అటుపైన చిత్రవర్ణుడి అనుచరులు అందరూ అదే విధంగా నన్ను తిట్టారు. వాళ్లలో నన్ను ఎవరు ఎన్ని మాటలన్నారో చెప్పలేను. శత్రువును యముడి దగ్గరికి పంపేవరకూ చల్లారేవి కావు అవి- ఆ మాటలన్నీ ఎప్పటికీ నా మనసును పట్టి పీడిస్తూనే ఉంటాయి. అయినా నేను బలహీనుడిని: కనుకనే, నా తక్కువతనానికి లొంగి, అవమానాన్ని మ్రింగి, ఎప్పటిలాగానే అందరిలోనూ నా యీ తలని ఇట్లా ఊపుకుంటూ నడుస్తున్నాను. ఛీ, నాదీ ఒక పౌరుషమేనా?! అభిమానం ఉన్నవాడు ఎవడూ యీ అవమానాన్ని దిగమ్రింగి ఊరుకోలేడు. చేతనత్వం లేని సూర్యకాంత-మణి కూడా సూర్యుడి కిరణాలు సోకగానే వెలుగులు చిమ్ముతుందే, మరి చేతనుడైన అభిమానవంతుడు ఇట్లా పగవారు తనకు చేసిన అవమానాన్ని ఎలా సహిస్తాడు? అయినా నా యీ అవమానపు గాధను తమరికి విన్నవించుకోవాలన్న కోరికే నా ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టకుండా‌కట్టిన త్రాడు మాదిరి నన్ను ఇక్కడికి ఈడ్చి తెచ్చింది తప్ప, మరొకటి కాదు.

అయ్యో! 'విధి చేష్ఠ ఎలాంటిది' అంటే ఏం చెప్పను? నాకు ఇలా కొండంత బలగం‌ ఉండీ ఎవ్వరూ లేని అనామకుడినై, నాది కాని దేశంలో, దిక్కుమాలిన పక్షినై నిలబడాల్సి వచ్చింది చూడండి! అదే విధి చేష్ఠ. మీవంటి గొప్ప ప్రభువుకు అనుచరుడినై ఉండి కూడా, శత్రువుల ముందు చేతగానివాడి మాదిరి నిలబడి, నిండు సభలో రోత పుట్టించే మాటలు అన్నన్ని వినవలసి వచ్చిందే, అదే, విధిచేష్ఠ!

గడచిపోయిన సంగతుల గురించి ఇప్పుడు విచారపడి ప్రయోజనం లేదు గానీ, మరవాలనుకున్నా మరపుకు రాక, ఆ భంగపాటు నా మనసులో శూలం లాగా నాటుకొని సలపరిస్తూ ఉన్నది. నాకు ఇన్ని అవమానాలెందుకు? 'పగవారి చేత చిక్కి కష్టపడు' అని విధి ఆ విధంగా రాసి పెట్టి ఉంటే ఎవ్వరు తప్పించుకోగల్గుతారు? ఈ సంగతినంతా దేవరవారి సమ్ముఖంలో తెలియజేసి, తమరి మనసుకు కష్టం కలిగిస్తున్నందుకు నా మనసు ఎంత క్షోభిస్తున్నదో చెప్పలేను.

అక్కడ చిత్రవర్ణుడు కొంచెం దయ తలచి, నన్ను చంపేందుకు మనసు రాక, 'పరాయి దేశస్థుడులే' అని ఊరికే వదిలి పెట్టాడు. తమరి పాద పద్మాలను మళ్ళీ చూసే అదృష్టం బలంగా ఉంది కాబట్టి, యుద్ధం ఇలా ముంచుకు రానున్నదన్న వార్తను మోసుకొని ఇట్లా రాగలిగాను.

