చూడగానే ఆయనకు మతి పోయినట్లయింది- " ఇదేమిటీ! నెల రోజులకు సరిపడా సామాను ఇంతకు ముందే తెప్పించావు కదా?! పదిహేను రోజులకే అయిపోయాయా?" అడిగాడు.

"మందిమి ఎక్కువ కాలేదూ? సీత ఇక్కడే తింటుంది; మధ్యాహ్నం పూట మొగుడిని పిలిచి భోజనం పెడుతుంది; పాపం ఇంకా మిగిలితే తప్ప అవ్వకి అసలు తీసుకుపోవటమే లేదు! అయినా తిండి దగ్గర లెక్కలు వేసుకోకండి. ఆమె రుచిగా, శుచిగా వంట చేసిపెట్టేసరికి మనం కూడా ఎక్కువ తింటున్నాం; పిల్లలు బాగా పుష్టిగా ఉన్నారు. ఈ సారి సామాన్లన్నీ కాస్తంత ఎక్కువే తెప్పించండి" విసుక్కున్నది షావుకారు భార్య.

వంటమనిషి జీతం ఆదా అవుతుందనుకున్న షావుకారు తల కొట్టుకుంటూ సరుకులు తెప్పించాడు.

అంతలోనే వరి కోతలు మొదలయ్యాయి. "కుప్పలు నూర్చాక నాలుగు బస్తాల ధాన్యం తెస్తానులే" అని చెప్పాడు రాముడు అవ్వతో. అది విన్న సీత తన నాన్నకు రమ్మని కబురు పంపింది. నాలుగేసి బస్తాల ధాన్యం ఒక బస్తాలో పట్టేట్టుగా పెద్ద బస్తాలు నాలుగు కుట్టించింది రంగయ్య చేత . కుప్పలు నూరడం అవుతూనే తండ్రితో కలిసి వెళ్ళి, తను తయారు చేయించిన నాలుగు పెద్ద బస్తాల నిండా ధాన్యం ఇంటికి తెచ్చుకుంది.

ఊళ్ళో వాళ్ళంతా ఆమె తెలివికి అశ్చర్యపోయారు. విషయం తెలిసిన షావుకారు రాముడిని పిలిచి "ఏమిట్రా! ఎక్కువ ధాన్యం తీసుకున్నావుట?" అని ఆడిగాడు.

"మీరు తీసుకోమన్నట్లు నాలుగు బస్తాలు మాత్రమే తీసుకున్నాను బాబుగారూ. ఎక్కువెందుకు తీసుకుంటాను?" అన్నాడు రాముడు. అక్కడ ఉన్న పాలేళ్ళందరూ నవ్వారు.

ఇక తన ఆటలు సాగవని గ్రహించిన షావుకారు కోపంతో సీతనీ-రాముడినీ ఇద్దరినీ పనిలో నుండి తీసేశాడు.

'అయ్యో! ఉన్న ఒక్క ఆధారమూ పోయిందే, ఇక బ్రతికేదెలాగ?" అని వాపోతున్న రాముడిని ఓదార్చింది సీత.

తండ్రి సహాయంతో రెండు ఎకరాల భూమిని కౌలుకి తీసుకుని, భర్తతో వ్యవసాయం చేయించింది. రాముడి కృషి ఫలితంగా ఆ పొలంలో బంగారుపంటలు పండాయి.

అనతి కాలంలోనే సొంతంగా ఒక ఎకరం పొలాన్ని, ఆవునీ కొనింది సీత!