మంజుల, వాళ్ల తమ్ముడు 'ఫండు '- ఇద్దరూ మారాల హైస్కూల్లో చదువుతున్నారు. అది ఏప్రిల్ నెల- ఒంటిపూట బడి. ఎర్రటి ఎండ. ఆ ఎండలో రెండు కిలోమీటర్లు నడవాలి. గుండ్లవాగులో నీళ్ళ చుక్క ఉండదు. దాన్ని దాటాక చింతతోపు వస్తుంది.. చింతతోపు అవతల ఉంది బడి.

ఎప్పటిలాగే ఆ రోజునా బడికి బయలు దేరారు అక్కా-తమ్ముడూ. అంతలోనే పెద్దగా శబ్దం చేస్తూ వచ్చింది- సుడిగాలి! దుమ్ము-ధూళి, చెత్తా-చెదారం- ఏది దొరికితే దాన్నల్లా తీసుకుని, ఆకాశాన్ని తాకుతూ వచ్చేసింది చింత తోపులోకి!

మంజుల పరుగెత్తి చింత చెట్టు మాటున దాక్కుంది. ఫండు మాత్రం ఆ 'సుట్ర గాలి'లో చిక్కుకున్నాడు. బయటికి రాలేకపోయాడు పాపం.. పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. వాడినే చూస్తున్న మంజుల పరుగెత్తి వెళ్ళి వాడిని కాపాడాలనుకుంది. కానీ భయంతో‌ ఆ పాప కాళ్ళు నేలకు అతుక్కుపోయాయి!

కొంతసేపటికి ఆ సుడిగాలి వెళ్ళిపోయింది. ఫండు మటుకు ఇంకా నేలమీదే పడి ఉన్నాడు. చెట్టు చాటు నుండి పరుగున వచ్చి, ఫండును లేవనెత్తింది మంజుల. వాడు భయంతో బిగుసుకుపోయి ఉన్నాడు; ఇంకా తేరుకోలేదు. కళ్ళు తెరిచాడుగానీ, దేన్ని చూస్తున్నాడో అర్థం కావటంలేదు. మంజుల వాడిని ఏమి అడిగినా జవాబు రాలేదు- చివరికి ఆ పాప వాడిని తీసుకొని ఇంటికి వచ్చేసింది.

ఇల్లు చేరుకోగానే వాడు వెళ్ళి అరుగు మీద పడుకున్నాడు. మధ్యాహ్నమైనా లేవలేదు. "బువ్వ తినకుండా పడుకున్నావేందిరా?" అడిగింది వాళ్ళమ్మ పార్వతి. "వాణ్ని సుట్రగాలి కింద పడేసిందమ్మా!" జవాబిచ్చింది మంజుల.

అది వినగానే పార్వతమ్మ చేతిలో ఉన్న గిన్నెను నేలమీద పడేసి ఏడవటం మొదలుపెట్టింది- "అయ్యో! నాయనో! నాకొడుక్కి పెద్ద పిశాచి సోకిందిరో!" అని పెద్దగా అరవసాగింది.

వాళ్ళ నాన్న భీమన్న గబుక్కున వచ్చాడు- ఫండును ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఫండు ఒళ్ళు వేడిగా ఉంది. ఏదేదో గొణుగుతున్నాడు- అర్థం పర్థం లేకుండా. మధ్య మధ్యలో ఏడుస్తున్నాడు. మళ్ళీ తనంతట తనే సర్దుకుంటున్నాడు.

ఈ లోపల పార్వతి పరుగున పోయి మారాల భూతవైద్యుడిని పిలుచుకు వచ్చింది.

