ఇవాళ్ళ సాంఘిక శాస్త్రం పరీక్ష.

"అయ్యో! నాకు చాలా భయంగా ఉంది- ఎలా రాస్తానో, ఏమిటో! పాసు కూడా అవుతానో లేదో?!.. నాకు చదువు తప్ప, వేరే ఆలోచనలన్నీ వస్తున్నాయి.. అయ్యో! ఇంకా ఐదు నిమిషాలే మిగిలాయి.. చదివినవి ఏవీ గుర్తుకు రావటం లేదు ఏంటి, నాకు?! అయ్యో, దేవుడా! నన్ను కాపాడు. ఈ పరీక్ష ఎలాగైనా పాస్ అయ్యేట్లు చెయ్, నేను పాసయితే నీ గుడికి వచ్చి, మూడో-నాలుగో కొబ్బరు కాయలు కొడతాను" అనుకుంటూ నేను బడిని చేరుకునేసరికి 'ఫూ-ఊ-ఊ' మంటూ విజిల్ వేశారు. పరీక్ష హాలు ఎక్కడుందో, ఏమో. ఇంకా చూసుకోనే లేదు నేను. టీచర్ గారు తిడుతున్నారు అందరినీ- "త్వరగా వెళ్ళండి!"అని కసురుతున్నారు-

"హమ్మయ్య! దొరికింది. ఒక్క గంతులో హాలును చేరుకున్నాను. కంగారు కంగారుగా నా నంబరు వెతుక్కొని కూర్చున్నాను. కూర్చొని తీరుబడిగా ఊపిరి పీల్చుకున్నానో‌, లేదో- ప్రశ్న పత్రం ఇచ్చేసారు. 35ప్రశ్నలకు, 22 సమాధానాలు ఇవ్వాలట! మొదటి ప్రశ్నే ఇంత కష్టంగా ఉంది.. ఇంక మిగిలిన ప్రశ్నలకు జవాబులు ఎట్లానో..?!

అంతలో ఒక విచిత్రం జరిగింది- కిటికీ దగ్గరికి ఓ కోతి వచ్చింది!

ఇంక నా మనసు పరీక్షమీది నుండి దాని మీదికి పోయింది. నేను కోతినే చూస్తున్నాను. అది అక్కడే కొంతసేపు కూర్చొని, అటుపైన ఇటూ-అటూ తిరిగింది. చివరికి కిటికీలోకి చెయ్యి వేసింది. కిటికీ ప్రక్కనే కూర్చొని పరీక్ష రాస్తున్న ఒక అబ్బాయి చేతిలోంచి గబుక్కున పెన్ను లాక్కున్నది! వాడు 'ఓ..హేయ్!' అని అరిచి క్రింద పడిపోయాడు.

మిగిలిన పిల్లలంతా వాడికేసి చూసి, తర్వాత కోతి కేసి చూశారు. హాల్లో ఉన్న అయ్యవారు ఆ పిల్లాడి దగ్గరికి పరుగెత్తారు. నేను మటుకు కోతినే గమనిస్తున్నాను.. దాని ముఖం చూస్తే నవ్వొస్తోంది నాకు. అయితే హాల్లో ఇంక గందరగోళం మొదలైంది: పిల్లలంతా దాన్నే చూస్తూ దడపడిపోతున్నారు!

పరీక్ష రాసేందుకు వచ్చిన పిల్లలు చాలామంది క్యారేజీలు తెచ్చుకొన్నారు. ఏవేవో తిండి పదార్థాలు, పండ్లు తెచ్చుకొని, ఆ సామానునంతా గదిలో ఓ మూలన, తలుపు ప్రక్కగా పెట్టుకున్నారు.

కిటికీ దగ్గరనుండి బయలుదేరిన కోతి ఇప్పుడు ఆ క్యారేజీల దగ్గరికి చేరుకున్నది. వాటి ప్రక్కనే కూర్చొని, మా అందరికేసీ చూడటం మొదలెట్టింది. నేను దానికేసి చేతులూపి 'హుష్.." అన్నాను. కోతి గబుక్కున నావైపు తిరిగి పళ్ళు చూపిస్తూ 'గుర్ర్.." మన్నది. ఇంక నేను ఏమీ అనకుండా మంచి పిల్లవాడిలా అయిపోయాను.