మార్గాయాసం వల్ల నా మనసు ఇంకా అదుపులోకి రాలేదు; అంతే కాకుండా దు:ఖంతోటీ, విషాదం తోటీ చితికిపోతున్న నా హృదయం ఇంతకంటే ఎక్కువగా ఏమీ విన్నవించుకోలేదు. నా ప్రభువుల వారికి వార్తావిశేషాలను అన్నిటినీ‌ నివేదించాలన్న ఉత్సాహం, ప్రభువుల సన్నిధిలో కొంతసేపు నిలబడి సేద తీరాలన్న కోరిక ఆలంబనలుగా ఇంతసేపు నిలబడగల్గాను. నాకు తెలిసినంతవరకు ఏదీ దాచకుండా జరిగినదంతా తమరికి విన్నవించాలన్న నా కోరిక ఇప్పటికి నెరవేరింది. నెమలిరాజు నన్ను అక్కడినుండి పంపిస్తూ "నీ వెనుకనే చిలుకను పంపిస్తాను-నువ్వు ముందు పో!" అన్నాడు.

అదికూడా‌త్వరలోనే‌ చేరుకుంటుందేమో- ఏమి చేయాలన్నది ఇక దేవరవారికకే ఎరుక. నేను పోయి వస్తాను" అన్నది.

అప్పుడు హంసరాజు హిరణ్యగర్భుడు దాన్ని దయతో చూసి, "దీర్ఘముఖా! దైవ నిర్ణయం ప్రకారం ఎదురయ్యేవాటికి దు:ఖించాల్సిన పనిలేదు.

అంతా తెలిసినవాడివి, నీకు నేను చెప్పాలా? నువ్వు చాలా ధైర్యశాలివి కదా, ఇంత బలహీనపు మాటలు ఎందుకు, పల్కుతున్నావు? ఆ నెమలిరాజెవరో తన మిత్రులతోటీ, బంధువులతోటీ, మంత్రి పరివారంతోటీ‌ సమూలంగా నశించాలనే కాబోలు, నీవంటి సాధువుకు అపకారం తలపెట్టాడు. ఏమైతేనేమి, ఇంతటితో‌ మునిగిపోయినది ఏమీ లేదు. రేపే బయలుదేరి వెళ్దాం. పాముల్ని మేసే ఆ నెమలిరాజు గర్వాన్ని మనం స్వయంగా మట్టుబెట్టి వద్దాం. బాధపడకు-ఊరడిల్లు. ప్రజలందరి సత్కారానికీ అర్హుడివి నువ్వు- అట్లాంటి నీకా, ఇన్ని కష్టాలు రావల్సింది!?" అని చెవులకు ఇంపుగా మాట్లాడాడు. ఆ విధంగా తన దు:ఖం తగ్గేలా‌ మాట్లాడిన ప్రభువు అనుమతి తీసుకొని, కొంత తేలికైన మనసుతో దీర్ఘముఖుడు తన ఇంటికి తాను పోయాడు.

ఇంక అక్కడ- దీర్ఘముఖుడిని వెళ్లగొట్టాక, నెమలిరాజు తన అనుచరుడైన చిలుకను దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకున్నది; హిరణ్యగర్భుడి కొలువులో పలుకవలసిన మాటలు అన్నింటినీ‌బాగా తెలియపరచింది- "అరుణముఖా! నువ్వు వీటినన్నిటినీ అక్కడ నీళ్ళు నములుతూ చెప్పకు- ధైర్యంగా సభ మధ్యలో నిలబడు; గట్టిగా మాట్లాడు- సరేనా?" అని చెప్పి పంపించింది.

అటు చిలుకను పంపించగానే అది తన మంత్రిని ఒక్కడినే రమ్మని, అతనితో మంతనాలాడింది. మంత్రి సలహామేరకు 'మేఘవర్ణుడు' అనే‌కాకిని ఒకదాన్ని రహస్యంగా తన దగ్గరికి పిలిపించుకున్నది. దాన్ని కూర్చోబెట్టి, ప్రేమగా పలకరించి, ఇలా అన్నది- "చూడు, మనం ఇప్పుడు ఆ కర్పూర ద్వీపాన్ని ఆక్రమించే ప్రయత్నం మొదలు పెట్టాల్సి ఉన్నది. దానికి నీ సహకారం చాలా అవసరం. యీపనిని నెరవేర్చటానికి నీకంటే సమర్థుడు వేరే ఎవ్వరూ లేరు. నేను చెప్పే యీ పనిని నువ్వు చాలా రహస్యంగా నిర్వహించుకొని రావాల్సి ఉన్నది.

