పవన్, వాడి స్నేహితులు ముగ్గురు- రోహిత్, సునీల్, రవి- నలుగురూ బస్టాపులో నిలబడి ఉన్నారు. అందరూ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు:

అంతలో అకస్మాత్తుగా ప్రక్క సందులోంచి కారు ఒకటి- వేగంగా వచ్చి, పవన్ ముందు నిలబడింది. అది అంత దగ్గరగా వస్తుందని ఊహించని పవన్ తూలి ఒక్క అడుగు వెనక్కి వేసాడు-

అంతలోనే హఠాత్తుగా ఇద్దరు మనుషులు కారులోంచి దిగారు గబగబా. ఏం జరుగుతోందో తెలిసే లోపే పవన్‌ను పట్టుకొని కారులోకి నెట్టారు! ప్రక్కనే నిలబడి ఉన్న రోహిత్ వాళ్లను అడ్డుకున్నాడు; కానీ వాడికంటే చాలా బలంగా ఉన్నారు కదా, ఆ యిద్దరూ వాడిని ప్రక్కకు తోసి పడేసారు. పవన్‌ను కారు లోపలికి నెట్టిన మరుక్షణం గూండాలు ఇద్దరూ కారులోకి ఎక్కారు; కారు ముందుకు దూసుకుపోయింది!

పవన్ స్నేహితులు ముగ్గురూ హాహా మని అరుస్తూ కారు వెంట పడ్డారు. కానీ ఎంత దూరమని పరుగెత్తుతారు? వాళ్ళు చూస్తుండగానే కారు కనుమరుగయ్యింది.

ఇక కారు లోపల, పవన్‌ గూండాలిద్దరితోటీ పెనుగులాడేందుకు ప్రయత్నించాడు. అయితే నాలుగు బలమైన చేతులు వాడిని నొక్కి పెట్టి ఉంచాయి. వాడు కదిలిన కొద్దీ అవి వాడిని మరింత బలంగా ఒత్తాయి. దాంతో వాడు బుద్ధి తెచ్చుకున్నట్లు కదలక మెదలక ఉండిపోయాడు.

అయినా వాడి బుర్ర మటుకు చురుకుగా పనిచేయసాగింది: "వీళ్ళు ఎవరు? తననే ఎందుకు పట్టుకున్నారు? ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు? ఎందుకు?.."

రాము ప్రక్కన ఉన్న కిటికీ తెరచే ఉన్నది. దాని గుండా చల్లటి గాలి వస్తోంది. రాము మెల్లగా తన పుస్తకం ఒక దాన్ని కిటికీలోంచి బయటికి జారవిడిచాడు.

"క్యా బోల్తా హై లడకే కా బాప్?" అడిగాడు కారు డ్రైవరు.

"క్యా కరేగా, పచాస్ లాఖ్ లాకర్ దేదేగా" ఇకిలించాడు ఒక గూండా.

"ఔర్ కుఛ్ కర్ భీ నహీ పాయేగా" పెద్దగా నవ్వాడు మరొకడు.

పవన్‌కు హిందీ రాదనుకొని వాళ్ళు ముగ్గురూ ఆ భాషలో మాట్లాడుకుంటున్నారు.

కానీ‌ పవన్‌కు హిందీ వచ్చు- వాళ్ళ మాటలు అర్థం అవుతున్నాయి వాడికి. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఎన్ని

ప్రయోజనాలో..! పవన్ మెల్లగా మరో పుస్తకాన్ని బయటికి జారవిడిచాడు..

పవన్ వాళ్ళ నాన్న ఆ ఊళ్ళో‌ పేరున్న పారిశ్రామిక వేత్త. వీళ్ళు పవన్‌ని కిడ్నాప్ చేసి, వాళ్ళ నాన్నని యాభై లక్షల రూపాయలు ఇమ్మని అడుగుతారన్నమాట!

