అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అనేక రకాల జంతువులు కలిసి బ్రతుకుతూ ఉండేవి. అడవికి రాజు సింహం- పెద్దవాడయ్యాడు.
'అతని తర్వాత ఎవరు రాజు?' అనేది స్పష్టంగా లేదు- ఎందుకంటే సింహరాజుకు పిల్లలు లేరు.

అయితే సేనాపతి చిరుతపులి రాజు అవ్వాలని ఎంతో కాలంగా కలలు కంటున్నది. సింహరాజు ముసలివాడవ్వగానే అది ఒక పన్నాగం పన్నింది. సింహరాజు అమాయకంగా అందులో ఇరుక్కున్నాడు. వెంటనే అతన్ని తుదముట్టించింది చిరుత. అప్పటినుండీ‌ ఆ అడవికి రాజు చిరుతపులే! చిరుత పులికి స్వార్థం ఎక్కువ; అంతేగాక దానికి రాజుకు ఉండవలసిన మంచి గుణాలు ఏవీ లేవు. దాని పాలనలో అడవిలోని జంతువులన్నీ ఎన్నో కష్టాలు పడసాగాయి.

అవన్నీ కలిసి ఒకరోజున సింహరాణి దగ్గరికి వెళ్ళాయి. తమ గోడంతా చెప్పుకున్నాయి. తమ బాధలన్నీ విన్నవించుకున్నాయి. అయినా సింహరాణి వాళ్ళకు నేరుగా ఏమీ సహాయం చెయ్యలేదు- "మీకు ప్రస్తుతం మహారాజు చిరుతపులి. మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆయనకే విన్నవించుకోండి" అని మట్టుకు చెప్పగలిగిందామె.

చిరుతపులికి ఇద్దరు మిత్రులు- పెద్దపులి, నక్క. తను రాజు అవ్వగానే చిరుత పులి వాటిని తన మంత్రులుగా పెట్టుకున్నది. జంతువులన్నీ రాణి దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవటం విన్నాయవి. వెంటనే ఆసంగతిని చిరుతపులి చెవిలో ఊదాయి కూడా.

చిరుతపులి వెంటనే ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో అది సింహరాణిని దోషిగా నిలబెట్టింది- 'రాజైన తనకు వ్యతిరేకంగా జంతువులను కూడగట్టుతున్నది' అన్న ఆరోపణతో సింహరాణిని కాస్తా బంధించి జైలులో పెట్టింది!

అప్పటినుండీ‌జంతువులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. అవన్నీ నోరు నొక్కుకొని తమ బాధల్ని తాము భరించటం అలవాటు చేసుకున్నాయి.

అయితే అధికారం చెడ్డది- కోరినవారినల్లా చెరుపుతుంది అది! అధికారాన్ని దగ్గరగా చూస్తున్న పెద్దపులి, నక్క రానురాను మరింత దుర్మార్గానికి ఒడి కట్టాయి- ఎలాగో‌ఒకలాగా చిరుతను చంపేసి రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకోవాలని పన్నాగం పన్నాయి. కారాగారంలో ఉన్న సింహరాణి ఈ పన్నాగాన్ని గురించి విన్నది. తనను బంధించిందని కూడా తలచలేదు; రాజైన చిరుతకు ఆ కబురందించింది.

అయితే శిక్ష అనుభవిస్తున్న సింహరాణి మాటలకంటే తమ మిత్రులే ఎక్కువయ్యారు చిరుతకు- అది సింహరాణి మాటల్ని పట్టించుకోలేదు. అయితే ఆరోజు రాత్రికే దానిపైన దాడి చేసినై, పెద్దపులి-నక్క! గాయాలతో నేలకూలిన చిరుతను అలాగే వదిలి అవి కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవటంలో మునిగాయి. అయితే చిరుత పరిపాలనతో విసిగిపోయిన అధికారులెవ్వరూ వీళ్ళని నమ్మలేదు- కొందరు తామే రాజులం అన్నారు; కొందరు సింహరాణిదే రాజ్యమన్నారు.

అంతా గందరగోళంగా ఉన్న ఆ సమయంలో మిత్రులు కొందరు సింహరాణిని కారాగారం-లోంచి విడిపించారు. రాజ భవనంలో గాయాలతో పడిఉన్న చిరుతను ఆమె స్వయంగా తన వీపుపైన వేసుకొని ఒంటె వైద్యుడి దగ్గరికి తీసుకుపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్లకుగానీ చిరుత ఆరోగ్యం‌ బాగు పడలేదు. ఆ సరికి అధికారం మొత్తం సింహరాణి వశమైంది. పెద్దపులి, నక్క అడవి నుండి బహిష్కరింపబడ్డాయి. ఆరోగ్యం బాగై వచ్చాక, చిరుతపులి తను చేసిన పనులన్నిటికీ చాలా పశ్చాత్తాపపడింది. సింహరాణికి నమస్కరించి, తను అడవి మూలల్లో తపస్సు చేసుకునేందుకు అనుమతి కోరింది. సింహరాణి దాన్ని క్షమించి వదిలేసింది.

సింహరాణి పాలనలో అడవిలోని జంతువులన్నీ సుఖసంతోషాలతో వర్థిల్లాయి!