అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక బుల్లి కుందేలు ఉండేది. ఒక రోజు ప్రొద్దున్నే అది నిద్రలేచి, తన పొదలోంచి బయటకు వచ్చి, ఒళ్ళు విరుచుకుంటూ అటూ‌ ఇటూ చూసింది. అప్పుడప్పుడే తెలవారుతూ ఉంది.
సూర్యుడి కిరణాలు పడి అడవి అంతా బంగారు రంగులో మెరిసి పోతూ ఉంది. అది చూసే సరికి బుల్లి కుందేలుకి బోలెడు సంతోషం వేసింది.
ఆ సంతోషంలో కుందేలు చెంగు చెంగు మని గెంతులేస్తూ తనుండే పొద చుట్టూ తిరిగింది.


అంతలోనే దానికి చాలా ఆకలేసింది. చెంగుచెంగున గెంతుకుంటూ‌ తినటానికి ఏమైనా వెతుక్కోవటానికి బయలుదేరింది.

ఏవో దుంపలు కొన్ని తిని, చెరువులో నీళ్ళు తాగి, మళ్ళీ చెంగుచెంగు మంటూ గెంతటం మొదలు పెట్టింది బుల్లి కుందేలు.

అటూ, ఇటూ , ఆ చెట్టు దగ్గరకి ఈ చెట్టు దగ్గరికి , ఆ రాయి మీదకు, ఈ ఆకు మీదకు గెంతులేస్తూ తిరిగింది, తిరిగింది, తిరిగింది, తిరుగుతూనే ఉంది. తిరిగి తిరిగి చివరకు కాళ్ళు నెప్పులు వచ్చేశాయి పాపం బుల్లి కుందేలుకి.


'అవునే, ఈ కాలు నెప్పితో ఇంటికెలా వెళ్ళాలి బాబోయ్!' అని అనుకుంటూ ఉంటే, ఎదురుగా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్న తాబేలు కనిపించింది.

అప్పుడు కుందేలు తాబేలు దగ్గరకు వెళ్ళి "తాబేలు తాతా , తాబేలు తాతా, తిరిగి తిరిగి నా కాళ్ళు నెప్పిపుడుతున్నాయి. నెప్పి తగ్గాలంటే ఏంచేయాలో తెలుసా" అని అడిగింది.




అది విని తాబేలు "మీ కుందేళ్ళకు కాలి దురద ఎక్కువ. ఎప్పుడూ కాలుకాలిన పిల్లిలాగ అటూ ఇటూ గెంతుతూ ఉండకపోతే, మాలా నెమ్మదిగా నడవటం నేర్చుకోవచ్చు కదా? ఒకప్పుడు మీ తాత తను వేగంగా పరిగెత్తగలననుకొని, నాతో పరుగు పందెం వేసుకొని ఓడిపోయాడు తెలుసా? ఎప్పుడైనా నిదానమే ప్రధానం, ఊరికే పరుగులెత్తి ఏమీ సాధించలేరు" అని తన దారిన తను వెళ్ళిపోయింది.

'కాలు నెప్పి తగ్గటానికి ఏమైనా చిట్కాలు చెపుతుందేమో అనుకుంటే పెద్ద ఉపన్యాసం దంచేసింది. ఏమిటో!' అనుకుంటూ ఇంటి ముఖం పట్టింది కుందేలు. ఇంతలో ఒక ఏనుగు ఎదురొచ్చింది.

"ఏనుగు బావా, ఏనుగు బావా, తిరిగి తిరిగి కాళ్ళు నెప్పి పుడుతున్నాయి. తగ్గటానికి ఉపాయం ఏమైనా చెప్తావా" అని అడిగింది కుందేలు .

మంచి చెరుకుగడలు నాలుగు నమిలితే ఎలాంటి నెప్పైనా దెబ్బకి తగ్గిపోతుంది. అని చెప్పింది ఏనుగు. "అవునా? మరి చెరుకు గడలు ఎక్కడ దొరుకుతాయి? అని అడిగింది కుందేలు.





