సీతారామపురం రాజ్యానికి రాజుగారు సీతారామరాజు. చాలా మంచి రాజన్నమాట ఆయన! అన్ని రాజ్యాల కన్నా వీళ్ళ రాజ్యమే గొప్పగా ఉండాలని ఆయన చాలా శ్రమించేవాడు.

వాళ్ళకి ఒక కుక్క ఉండేది. అది చాలా విశ్వాసపు కుక్క. రాజుగారి ఇంట్లో వాళ్ళంటే దానికి ప్రాణం . చాలాసార్లు వాళ్ళని దొంగల నుండి కాపాడింది అది. ఒకసారి రాజుగారి కుటుంబం మొత్తం బంధువుల ఇంటికి, వేరే రాజ్యానికి వెళ్ళింది. రాజుగారి సేవకులు కుక్కకి సరిగా తిండిపెట్టే వాళ్ళు కారు. అయినా ఆ కుక్క రాజుగారి ఇంటిని విడిచిపెట్టి పోలేదు. అన్నం పెడితే తినేది; లేకపోతే పస్తుండేది. అలా చాలా రోజులు గడిచాయి. అదే సమయంలో గంగమ్మ జాతర వచ్చింది. రాజుగారి సేవకులతో సహా ప్రజలంతా ఆ జాతరలోనే ఉన్నారు. పాపం కుక్కకి వారం రోజుల నుండి అన్నం లేక, బక్క చిక్కిపోయింది. 'కనీసం ఈ రోజన్నా అన్నం దొరుకుతుందేమో' అనుకొని రాజ్యంలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్ళింది అది. కానీ అందరూ జాతరలో ఉన్నారు కదా, ఇళ్ళలో ఎవ్వరూ దొరకలేదు దానికి.

'గుడి దగ్గరకి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో' అని అక్కడికి వెళ్ళిందది. గుడి దగ్గర చాలా ఇరుకుగా ఉంది. జనాలందరూ ఎక్కువ అవ్వటంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఎవరో‌దాన్ని క్రిందికి తోసేసారు. పాపం జనాల కాళ్ల క్రింద పడి ఆ కుక్క అక్కడే చనిపోయింది!

తర్వాత కొన్ని రోజులకు రాజుగారి కుటుంబం వెనక్కి తిరిగి వచ్చింది. అయినా వాళ్ళకి కుక్క అసలు గుర్తుకే రాలేదు! 'మా కుక్క ఏది?' అని కూడా ఆలోచించలేదు రాజుగారు గానీ, ఇంట్లోవాళ్ళు గానీ!

ఆ తర్వాత ఒక రోజున రాజుగారు కుటుంబంతో సహా అడవిలో విహారానికి బయలుదేరారు. కొంతమంది భటులు మాత్రం వాళ్ళను అనుసరించి పోతున్నారు. అకస్మాత్తుగా శత్రు సైనికులు ఎదురయ్యారు వాళ్ళకి! రాజుగారు, భటులు వాళ్ళతో యుద్ధం చేస్తుంటే రాణి, యువరాజు ఇద్దరూ వణుక్కుంటూ చెట్టు పొదల్లో నక్కి కూర్చున్నారు. అప్పుడుగానీ వాళ్ళకు కుక్క గుర్తుకు రాలేదు. అది ఉండి ఉంటే శత్రు సైనికుల రాకను ముందుగానే పసిగట్టేది! వాళ్ళతో తెగించి పోరాడేది కూడాను!

ఆ పోరాటంలో రాజుకు చాలా గాయాలే అయ్యాయి. ఆయన్ని వెనక్కి తీసుకువచ్చి సేవలు చేస్తూ ఇంట్లో వాళ్లంతా కుక్కను బాగా గుర్తు చేసుకున్నారు. రాజుగారు కూడా కుక్కను తలచుకొని పశ్చాత్తాప పడ్డాడు.

ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే కుక్కను తెచ్చుకొని చాలా ప్రేమగా పెంచారు. కానీ అది ఏనాడూ మొదటి కుక్క అంత చలాకీగా లేనే లేదు!