విను- నువ్వు మారువేషంలో రహస్యంగా పోయి, ఎట్లాగైనా ఉపాయంతో ఆ హిరణ్యగర్భుడి స్నేహాన్ని, నమ్మకాన్ని పొందాలి. నీ వేషభాషలతోను, ప్రవర్తనతోను అతనికి నీపట్ల ఇష్టం కలిగేటట్లు చేసుకోవాలి.

అన్ని విషయాలూ అతను నీతో చర్చించగలిగే-టట్లు చనువు ఏర్పరచాలి. అతని అనుకూలతలు, ప్రతికూలతలు- వాటి పద్ధతులు- అన్నీ తెలుసుకొని, ఎప్పటికప్పుడు ఎలా చేస్తే మనకోరిక నెరవేరుతుందో చూసుకుంటూ, అలాగ ప్రవర్తిస్తూ పోవాలి. మన పనికి మొత్తానికీ నువ్వే కీలకమైన వాడివని గుర్తించి మసలుకో- కార్య నిర్వాహకుడివి నువ్వే సుమా, గుర్తుంచుకో!

అక్కడ రాజ పరివారంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే- ఏనుగుగానీ, దోమగానీ- వాళ్లను దూరం చేసుకోకు- వాళ్లందరినీ దగ్గర చేసుకో. వాళ్ళ వాళ్ళ మనసు కనిపెట్టి తిరుగు. వాళ్ళకెవరికైనా నీపట్ల కొంచెం అయిష్టం కలిగినా సరే, సమయం వచ్చినప్పుడు నీమీద వట్టి అభాండాలు వేసి రభస చేస్తారు- ఆవగింజలంత తప్పుల్ని కూడా‌ తాటికాయ-లంతగా హంసరాజు చెవుల్లో పోసి ఎగదోస్తారు; తప్పును నీపైన మోపి నిన్ను అతనికి దూరం చేస్తారు. దానివల్ల మనం తలపెట్టిన పనికి ఎక్కడలేని నష్టం వాటిల్లుతుంది. మన ప్రయత్నం అంతా వృథా అయిపోతుంది. పని చెడిపోయిన తర్వాత ఇక ఏమి అనుకొనీ ఏమి లాభం? అందువల్ల జాగ్రత్తగా ఉండు.

రాజుల మనసులు కూడా ఏ క్షణానికి ఆక్షణమే మారుతుంటాయి. అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసుకొని మెలగటం చాలా కష్టం. అందుకని 'అయ్యా, దేవుడా'అని అయిన దానికీ, కాని దానికీ వెంటపడి పైన పూసుకోకు- 'కత్తిమీద సాము చేస్తున్నాం' అని గుర్తుంచుకొని మెలకువతో ప్రయత్నించు."

రాజుగారి దయ ఉన్నన్ని రోజులూ అందరూ మిత్రులే- కాని, అది ఆయింత తగ్గిందంటే చాలు- మిత్రులన్నవాళ్ళే శత్రువులై కూర్చుంటారు. అడవుల్ని దహించే అగ్నికి చాలా దగ్గరి స్నేహితుడు వాయువు కదా!? కానీ అదే మంటకు బలం తగ్గిందనుకో; బలహీనమైనదై ఏదైనా ఓ దీపంలో నెలకొని ఉందనుకో- అప్పుడు ఆ గాలే దాన్ని ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకని నువ్వు ఎవ్వరికీ చురుక్కుమనేట్లు ప్రవర్తించకు. రాజుగారి దృష్టి ఎలా ఉంటున్నదో గమనిస్తూ అతని మనసును అనుసరించు. ఈ పనిలో ఎక్కడా‌నీకు తెలీని సంగతులేవీ లేవు.