పవన్ తన దగ్గరున్న వస్తువుల్ని, పుస్తకాలను ఒక్కటొక్కటిగా బయటికి జార విడుస్తూ వచ్చాడు. అతని దగ్గరున్న చివరి వస్తువును బయట పడేసాక కొంత సేపటికి కారు ఆగింది.

"బాంధ్ దో లడకేకో. ఉస్కా బాప్ ఆనే తక్ ఉస్కో కుఛ్ నహీ దేనా" అన్నాడొకడు.

మరొకడు పవన్‌ను బయటికి లాగాడు. పవన్ చుట్టూ కలయ చూశాడు- అక్కడంతా నిర్జనంగాఉంది. చుట్టు ప్రక్కల వేరే ఇళ్ళేమీ ఉన్నట్లు లేదు. కారు ఓ ఒంటరి ఇంటి ముందు ఆగి ఉన్నది.

గూండాలు ముగ్గురూ కలిసి పవన్‌ను ఆ ఇంట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఒక స్తంభానికి కట్టేశారు వాడిని. అటుపైన గూండాలు ముగ్గురూ హిందీలోనే మాట్లాడుకుంటూ గదికి తాళం పెట్టి బయటికి వెళ్ళిపోయారు.

పవన్ కొంతసేపు పెనుగులాడాడు. కానీ దొంగలు వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నారు- ఏమీ పెద్ద ప్రయోజనం లేకపోయింది.

ఒక గంట-రెండు గంటలు గడిచేసరికి ఇంటి బయట శబ్దం అయ్యింది. "పవన్.. పవన్.." అని అరుపులు వినబడ్డాయి. ఎవరో పవన్ ఉన్న గది తాళం పగలగొట్టి లోనికి వచ్చారు- పోలీసులు! వాళ్ల వెనకనే రోహిత్, సునీల్, రవి!

"తొందరగానే కనుక్కున్నారే!" నవ్వాడు పవన్.

"తెలివంటే నీదేరా! పుస్తకాలు పడేయటం చాలా గొప్ప ఐడియా!" మెచ్చుకున్నారు మిత్రులు ముగ్గురూ, పవన్ మీదికి దూకి వాడి కట్లు విప్పేస్తూ.

"చాలు చాలు. ఇప్పుడింక శబ్దం చెయ్యకండి. దొంగలు ఏ క్షణాన్నైనా వచ్చేస్తారు. మీరు ఈ‌ గదిలోనే ఓ మూలగా కూర్చొని ఉండండి, కదలకుండా" అన్నారు పోలీసులు కూడా నవ్వుతూ, ఇంట్లో అన్ని ప్రక్కలా దాక్కుంటూ.

కొంత సేపు గడిచింది. కొంతసేపటికి పవన్‌ను పట్టుకున్న గూండాల గొంతులు వినబడ్డాయి.

ఇంటి తలుపులు చూడగానే వాళ్లకు ఏదో అనుమానం వచ్చినట్లున్నది- మాటలు ఆగిపోయాయి. పోలీసులు తుపాకులు సర్దుకొని నిలబడ్డారు అన్ని ప్రక్కలా. వాళ్ళు తలుపులు తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే అన్ని వైపులనుండీ చుట్టుముట్టేశారు వాళ్ళని!

అట్లా ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి పోలీసుల చేత చిక్కింది. ఎంతో కాలంగా వెతుకుతున్న ముఠా దొరికినందుకు పోలీసు అధికారులు చాలా సంతోషపడ్డారు. పిల్లల్ని బలే మెచ్చుకున్నారు. కిడ్నాపర్లను విచారించి, వాళ్లు అంతకు ముందు ఎత్తుకెళ్ళిన పిల్లల వివరాలనూ సేకరించారు పోలీసులు. అట్లా ఇంకా చాలామంది పిల్లల్ని రక్షించిన వాళ్ళయ్యారు పవన్‌ బృందం.

ఆ ఏడాది పిల్లలు నలుగురికీ సాహస బాలుర మెడళ్ళు అందాయి.