చాలా వందల ఏళ్ళ క్రితం పందులు శుభ్రంగానే ఉండేవి. వాటి మాంసం కౄరమృగాలకు చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పందులంటే అందరికీ అసహ్యమే. ఎందుకో తెలుసుకోవాలంటే చదవండి, ఈ కథ.

ఒక పెద్ద అడవిలో సాగర్ అనే ఒక చిన్న పంది తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. వేసవి కాలంలో ఒక రోజు సాగర్ బయటకు వెళుతుంటే "జాగ్రత్తగా ఉండు. ఎక్కువ దూరం వెళ్ళకు " అని చెప్పింది వాళ్ల అమ్మ. "ఎక్కువ దూరం వెళ్ళావంటే అడవి జంతువులకు తిండివి అవుతావు" అన్నాడు నాన్న.

"సరే! దూరం వెళ్ళనులే" అంటూ బయలుదేరాడు సాగర్.

ఆడుతూ పాడుతూ తెలీకుండానే అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కొద్ది సేపటికి మిట్ట మధ్యాహ్నం అయింది.

"చాలా వేడిగా ఉంది. ఏమి చెయ్యను?" అనుకున్నాడు సాగర్.

అంతలో వాడికి ఒక బురద గుంట కనిపించింది. "అక్కడికి వెళ్ళి దొర్లితే చల్లగా ఉంటుంది" అనుకొని, సాగర్ ఆ బురదలో దొర్లుతూ ఉండిపోయాడు చాలాసేపు.

ఆ తర్వాత తేరుకొని ఒళ్ళంతా చూసుకున్నాడు. నల్లగా, బురద బురదగా అయ్యింది. "ఇది ఎంతో హాయిగా ఉంది కానీ ఇలా ఇంటికి వెళితే అమ్మ తిడుతుంది. ఇంటికి స్నానం చేసే వెళ్ళాలి" అని నిర్ణయించుకుని అక్కడ నుండి లేచాడు.

"కానీ ఇక్కడ ఎక్కడా స్నానం చేయడానికి చెరువు లేదే- సరే. ఇంకా కొద్ది దూరం వెళతాను- ఏదైనా చెరువు కనిపించవచ్చు" అనుకొని ముందుకు సాగాడు.

అనుకున్నట్లే పెద్ద చెరువు ఒకటి కనిపించింది వాడికి. వెంటనే అక్కడికి పరిగెత్తి దానిలో స్నానం చేయడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆ చెరువులో నీళ్ళు త్రాగడానికి వచ్చింది ఒక తోడేలు. "చెరువులో ఉన్న నీరంతా మురికిగా అయిపోయిందేమిటి?" అనుకుంటూ ఆవలి వైపుకి చూసింది. అక్కడ సాగర్ కనిపించాడు. వాడిని చూడగానే దానికి అర్థమైంది- సాగరే నీరంతా మురికి చేశాడని. తోడేలుకు విపరీతమైన కోపం వచ్చింది. "నేను 'మంచి నీళ్ళు త్రాగుదాం' అనుకొని వస్తే నువ్వు నా నీళ్లన్నిటినీ మురికి చేస్తావా? ఇప్పుడే భోజనం చేసి వచ్చాను కాబట్టి సరిపోయింది. నిన్ను రేపు పీక్కు తింటాను. ఒకవేళ నువ్వు రేపు ఇక్కడికి రాలేదనుకో, నేనే మీ ఇంటికి వస్తాను! మీ కుటుంబంలో అందరినీ నమిలి తినేస్తాను!!" అని బెదిరించి వెళ్ళిపోయింది తోడేలు.

సాగర్‌కు చాలా భయం వేసింది. ఏం చెయ్యాలో తెలీలేదు. వణుక్కుంటూనే ఇంటికి పరుగెత్తాడు. ఇంట్లో అందరికీ చెప్పాడు జరిగిన సంగతి.
"జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా! ఎందుకు వెళ్ళావు అక్కడికి?" తిట్టింది అమ్మ.

"ఎక్కువ దూరం వెళ్ళావుగా, ఇప్పుడు ఏమైందో చూడు!" అన్నాడు నాన్న.