భూతవైద్యుడు నాగులయ్య వచ్చీ రాగానే కాస్తంత సున్నం తెమ్మన్నాడు. ఫండు అరచేతి లో సున్నం పెట్టాడు. నీళ్ళతో తేమ చేశాడు. ఏదో మంత్రం చదువుతూ చూపుడు వేలితో సున్నాన్ని కలిపాడు. అంతే- సున్నం గులాబి రంగులోకి మారింది! దాన్నే చూస్తున్న పార్వతమ్మ సన్నగా ఏడుపు లంకించుకున్నది. భీమన్న ముఖం జేవురించింది. నాగులయ్య ఏదో అర్థమైనట్లు సంతృప్తిగా లేచాడు- "చూశారుగా?! వీడిని బేతాళ పిశాచి ఆశించింది. బేతాళ దోషం అంటే మామూలుది కాదు. అది పోవాలంటే ముగ్గు పోసి అమావాస్య నాడు పూజ చేయాలి. ఐదువేల రూపాయలు ఖర్చు అవుతుంది" అని చెప్పాడు.

"అంత ఇవ్వలేం! బీదోల్లం!" అని మొత్తుకున్నారు తల్లిదండ్రులు. చుట్టు ప్రక్కల వాళ్ళందరూ సర్దిచెప్పాక, చివరికి అసంతృప్తిగానే రెండువేలకు బేరం కుదుర్చుకున్నాడు నాగులయ్య.

భీమన్న చేతిలో డబ్బులు లేవు. అప్పటికప్పుడు వడ్డీ వ్యాపారి "సన్నమెడ గోవిందు" దగ్గరికి పోయి డబ్బు తెచ్చాడు అప్పుగా. నాగులయ్య ఆ డబ్బును తీసుకున్నాడు- "పట్నం పోయి పూజా సామగ్రి తెస్తాను. అమావాస్య నాటి రాత్రి పూజ! సిద్ధంగా ఉండండి మరి!" అని చెప్పి వెళ్ళి పోయాడు.

ఫండుకు బాగా లేదన్న సమాచారం పట్నంలో చదువుతున్న "డౌసు" అన్నను చేరింది. డౌసు భీమన్నకు ఫోన్ చేసి, సంగతంతా కనుక్కున్నాడు.

"పూజ ఎప్పుడు చేస్తాడంట?" అడిగాడు భీమన్నను.

"వచ్చే అమావాస్య రోజున!" చెప్పాడు భీమన్న. "నేనూ వస్తానులే, ఆరోజు పూజకు!" చెప్పాడు డౌసు. "సరే, రా! అంతకంటేనా?" అన్నాడు భీమన్న.

అమావాస్య రానే వచ్చింది. పూజకు అంతా సిద్ధం చేశాడు నాగులయ్య. గది మధ్యలో ఏదో వింత ఆకారంలో ముగ్గు పోశాడు. దాని మీద అక్కడక్కడా కొంచెం బియ్యం పోశాడు. అంతలో అకస్మాత్తుగా "ఓసారి ఆగు పెద్దయ్యా!" అన్నాడు డౌసు. "ఏదీ, నీ అరచేయి చాపు, ఓసారి!" అన్నాడు.

నాగులయ్య చెయ్యి చాపాడు.

పార్వతమ్మ అతని అరచేతిలో సున్నం వేసి తేమ చేసింది.

డౌసు అతని ముందు నిలబడి, గట్టిగా ఏదో అరుస్తూ ఆ సున్నాన్ని తన చూపుడు వేలితో రుద్దాడు. ఆశ్చర్యం! అది గులాబి రంగులోకి మారింది!

నాగులయ్య ఖంగుతిన్నాడు.

"ఇప్పుడు చెప్పండి పార్వతమ్మక్కా!? బేతాలుడు ఎవరికి సోకినాడు?" అడిగాడు డౌసు.

పార్వతమ్మ, భీమయ్య ల నోట మాట రాలేదు. అక్కడ చేరిన వాళ్లంతా నాగులయ్యకేసి అనుమానంగా చూశారు. కొందరు అడుగు ముందరికి వేసి అతన్ని కొట్టేందుకు సిద్ధపడ్డారు.

నాగులయ్య తన మోసాన్ని ఒప్పుకున్నాడు; భీమన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు. "ఇలా బీదవాళ్ళకు ఎన్నడూ అన్యాయం చెయ్యొద్దు, చెబుతున్నాను చూడు!" అని అతన్ని మందలించి పంపాడు డౌసు.

