ఇంట్లో ముసలివాళ్ళను ఒంటరిగా వదిలి అందరూ ఆఫీసులకు, బడులకు వెళ్ళిపోయారనుకోండి- ఆ సమయంలో వాళ్ళకు ఏదన్నా జరిగితే, వాళ్ళ వాళ్ళకి వెంటనే తెలిస్తే మంచిది కదా? కానీ ఎలా తెలుస్తుంది?

ఆరేళ్ల కెన్నెత్‌కి ఒక ఐడియా వచ్చింది. వాడు కనిపెట్టిన పరికరం ఈ సమస్యకి ఒక పరిష్కారమట! వయసైపోయిన వారు ఎవరైనా బాత్రూములో గానీ వేరే ఎక్కడన్నా గానీ జారి క్రింద పడితే, వెంటనే వాళ్ళ బాగోగులు చూసేవాళ్ళకి ఆ పరికరం ఒక మెసేజి పంపుతుందట! బాగుంది కదూ?

ఇంక ఆ మరుసటి సంవత్సరం, తనకు ఏడేళ్లప్పుడు, అతను పేషంట్లకు సాయపడే మరో పరికరాన్ని కూడా కనిపెట్టాడట: అది- 'తెలివైన మందుల పెట్టె'! మందులు వేసుకునే సమయం అవగానే అది శబ్దం చేస్తూ వెలుగులు విరజిమ్ముతుందట- మర్చిపోకుండా మందు వేసుకొమ్మని పేషంట్లకు గుర్తు చేస్తుందన్నమాట!

కెన్నెత్‌ వాళ్ళ తాతయ్యకి, జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక వ్యాధి- 'అల్జయిమర్స్' వచ్చిందట. ఎవరికీ చెప్పాపెట్టకుండా బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడట ఆయన. ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రాలేడు- దారి మర్చిపోతాడాయె! మరి ఈ సమస్యని పరిష్కరించేదెలా? వెంటనే కెన్నెత్ సెన్సార్ల గురించి, వాటిని నడిపే బ్యాటరీల గురించి, కనుక్కొని, తాతయ్య కాలి మడమ వద్ద 'ప్రెషర్ సెన్సార్' ఒకదాన్ని అమర్చాడట. దాన్ని వాడుకొని, తాతయ్య బయట అడుగు పెట్టినప్పుడల్లా వాళ్ళ అత్తయ్య మొబైల్ ఫోనుకు మెసేజ్ వెళ్ళేలా ఓ పరికరాన్ని తయారు చేశాడట! ఆ పరికరం పనితీరు చూసి ఇంటిల్లిపాదీ బిత్తరపోయారట!

మరి ఇంత చక్కటి ఆవిష్కరణలకు అవార్డు రాకపోతే ఎలాగ? వచ్చింది! అమెరికాలో 'సైంటిఫిక్ అమెరికన్' అనే ఒక పత్రిక, 150 ఏళ్ళుగా సైన్స్ సమాచారాన్ని సామాన్య ప్రజలకి అందించే వ్యాసాల్ని ప్రచురిస్తూ ఉంది. ఈ పత్రిక వాళ్ళు మూడేళ్ళుగా ప్రతి ఏటా 'సైన్స్ ఇన్ యాక్షన్' అని ఒక అవార్డు ఇస్తున్నారు. మొన్న- అక్టోబరు మాసం చివర్లోనే, ఆ అవార్డును ఈ ఏడాదికి 'కెన్నెత్ షినోజువాకు ఇస్తున్నట్లు' ప్రకటించారు! గూగుల్ కంపెనీవాళ్ళు ఏటా నిర్వహించే సైన్సు పోటీలో తను కనుగొన్న పరికరాన్ని ప్రదర్శించినందుకుగాను కెన్నెత్‌కు సైంటిఫిక్ అమెరికన్ అవార్డు వచ్చిందనమాట!

ఇప్పుడు 15ఏళ్ళున్న కెన్నెత్ అమెరికాలోని న్యూయార్క్ నివాసి. వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరూ సివిల్ ఇంజనీరింగు ప్రొఫెసర్లు. 'ఆధునిక సాంకేతికత మనుషుల జీవితాల్ని ఎలా మార్చగలదో' కెన్నెత్‌కు దీనితో అర్థమైందట. 'భవిష్యత్తులో ఇంజనీరింగునూ-న్యూరో సైన్సునూ రెంటినీ కలుపుతూ అల్జయిమర్స్ వ్యాధికి పరిష్కారం కనుక్కోవటం' తన కోరికట! కెన్నెత్ సమాజానికి ఉపయోగపడే మరిన్ని పరికరాలను ఆవిష్కరించాలని ఆశిద్దాం!

ఇది మీకెందుకు చెబుతున్నానంటే- చూశారుగా, సమస్యలు మనకూ లెక్కలేనన్ని ఉన్నాయి. కెన్నెత్‌లాగా ఒక్కో సమస్యకూ పరిష్కారం కనుక్కుంటూ పోతే మనందరి జీవితాలూ సరళం అవుతాయి- కదూ?