"సరేలే, జరిగిందేదో జరిగి పోయింది. ఇప్పుడు మనకి ఒక ఉపాయం కావాలి- ఏం చేద్దాం?" అన్నాడు తాతయ్య.

అందరూ ఉపాయం కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. అయినా తాతయ్యకు ఏమీ ఉపాయం తోచలేదు. "అసలు నువ్వు ఎందుకురా, అమ్మ మాట వినకుండా దూరంగా వెళ్ళావు?" అడిగాడు ఊరికే.

"ముందు నేను బురదలో దొర్లాను; కంపు కొట్టటం మొదలెట్టాను కదా, అందుకని స్నానం చేయాల్సి వచ్చింది! వెతుక్కుంటూ చెరువు దగ్గరికి వెళ్ళాను. చెరువు చాలా దూరంగా ఉంది- నేనేం చెయ్యను?" అన్నాడు.

"అయ్యో! మరి నువ్వు అసలు బురదలో ఎందుకు దొర్లావురా?" అని అడిగాడు తాతయ్య.

"వాతావరణం వేడిగా ఉంది కదా తాతయ్యా! బురదలో దొర్లితే హాయిగా, చల్లగా అనిపించింది!"జవాబిచ్చాడు సాగర్.

అది వినగానే తాతకు తటాలున ఒక ఉపాయం తట్టింది. "ఒరే! నువ్వు పొద్దున్నే మళ్ళీ అదే చెరువు దగ్గరకు వెళ్ళు. అయితే అలా వెళ్ళే ముందు బాగా కంపు కొట్టే మురుగులో మరింత ఎక్కువ సేపు దొర్లి, ఆ తర్వాత వెళ్ళు! స్నానం మాత్రం చెయ్యకు!!" అన్నాడు గుసగుసగా.

సాగర్ కు తాతయ్య ఉపాయం అర్థం అయి, చాలా సంతోషం వేసింది.

మరునాడు పొద్దున లేచీ లేవగానే వెతికీ వెతికీ బాగా కంపు కొట్టే మురుగులో పది నిమిషాలు దొర్లాడు సాగర్.

ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా చెరువు దగ్గరకు వెళ్ళి, తోడేలు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

తనకంపు తనే భరించలేకున్నాడు వాడు- అయితేనేమి, ఎంత కంపు కొట్టినా కదలకుండా కూర్చున్నాడు.

కొంతసేపటికి తోడేలు వచ్చింది. సాగర్ అక్కడ నిలబడి ఉండటం చూసి సంతోషపడింది. వెంటనే దాన్ని తిందామని రెండు అడుగులు ముందుకు వేసిందల్లా ఆగి- "ఛీ! ఛీ! కంపు!!" అని అరిచింది. "నేను తట్టుకోలేను బాబూ!"అంటూ సాగర్‌ని వదిలి వెనక్కి పరుగు తీసింది.

సాగర్ ఊరికే వదులుతాడా, దాన్ని!? "రా, నన్ను తిను! నీకోసమే వచ్చాను! నన్ను తినకుండా వెళతావేం..!" అంటూ దాని వెంట పరిగెత్తాడు.

"బాబోయ్! కంపు! కంపు!.. ఛీ! ఛీ! భరించలేకపోతున్నా! వెళ్ళు! వెళ్ళు!" అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది తోడేలు.

అది కనుమరుగు కాగానే సాగర్ విరగబడి నవ్వాడు. కడుపుబ్బ నవ్వుతూ ఇంటిదారి పట్టాడు.

క్షేమంగా ఇంటికి చేరిన సాగర్‌ని చూసి తాత, తల్లి, తండ్రి చాలా సంతోషించారు.

తాత అయితే తన మనవడు తోడేలు బారి నుంచి తప్పించుకుని వచ్చిన వైనాన్ని మిగిలిన పందులన్నిటికీ కథలు కథలుగా చెప్పాడు.

ఆనాటినుండీ తోడేలును దూరం పెట్టటంకోసం ఆ పందులన్నీ కూడా బురదలో దొర్లసాగాయి- రాను రాను అవి మురుగు వాసనను యిష్టపడటం కూడా మొదలుపెట్టాయి!

ఇప్పుడు తెలిసిందా, పందులు బురదలో ఎందుకు దొర్లుతాయో?!