సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడుపడితే ఓటమిలో కూడా గెలుపు వుంటుంది. ఆ గెలుపిచ్చే సంతోషం ఎంతో గొప్పది. ఈ విషయాన్ని సాధారణమైన అంశంతో చెప్పింది కొత్తపల్లి బృందం.

చదివేది ఐదోతరగతి ఐనా, పెద్దకథే వ్రాశాడు ఆర్య. మనుషుల్లో చందు-బిందు లాంటి మంచి వాళ్ళు కూడా వుంటారని నమ్మిన కోతి చివరికి వాళ్ళతో వెళ్ళి పోకుండా అడవిలోనే వుండాలనుకోవడం ఆర్య ఆలోచనల పరిణితిని తెలియచేస్తోంది.

అసూయతో అపకారం తలపెట్టిన గోపిని సహనంతో మంచిగా మార్చాడు రాము. సహనంతో చాలా పనులు చెయ్యవచ్చని వెంకటేష్‌కి తెలుసనుకుంటా.

రాణి వ్రాసిన 'ఆలోచనల శక్తి ' తను వ్రాయడం వరకూ అర్థం చేసుకోవచ్చు: పెద్ద వాళ్ళెవరి దగ్గరో, లేదా ఏవో పుస్తకాల్లో చదివో అటువంటి అభిప్రాయాలని బలంగా నమ్మి వుంటుంది. కొత్తపల్లి వాళ్ళు దానిని ఓ విధంగా ఖండించినప్పటికీ, ప్రచురించటం మటుకు చెయ్యకుండా వుండాల్సిందనిపించింది. 'తప్పుదారి పట్టించే ఇటువంటి భావనలకు పిల్లల పుస్తకంలో తావివ్వటం అవసరమా' అనిపించింది.

"పిసినారి పుల్లయ్య" చాలా పరిచయం వున్న కథ.

'తృప్తి పరుడు' అనే మాట ముందెపుడూ వినలేదు. 'తృప్తి కలవాడు' అంటాంగానీ, అలా 'తృప్తిపరుడు' అనమనుకుంటా. ఎవరూ పుట్టించకుండా మాటలు పుట్టవుగానీ, మాటలకి ఓ వాడుక అంటూ వుంటుంది కదా! 37వ పేజీలో 'నిండ పండ్లతో' అన్న ప్రయోగం కూడా అర్థంకాలేదు. ('నిండా పండ్లతో..' ముద్రారాక్షసం కావొచ్చేమో మరి!)

'నాగుల్ షరీఫ్ ' చాలా రకాలుగా ఈ సంచికకు తన సేకరణలను అందచేశాడు, బాగుంది.

జీవితంలో కీడైనా, మేలైనా కొన్ని పరిస్థితుల కారణంగానో మనుష్యుల ఆలోచనల కారణంగానో జరుగుతాయే తప్ప, వాటిని వాటికి ఏ మాత్రం సంబంధం లేని వస్తువులకీ-జంతువులకీ ఆపాదించుకోవడం మూర్ఖత్వం. దీనిని వినయ్ చక్కగా చెప్పాడు.

'ధర్మం' కథలో 'పీష్వాకి ఇచ్చిన వివరణనే రైతు సైనికులకి కూడా ఇచ్చి ఉండచ్చుగా, ఎందు కియ్యలేదు?' అని ధర్మసందేహం వచ్చింది గానీ, అలానే జరిగితే అతనికి బంగారం బహుమతిగా వచ్చుండేది కాదుగా!?

ఏ పనైనా - చెయ్యాలి కాబట్టి చేస్తే ఎంతో నిరాసక్తత కలుగుతుంది. ఏది నేర్చుకోడానికైనా 'ఒక ఉద్దేశం- (purpose) అంటూ వుండడం, అదీ మన మనసుకి దగ్గరగా వుండడం ఆసక్తిని పెంచుతుంది. 'జ్ఞానోదయం' ద్వారా ఈ విషయాన్ని అహమద్ గారు చెప్పిన తీరు బాగుంది.

'చిల్లికుండ ' కథాంశం సున్నితంగా , అర్థవంతంగా వుంది. అంత లోతైన అంశాన్ని చాలా సరళంగా చెప్పగలిగారు నాగలక్ష్మిగారు.

శంకరశివరావు గారు మ్యాజిక్ కథల ద్వారా చెప్తున్న విషయాలు ప్రాచుర్యంలో వున్నవే అయినా వాటిని కథల ద్వారా చెప్పడం మంచి ప్రయోగం. 'యువకెరటాలు ' ఈ సారి లేదెందుకో?! పాటలు కూడా లేవు!

వచ్చే సంచికలో వాటిని మళ్ళీ చూస్తామని ఆశిద్దాం!