అనగా అనగా రామాపురం అనే ఊళ్లో గణేష్, అన్వేష్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు చిన్నప్పుటి నుండీ కలిసి ఉండేవాళ్ళు; వాళ్ళకి ఏం కావాలన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెచ్చుకునేవాళ్లు. అయితే అందరు పిల్లల్లాగే వీళ్ళ ఆలోచనలు కూడా వేరు వేరుగా ఉండేవి. పెద్దలు చెప్పిన మాట వినేవాడు గణేశ్. అన్వేష్ మటుకు ఎవ్వరి మాటా వినేవాడు కాదు. "పెద్దవాళ్ళు చెప్పింది చేసి చూస్తే ఏమి?" అనేవాడు గణేశ్. "ఏ పనైనా మనకు ఇష్టమైతేనే చెయ్యాలి" అనేవాడు అన్వేష్.

ఒకసారి ఇద్దరూ యీత కొట్టేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాగానే ఇద్దరికీ దగ్గు, జలుబు మొదలయ్యాయి. గణేష్ వాళ్ల అమ్మ వెంటనే వాడికి మిరియాల కషాయం , రవ్వ గంజి ఇచ్చి, వావిలాకులతో ఆవిరి పట్టింది.

అన్వేష్ వాళ్లమ్మ కషాయం ఇస్తానంటే వాడు ఒప్పుకోలేదు. దోసె కావాలని గొడవ చేసి, కడుపు నిండా దోసెలు తిన్నాడు. ఆవిరి పట్టుకోలేదు. మరుసటి రోజుకల్లా గణేష్ ఆరోగ్యం కుదురుకున్నది. కానీ‌ అన్వేష్ మాత్రం బయట కనబడ లేదు. ఆరోజు సాయంత్రం గణేశ్ బయలుదేరి అన్వేష్‌ వాళ్ళ ఇంటికి వెళ్లాడు. ఆ సరికే అన్వేష్‌కి జ్వరం ఎక్కువైపోయిందట. డాక్టర్‌గారి దగ్గరికి పిల్చుకుపోతే ఆయన ఆస్పత్రిలో చేర్చమన్నారు. ఊపిరి తిత్తులలో తేమ ఎక్కువ ఉన్నదని కృత్రిమ శ్వాస కూడా పెట్టారట. మూడు రోజుల్లో ఐదారు వేల రూపాయలు ఖర్చయ్యాయి. చివరికి, నాలుగో రోజున అన్వేష్ నీరసంగా ఇల్లు చేరుకున్నాడు.

అటు తర్వాత గణేష్ తన స్నేహితుడిని పలకరించేందుకు వెళ్తే, గణేశ్ వాళ్ల అమ్మ అన్నది- 'నువ్వు మాత్రం ఒక్కరోజులో బాగయ్యావురా, వీడు చూడు, నేను చెప్పినమాట వినక, ఎంత కంగారు పెట్టాడో!" అని.

ఎవరికైనా మొండి పట్టుదల ఉండకూడదు, ఒకవేళ ఉంటే అది చదువు విషయంలోనే ఉండాలి.