అతను అటు పోగానే భీమన్న అడిగాడు- "పాపోడా! అచ్చం నాగులయ్య చేసినట్లే ఎలా చేసావయ్యా?!" అని.

"ఏమీ లేదు పెద్దయ్యా! బేదులు(విరేచనాలు) అయ్యేందుకు మాత్రలు దొరుకుతాయి దుకాణాల్లో- 'పర్గోలాక్స్' అని- ఆ మాత్రను ఒకదాన్ని బాగా మెత్తగా నూరి, పొడి చేసి, ముందుగానే చూపుడు వేలికి రుద్దుకోవాలి. సన్న పొడి కదా, అందుకని అది పైకి కనబడదు. ఆ తర్వాత సున్నాన్ని తేమగా చేసి, ఆ వేలితో రుద్దామనుకో, అప్పుడు రసాయనిక చర్య జరుగుతుంది. సున్నం‌ గులాబి రంగులోకి మారుతుంది! అంతే! ఇందులో ఉన్నది చాలా మామూలు సైన్సు! పాదాలకు పసుపు రాసుకొని, దానిమీద సున్నంతో గీతలు గీస్తే ఎర్రటి పారాణి తయారవ్వట్లేదూ? అలాగన్నమాట!" చెప్పాడు డౌసు, పర్గోలాక్స్ మాత్ర కవరును చూపెడుతూ.

"మరి సుట్రగాలిలో దయ్యం ఉంటుంది గదరా? లేకపోతే సుడిగాలిలో పిల్లలు అలాగ ఎందుకు అయిపోతారు?" అడిగింది పార్వతమ్మ.

"అలాంటిదేమీ లేదమ్మా! ఎండాకాలంలో వాతావరణం వేడెక్కుతుంది గదా; అట్లా వేడెక్కిన గాలి తేలికౌతుంది. తేలికైన గాలి పైకి ప్రయాణిస్తుంది.

అయితే, అది ఖాళీ చేసిన ప్రాంతంలో పీడనం తగ్గిపోతుంది. గాలి లక్షణం ఏంటంటే, ఎక్కువ పీడనం ఉన్న చోటినుండి అల్పపీడనం ఉండే ప్రాంతానికి వేగంగా దూసుకొని రావటం. అట్లా అన్ని వైపుల నుండీ దూసుకొచ్చిన గాలి ప్రవాహాలు ఒక దాన్ని మరొకటి ఢీకొని, సుడి తిరుగుతూ పైకి లేస్తాయి.

వాతావరణంలోని మార్పుల వల్ల అట్లా సుడిగాలులు ఏర్పడతాయనమాట. గాలులు ఎంత వేగంగా వస్తాయన్నదాన్ని బట్టి, ఇవి చాలా బలంగా కూడా ఉండచ్చు. ఒక్కోసారి వీటి తాకిడికి పెంకుటిళ్ళ కప్పులూ దెబ్బతింటాయి! వేసవికాలంలో మైదాన ప్రాంతాల్లో తరచుగా వస్తాయి ఇవి. ఇదంతా తెలీదుగా, మనకు? అందుకనే, ఇదిగో- ఈ నాగులయ్య లాంటి వాళ్ళు 'దయ్యం, భూతం' అని చెప్పి, మనల్ని భయపెట్ట-గల్గుతున్నారు.

మూఢనమ్మకాలను ఇంకా వ్యాప్తి చేయగల్గుతున్నారు" వివరించాడు డౌసు.

"మరి ఏమంటావురా, ఫండుకు ఏం కాదుగా?" అడిగాడు భీమన్న.

"వాడు భయపడ్డాడు- అంతే, పెద్దయ్యా! ధైర్యం చెబితే కోలుకుంటాడు. పిల్లలు బాగా భయపడితే తేలికపాటి జ్వరం వస్తుంది కదా, ఇదీ అలాంటిదే. తగ్గిపోతుందిలే" అన్నాడు డౌసు.

"ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు లేక, మేం అందరం ఇట్లా మోసపోతున్నాం‌ పాపోడా!" అని పార్వతి, భీమన్నలు కృతజ్ఞతలు చెప్పుకున్నారు డౌసుకు.