అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. అవ్వకు ఒక మనుమడు ఉన్నాడు. వాడి పేరు బాబు. బాబు చాలా దుబ్బగా ఉండేవాడు.







కొన్నేళ్లకి బాబు స్కూలుకి వెళ్ళాడు. స్కూల్లో పిల్లలందరికీ వాడిని చూడగానే 'దుబ్బోడి పాట' గుర్తుకొచ్చింది:
దుబ్బోడమ్మా దుబ్బోడు
దుబ్బ బిస్కెట్ తిన్నాడు
ఇంకా కావాలన్నాడు
అమ్మకు కోపం వచ్చింది
మూడు గుద్దులు గుద్దింది
అని పాడటం మొదలు పెట్టారు.
బాబుకి ఏడుపొచ్చింది. ఇంటికి పరుగెత్తి అవ్వకు చెప్పాడు- "వీళ్లంతా నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారో చూడు' అన్నాడు.





అవ్వకు మంత్రాలొచ్చు. ఆమె ఆలోచించింది. ఎవరైనా నిన్ను 'దుబ్బోడు' అన్నారనుకో, అప్పుడు నువ్వు వాళ్ళని 'టింగుడు బిళ్ళ' అని పిలువు. ఇంక వాళ్ల పని ఏమౌతుందో చూడు అని చెప్పింది.

ఆ మరుసటి రోజు బాబు స్కూలుకి వెళ్ళగానే పిల్లలు చాలామంది 'దుబ్బోడా-దుబ్బోడా' అన్నారు ఎగతాళిగా. బాబు కోపంతో పళ్ళు బిగించి "ఈ పిల్లలందరూ టింగుడు బిళ్ళ" అన్నాడు. అనగానే అందరూ మాయపోయారు!







బాబుకి సంతోషం వేసింది. గబగబా ఇంటికి వచ్చి అవ్వకి ఈ సంగతి చెప్పాడు.










అవ్వ సంతోష పడ్డది. 'మా నాయనే, ఎంతమంచి పని చేశావు!' అని మెచ్చుకున్నది వాడిని.









అంతలో బాబుకి ఆకలైంది. జిలేబి గుర్తుకొచ్చింది. 'జిలేబి కావాలి' అని అవ్వని అడిగాడు. 'లేవు దుబ్బోడా! అయిపోయినాయిరా దుబ్బోడా!' అన్నది అవ్వ, అలవాటుగా.
'దుబ్బోడు' అని వినగానే బాబుకి కోపం వచ్చేసింది. 'ఈ అవ్వే టింగుడు బిళ్ళ!' అన్నాడు గబుక్కున. దాంతో అవ్వ కూడా చటుక్కున మాయమైపోయింది.






అంతలో స్కూలు పిల్లల తల్లిదండ్రులంతా వచ్చి బాబు ఇంటి ముందు మూగారు.
'ఏమిరా దుబ్బోడా! మా పిల్లల్ని ఎలా మాయం చేశావురా? మా పిల్లల్ని తిరిగి రప్పించరా!' అన్నారు.
'దుబ్బోడు' అన్న మాట వినిపించగానే బాబుకి కోపం వచ్చేసింది. వాళ్ళకేసి చూసి చేతులు తిప్పుతూ 'వీళ్లంతా టింగుడు బిళ్ళ' అన్నాడు. అంతే! వాళ్లంతా మాయమైపోయారు!




అంతలో బాబు బంధువులంతా వచ్చారు అక్కడికి. 'ఏంటిరా దుబ్బోడా! అవ్వకు ఏమైందిరా?' అన్నారు. దుబ్బోడు యథాప్రకారమే 'ఈ బంధువులంతా టింగుడు బిళ్ళ' అనేశాడు. వాళ్లంతా కూడా మాయం అయిపోయారు.
ఇంక అప్పుడు బాబు ఒక్కడే అయిపోయాడు. వాడికి తెలిసినవాళ్లంటూ ఎవ్వరూ లేకుండా పోయారు. దాంతో‌ వాడికి చాలా దిగులు వేసింది. వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకొని ఏడ్చాడు.
'ఇంక నువ్వు ఒక్కడివే మిగిలివున్నావు, ఎందుకు? నువ్వు కూడా టింగుడు బిళ్ళ అయిపోరాదూ?' అనుకున్నాడు. అంతే! మరుక్షణం వాడు కూడా మాయమైపోయాడు!