సూటిగా ఇటువైపు వెళ్ళితే, కొంచెం దూరం వెళ్ళేసరికి ఎదురుగా చెరకు తోటలు కనిపిస్తాయి" అని చెప్పి వెళ్ళిపోయింది ఏనుగు.

కష్టపడి లేచి ఓపిక తెచ్చుకొని, చెరుకు తోటకు బయలు దేరింది కుందేలు. తీరా వెళ్ళి చూసే సరికి ఆ చెరుకుని ఎలా తినాలో అర్థం కాలేదు కుందేలుకి. నోటితో కొరుకుదామని ప్రయత్నిస్తే, నోరు నెప్పి పుట్టింది. కానీ చెరుకు మాత్రం, కొరుకుడు పడలేదు. "లాభం లేదులే !" అని దాన్ని వదిలేసి, మళ్ళీ ఇంటిముఖం పట్టింది కుందేలు.




వెళుతూ ఉంటే, ఒక చీమ ఎదురొచ్చింది. "చీమక్కా, చీమక్కా, తిరిగి తిరిగి కాళ్ళు నెప్పిపుడుతున్నాయి. నడవలేక పోతున్నాను, బలానికి ఏమైనా ఉపాయం తెలిస్తే చెప్పవా?" అని అడిగింది కుందేలు.

"కాళ్ళు నెప్పి పుడితే, 'కాళ్ళ నెప్పి' అని అందరితోటీ అంటూ కూర్చోకూడదు. నోరు మూసుకొని చెప్పిన పని చేసుకుంటూ పోవాలి అంతే, నాకు పనికి ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తా" అని చీమ వెళ్ళిపోయింది.


కుం‌దేలుకు ఏమీ అర్థంకాక, బుర్రగోక్కొని మళ్ళీ ఇంటి దారి పట్టింది. వెళుతూ వెళుతూ ఉంటే ఎలుగుబంటి ఎదురొచ్చింది.

ఈ ఎలుగుబంటైనా ఏదో ఒక చిట్కా చెప్పకపోతుందా అని, "ఎలుగు మామా! ఎలుగు మామా! తిరిగి తిరిగి కాళ్ళు నెప్పి పుడుతున్నాయి. నెప్పులు తగ్గటానికి ఉపాయమేమైనా చెప్పవా?" అని అడిగింది కుందేలు.

"తేనె దివ్యౌషథం అల్లుడూ! ఎలాంటి నెప్పులయినా చిటికెలో తగ్గిపోతాయి!" అని చెప్పింది ఎలుగుబంటి. "అవునా? మరి తేనె ఎక్కడ దొరుకుతుంది" అని అడిగింది కుందేలు.

"అదిగో ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూశావా, ఆ చెట్టుకు ఒక పెద్ద తేనె పట్టు ఉంది" అని చెప్పింది ఎలుగుబంటి.

కుందేలు అక్కడికి వెళ్ళి, పొడుగాటి కర్ర ఒకటి తీసుకొని, ఆ తేనె పట్టుని చటుక్కున కదిలించింది. అంతే- తేనెటీగలన్నీ ఝుమ్మని ఒక్క సారిగా లేచి కుందేలు వెంటపడ్డాయి- కుందేలు బెదిరిపోయి ఒకటే పరుగు- తన పొదలోకి వచ్చి దూరినా ఆపలేదు!

ఇంట్లోకి వచ్చి ఆయాసం తీర్చుకునే సరికి, ఆ అలసటకి నిద్రముంచుకొచ్చేసింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది కుందేలు. తెల్లారి లేచి చూసుకుంటే కాళ్ళు నెప్పి మాయమయిపోయింది!

"ఓహో! ఒళ్ళు నెప్పులన్నీ నిద్రపోతే తగ్గుతాయన్నమాట!" అనుకొని, మళ్ళీ చెంగు చెంగున గంతులు వెయ్యటం మొదలు పెట్టింది కుందేలు పిల్ల.