వాళ్ళ అమ్మతో కలిసి కూరగాయలు కొనడానికి బయలుదేరాడు గోపీ. కూరలాయమ్మ పేరు రంగమ్మ. గోపీ వాళ్ళ అమ్మ కూరగాయలు ఎప్పుడూ రంగమ్మ దగ్గరే కొంటూ ఉంటుంది. అప్పుడప్పుడూ గోపీని కూడా తనతోబాటు తీసుకువెళ్తుంది.

అమ్మ కూరగాయలు బేరం చేస్తుంటే గోపీ ఆ కూరగాయలతో ఆడడం మొదలు పెట్టాడు. సొరకాయను ఒకదాన్ని తీసుకుని భుజాన పెట్టుకుని, ఆంజనేయుడిలా పోజులు ఇవ్వ సాగాడు.

రంగమ్మ అది చూసి కంగారు పడ్డది- "దాంతో ఆడకు బాబూ! కింద పడితే పచ్చడౌతాది. ఇంక తినడానికి పనికి రాదు" అని ఆ సొరకాయని మెల్లగా గోపీ దగ్గర్నుంచి తీసేసుకుంది.

ఇంటికి వెళ్ళాక, అమ్మ వెంటే వంటింట్లోకి దారి తీశాడు గోపీ. అమ్మ కూరగాయలు సర్దుకుంటుంటే, ఒక కాలీఫ్లవరును పూల గుత్తిలా పట్టుకుని వాళ్ళ అమ్మకు ఇస్తూ, "ప్రపంచంలో అందరికంటే అద్భుతంగా వంటలు వండే మా అమ్మకి ఈ పూల గుత్తి బహుమానం!" అంటూ ముందుకు వంగి అందించాడు.

వాళ్ళ అమ్మ గోపీకి ఇష్టమని పచ్చి క్యారట్లు తినడానికి ఇస్తే, పళ్ళెంలో వాటిని ఏటవాలుగా ఒకదానికి ఒకటి ఆనించి, "ఇదిగో అమ్మా, ఈ కొండలు చూడు! వీటిని నేను ఇట్టే ఎక్కెయ్యగలను!" అంటూ రెండు వేళ్ళను కాళ్ళలాగా నిలిపి ఆ కొండలు ఎక్కుతున్నట్టు నటించాడు.

మర్నాడు మళ్ళీ బజారుకు వెళ్ళ వలసిన పని పడింది అమ్మకి. గోపీ తను కూడా వస్తానని బయలుదేరాడు. "నాకు అక్కడే వేరే పని కూడా ఉంది ఒకటి. నిన్ను అక్కడికి తీసుకు వెళ్ళటం కుదరదు. అందుకని ఇవాళ్ల నువ్వు ఇంట్లోనే ఉండు" చెప్పింది అమ్మ.

"నన్ను రంగమ్మ బండి దగ్గర ఉంచి నువ్వు నీ పని చూసుకుని రావచ్చు కదా!" అన్నాడు గోపీ. "వద్దులే నాయనా! నువ్వు రంగమ్మ కూరగాయలతో ఆడి వాటిని పాడు చేస్తావు!" అంది గోపీ వాళ్ళ అమ్మ.

"నేను అల్లరి చెయ్యనుగా, నిజం! నాకు కూరగాయలంటే చాలా ఇష్టం. తీసుకు వెళ్ళవా అమ్మా ప్లీజ్!" బ్రతిమాలాడు గోపీ.

"సరే. ఈ రోజు అల్లరి చేస్తే మాత్రం ఇంకెప్పుడూ వెంట తీసుకు వెళ్ళను మరి" గట్టిగా చెప్పింది అమ్మ.

రంగమ్మ బండి దగ్గర గోపీని ఉంచి, త్వరగానే వచ్చేస్తానని చెప్పి, గోపీ వాళ్ళ అమ్మ తన పని మీద వెళ్ళింది. రంగమ్మ ముందు జాగ్రత్తగా ఒక చిన్న బుట్టలో కొన్ని కూరగాయలు పెట్టి, గోపీ దగ్గర ఉంచింది. "ఇంకేవీ ముట్టుకోవద్దు నాన్నా!" అని చెప్పింది. "రంగమ్మే మంచిది అమ్మ కంటే. నాకు ఎన్ని కూరలు ఇచ్చిందో, చూడు! " అని మురిసిపోయాడు గోపీ.

గోపీ వాళ్ళ అమ్మ తిరిగి వచ్చే సరికి రంగమ్మ బండి దగ్గర మామూలుకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉన్నారు. అమ్మ కంగా రు పడింది. 'ఏమయ్యిందో' అని అనుమానపడింది. 'గోపీ ఏం అల్లరి ఛేశాడో' అని గబగబా వెళ్ళి చూసింది. గోపీ చిన్నబుట్టలో కూరగాయలను గణపతి ఆకారంలో అమర్చి ఉన్నాడు. దాన్ని చూసేందుకు జనాలందరూ కుతూహలంగా దగ్గరికి చేరి ఉన్నారు. 'హమ్మయ్య! ఏం కాలేదులే!' అనుకుని ఊపిరి పీల్చుకుంది అమ్మ.

అంతలో రంగమ్మ అన్నది- "మీ బాబు గణపతిని ఎంత చక్కగా చేసిండో చూశావమ్మ? ఈ బొమ్మని చూడనీకి వచ్చి, అందురూ ఇయాల నా దగ్గర ఎక్కువ కూరగాయలు కొనుక్కుని పోయిండ్రమ్మ"- అని. అట్లా మురిసిపోతూ గోపీ వాళ్ళ సంచీలో ఇంకొన్ని క్యారట్లు కొసరుగా వేసింది రంగమ్మ. కొన్ని రోజుల తర్వాత గోపీ, వాళ్ళ అమ్మా కలిసి రంగమ్మ బండి దగ్గర కూరగాయలు కొనడానికి వచ్చారు. ఈ సారి గోపీ చేతిలో ఒక బుట్ట ఉంది. అందులో కూరగాయలతో చేసిన గణపతి బొమ్మ ఉంది!

ఇంతకు ముందు తనకు వచ్చిన ఆలోచననే ఇంకొంచెం మెరుగు పరిచి, కళ్ళూ అవీ స్పష్టంగా గీసి, చిన్న చిన్న పుల్లలతో కూరగాయలు పడిపోకుండా కుదురుగా నిలిచేలా అమర్చి, చిన్న పళ్ళెంలో కూర్చోబెట్టి తెచ్చాడు గోపీ.

"రేపు వినాయకుడి పండగ కద. 'పచ్చపచ్చగా కూరగాయలు ఎదగాలంటే మన భూమి బాగుండాలి. ఈసారీ, ఇక ముందూ కూడా, రంగులూ, రసాయనాలూ వాడకుండా చేసిన మట్టి గణపతి విగ్రహాలే కొని పూజ చెయ్యండి' అని చెప్పు రంగమ్మా, అందరికీ " చెప్పాడు గోపీ, ఆమెకు పచ్చ గణపతిని అందిస్తూ.

"మా బాబే, ఎంత అందంగా ఉన్నాడయ్యా ఈ గణపయ్య. మట్టి గణపతి గురించి అందరికీ చెబతా. కానీ నేను ఈ పచ్చ గణపతికే పూజ చేస్తానయ్యా రేపు. మా గణపయ్య లాగే నీకూ ఆకులు కాయలంటే బలే ఇష్టంలే," అంది రంగమ్మ నవ్వుతూ.