అంతలో కోతి మెల్లగా వెనక్కి పోయింది. అందరి చూపులూ ఇప్పుడు దానిమీదే. అంతలో అది ఒక్కసారిగా కిటికీలో నుండి లోపలకి దూకింది! అందరూ భయపడి గందరగోళంగా లేచారు. కోతి తరగతి గది అంతా తిరుగటం మొదలెట్టింది. కూర్చొని ఎవరు రాస్తుంటే వాళ్ళ దగ్గరికి పోవటం మొదలెట్టింది. చివరికి అందరూ తమ తమ స్థానాల్లో నుంచి కదిలి ఒక మూలకి రావలసి వచ్చింది!

ఒకసారి 'అందరూ కదిలారు' అనిపించిన తర్వాత, కోతి మళ్ళీ ఓసారి క్యారేజీల దగ్గరికి చేరుకున్నది. ఇప్పుడది వాటిని అన్నింటినీ లాగి పడేయటం మొదలు పెట్టింది. బుట్టలలో ఆపిల్, అరటి, జామ పండ్లు ఏవేవో దొరికాయి దానికి. అన్నిటినీ కొరికి కొరికి పెట్టింది కొంతసేపు.

నాకింక కోతి మోజు తీరిపోయింది. పరీక్ష గుర్తొచ్చింది. నిజంగానే పరీక్ష సమయం గడిచిపోతున్నది. ఎట్లాగూ నేను అంతగా ఏమీ రాయలేదు: కోతిని త్వరగా బయటకు పంపేయాలి- లేకపోతే అసలు ఏమీ రాయలేను. దీన్ని ఎలాగో ఒకలాగా తరిమేయాల్సిందే..

ఈ ఆలోచన రాగానే నా చేతులు వాటంతట అవే అక్కడ ఉన్న మ్యాపు పాయింటరును పట్టుకున్నాయి. కోతి గబుక్కున నావైపు తిరిగి పళ్ళు నూరి, ఒక్కసారిగా నా మీదికి దూకింది. నేను లేచి, తలుపులోంచి బయటికి పరుగు పెట్టాను బుల్లెట్టు మాదిరి. కోతి కూడా అంతే వేగంగా నావెంట పడింది!

కోతినుండి తప్పించుకునేందుకు బయటికి పరుగెత్తనైతే పరుగెత్తాను గానీ, అది నా వెంట పడుతుందని ఊహించలేదు నేను. తీరా వెంట పడ్డాక నాకు అంతులేని భయం వేసింది. వెనక్కి వద్దామని చూస్తే హాలు తలుపులు వేసి ఉన్నాయి! ఒకసారి కోతి బయటికి వెళ్లగానే పరీక్ష హాలులోని అయ్యవారు గది తలుపులు వేయించేశారన్నమాట!

నేను ఆ కోతిని నా వెంట అటూ ఇటూ తిప్ప గలిగినంత తిప్పాను. ఇంక అలిసిపోతున్నాననేంతలో నాకు మా పరీక్ష హాలు కిటికీ కనబడింది: అది ఇంకా తెరిచే ఉన్నది! నేను ఇంక ఏమీ ఆలోచించలేదు- ఒక్కసారిగా కిటికీ లోంచి గదిలోకి దూకేసి, వెంటనే కిటికీ తలుపు మూసేశాను!

హాల్లో ఉన్నవాళ్లంతా చప్పట్లు కొట్టి నన్ను మెచ్చుకున్నారు. అయ్యవారు కూడా నాకేసి నవ్వుతూ చూశారు. ఇంక అప్పుడు వగరుస్తూ పరీక్ష రాసేందుకు కూర్చున్నాను. ఇంకా ఒక్క గంట సమయం మిగిలి ఉన్నదేమో మరి- కానీ ఆశ్చర్యం, నాకు మటుకు అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తుకొచ్చేశాయి! ఏనాడూ రాయనంత బాగా రాసేశాను, సాంఘిక పరీక్ష! మరి నాకు ఆ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా? 87! కోతి చేసిన మేలంటే ఇదే, మరి!