పాల బుగ్గల పసివాడా
నీ బాల్య మంతా బర్లతోటేనా?
పొద్దు పొడవక ముందులేసి
పసులకు గడ్డి మోపు ఎర్రుకొని
కుడితి గోలెం కాడ నువ్వు
కుక్కవోలే కాపలుంటే
కానరాని దేవుడైనా కనికరించడాయె,
మనసున్న మనుషులైనా
మమత చూపరాయె.

ఎండ వేడి నడి వీపున
చీపురు దెబ్బోలే పడుతున్నా
కాళ్ళేమో బొబ్బలెక్కిన
పసుల కసువాయె నీబ్రతుకు,
ఎడ్లసోపతే నీదై పోయెనా?

సిన్న నాడే నీ అయ్య
సిన్న సూపు సూసినాడా
సెప్ప కుండా ఒక్క మాట
సల్లంగా ఎల్లినాడా?
గుండె నిండా బాధలెన్నున్నా
నీకు గుక్కెడు గంజి నీళ్ళు కరువాయెనా?

బడి ఈడు పిల్లలేమో
బస్తీ నేస్తం పట్టినారు.
బడి కెళ్ళే ఈడు వున్నా
బ్రతుకు బండి లాగుడాయె.
తల్లి రుణమే తీర్చుతున్నావా?

ఏదో ఒకనాడు మంచి రోజులొస్తాయి.
కష్టాలు,కన్నీళ్ళు కనుమరుగైపోతాయి.
నీ బాల్య మంత బానిసత్వమైనా,
బడి నిన్ను సాకుతుందయా,
నీ తల రాతను మార్చుకోవయా,
ఇక నీ బ్రతుకంతా పూల బాటయా,
నిన్ను ఓ తేజస్సులా నిలుపుతుందయా.