రోజా ఒకరోజున పుస్తకం చదువుతోంది.

అందులో చాలా సీతాకోక చిలుకల బొమ్మలున్నై.

చూస్తూ చూస్తూండగానే వాటిలో ఒక సీతాకోక చిలుక పుస్తకంలోంచి లేచి, పైకి ఎగిరింది.



వెంటనే మరొకటి!

ఆ వెంటనే మరొకటి!

ఇట్లా సీతాకోకచిలుకలన్నిటికీ ప్రాణం వచ్చేసింది!

అన్నీ ఎగరటం మొదలెట్టేసాయి!







రోజా వాటిని చూసి మురిసిపోయింది.

తనూ లేచి బయలుదేరింది.

అవి ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళింది.



సీతాకోక చిలుకలు తనని ఏ దారి గుండా తీసుకెళ్ళాయో మరి, అకస్మాత్తుగా రోజా చుట్టూ చీకటి- మళ్ళీ‌ వెంటనే వెలుగు!

అక్కడ మరిన్ని సీతాకోకచిలుకలున్నై!

పాడుతూ, దాగుడు మూతలు ఆడుతూ, ఎగురుతున్నై, పూవుల మధ్యలో!

అన్నీ భలే సంతోషంగా ఉన్నై.

వాటి సంతోషం రోజాకూ అంటింది.

ఓ అద్భుత ప్రపంచంలోకి వచ్చేసిన అనుభూతి కల్గింది ఆ పాపకు.

అంతలో ఓ సీతాకోక చిలుక వచ్చి రోజా చేతి మీద వాలింది. రోజా వైపు వింతగా చూస్తూ "ఎవరు పాపా, నువ్వు?" అని అడిగింది.

"నేను రోజాను!" అంది పాప.

అరే! భలే ఉందే! మా తోటలో ఒక రకం పువ్వుల పేరూ అదే!" నవ్వింది సీతాకోక చిలుక.

"మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎప్పుడూ సంతోషంగా ఎగురుతూ ఉంటారు కదా, అందుకని!" చెప్పింది రోజా.

"ఔనా! థాంక్స్!" నవ్వింది సీతాకోక చిలుక. "నేను ఇక్కడి టీచర్ని. అందుకని నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను. సరేనా?" అంది.

"అయ్యో నాకు మాథ్స్ అయితే సరిగ్గా రాదు టీచర్! సోషల్ అయితే బాగా వచ్చు! తెలుగు కూడా!" అంది రోజా.

"సులభం ప్రశ్నలేలే. నీకు అందరిలోకీ ఎవ్వరంటే చాలా చాలా ఇష్టం?"

"ఉం.." అని కొంచెం ఆలోచించింది రోజా. "నాకు రోజా అంటే చాలా చాలా ఇష్టం" అంది.

సీతాకోక చిలుక రెక్కలు టపటపలాడించింది. "భలే! మాకు కూడా మేమంటే చాలా చాలా ఇష్టం" చెప్పింది.

"నువ్వు ఎప్పుడూ ఏం చేస్తుంటావు?" అడిగింది అది ఇప్పుడు.

"ఉం... ఏదో ఒక పని!" అన్నది రోజా.

"వావ్! మేం కూడా! మేం చేసేది ఏదైనా పనే!" అన్నది సీతాకోకచిలుక.

"ఈసారి నేను అడుగుతాను- నేను ఎట్లా ఉంటే మీకు ఇష్టం అవుతాను?" అడిగింది రోజా.

"రోజా పాప లాగా ఉంటే!" చటుక్కున సమాధానం చెప్పేసింది సీతాకోక చిలుక, నవ్వుతూ. "పిల్లల్లాగా ఉంటే ఎవరైనా ఇష్టమే అవుతారు"

అంతలో రోజాకి మెలకువ వచ్చేసింది. "ఓహ్! ఇదంతా కల!" అనుకున్నది. చూస్తే అప్పటికే లేచి చదువుకుంటున్నాడు అన్న.

"ఒరేయ్! కలలు నిజం కావాలంటే ఏం చెయ్యాలిరా?" అడిగింది వాడిని.

"పని చెయ్యాలమ్మా! పని!" అన్నాడు వాడు, మళ్ళీ‌పుస్తకంలో మునుగుతూ.

"వీడికి ఎట్లా తెలుసు?" అనుకున్నది రోజా. "పెద్దవాడు కదా, సీతాకోక చిలుక ఇదివరకెప్పుడో చెప్పి ఉంటుంది!" అనుకొని మళ్ళీ కొంచెం కునికింది. కలలో సీతాకోక చిలుకలు ఈసారి పనులు చేస్తూ కనబడ్డాయి దానికి!