మరొక్కమాట- అక్కడ నీకు ఎవ్వరు ఎంత దగ్గరైనా సరే- వాళ్ళముందు నీ హృదయాన్ని విప్పి చూపకు; కలలోనైనా ఇక్కడి మాటలు అక్కడ చెప్పకు. నువ్వు తెలివైనవాడివి. ఇంకొకరిచేత ఇంతగా చెప్పించుకొనవలసిన అవసరం ఉన్నవాడివి కాదు. పోయిరా, మరి! మేం ఇకనుండి ఎప్పుడూ నీ సమాచారం కోసమే ఎదురుచూస్తుంటామని మరువకు!" అని చెప్పి పంపింది.

ఆలోగా, ఇక్కడ దీర్ఘముఖుడు అలా‌ కనుమరుగు కాగానే, చక్రవాకం అనే పక్షి దాన్ని ఎగతాళి చేస్తున్నట్లు సన్నగా నవ్వి, హంసరాజుతో‌ అన్నది-

"చూశారా, ప్రభూ! మన ఊరి మూర్ఖుడు పరదేశం పోయి ఏం కొని తెచ్చాడో చూశారా? 'తా చెడ్డ కోతి వనమంతా చెరచింది' అంటే ఇదే గద! దుష్టుడు తాను చెడిపోవటమే కాదట; తన వాళ్ళందరికీ కీడు తెచ్చిపెడతాడట! దానికి నిదర్శనం ఈ‌ నీచపు కొంగే. ఎలాంటి కారణమూ‌ లేకుండానే పోట్లాటలకు కాలు దువ్వటం అల్పుల లక్షణం.

ఉత్తముడైనవాడు పండ్లతో‌ నిండిన చెట్టు లాగా వంగి ఉంటాడట; ఏమీ తెలీని మూర్ఖుడు మటుకు ఎండిన మొద్దు మాదిరి- తంతే విరుగుతాడట గానీ, వంగను మాత్రం వంగడట!

పండితులు కాకున్నా 'పండితులం' అనుకునేవాళ్ళు పదివేల మంత్రాలు చదివినా సరే- వాళ్లను పట్టి పీడించే దోషాలు మటుకు వాళ్ళను విడిచిపెట్టవు అని చెబుతారు. బొగ్గును నూరుసార్లు గంగా జలంతో కడిగితే మాత్రం దాని మలినత్వం పోదు కదా.." అని రకరకాలుగా నిందించటం మొదలు పెట్టింది.

అప్పుడు దాన్ని వారిస్తూ, హంసరాజు అన్నది- "ఇప్పుడు దాన్ని ఇట్లా నిందించి ప్రయోజనం ఏమున్నది, ఇదంతా కాల మహిమవల్ల సంప్రాప్తిస్తున్నదే గాని?! ఇతడు మన మేలును కోరి ప్రవర్తించేవాడే; మన చెడును కోరి- కావాలని చేసిన తప్పు యీగ కాలంత కూడా కనబడటం లేదు. చేయని తప్పును ఎవరి మీదా రుద్దకూడదు. కాలం ప్రతికూలం అయితే మనం తలపెట్టిన పనులన్నీ మనమీదికే ఎదురుతిరుగుతాయి. ఇతడు మనందరి దయకూ పాత్రుడు తప్పిస్తే, నిందకు తగినవాడు కాదు.

నువ్వు కూడా చాలా లోకాన్ని చూసినవాడివి; నీకు తెలీనిదంటూ యీ ప్రపంచంలో ఏదీ లేదు: గతించిన దాన్ని మళ్ళీ మళ్ళీ‌ త్రవ్వటం నమిలినదాన్నే నమలటం అవుతుంది తప్పిస్తే అందులో సారం ఏమీ కనబడదు. దానికోసం దు:ఖించటంకూడా 'ఏరు దాటేశాక వంతెన కట్టటం'లాగా అనవసరమైన పని. అందుకని దాన్ని మానేసి, ఇప్పుడు ఏం చేయాలని నీకు తోస్తున్నదో-దాన్ని గురించి వివరంగా చెప్పు" అని. అప్పుడు ఆ చక్రవాకం రాజహంసతో ఇట్లా అన్నది- (ఏమన్నదో వచ్చేసారి...)