తిరుపతి తిరునాళ్ళలో వేషాలు వేయడానికి నలుగురు కళాకారులు అనంతపురం నుండి బయలుదేరారు, కారులో. కొంచెం దూరం ప్రయాణం చేశాక, ఓ చెట్టు క్రింద కారును ఆపి విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ వాళ్ళ వేషాల గురించి మాట్లాడుకుంటున్నారు.

అదే తిరునాళ్ళకు వెళ్తూ అప్పటికే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న నాగయ్య ఆ నలుగురు కళాకారులను పలకరించి, 'ఏ ఏ వేషాలు వేస్తున్నారయ్యా, మీరు?' అని అడిగాడు కుతూహలంతో.

"త్యాగానికి మారుపేరైన 'శిబి చక్రవర్తి' వేషం వేస్తున్నాను నేను" అన్నాడు మొదటివాడు.

"దానగుణానికి పెట్టిన పేరైన 'కర్ణుడి' వేషం వేస్తున్నాను" అన్నాడు రెండోవాడు.

"ఆడినమాట తప్పని 'సత్యహరిశ్చంద్ర' వేషం వేస్తున్నాను నేను" అన్నాడు మూడోవాడు. ఇక నాలుగో కళాకారుడు మాత్రం ఏమీ చెప్పకుండా ఊరికే ఉన్నాడు.

"ఏమి, ఈ నాలుగో కళాకారుడు ఏమీ చెప్పట్లేదు? ఈయన వేషం ఏంటి?" అడిగాడు నాగయ్య.

మొదటి ముగ్గురు కళాకారులూ వెటకారంగా నవ్వారు. "వీడి వేషం గురించి వీడు ఏం చెప్పుకుంటాడు, మమ్మల్నడుగు- చెబుతాం. 'మనుషుల్ని తినే బ్రహ్మ రాక్షసుడి వేషం' వేస్తున్నాడు వీడు!" అన్నారు ఇకిలిస్తూ.

మధ్యాహ్నం కాగానే నలుగురు కళాకారులూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఇంతలో ఒక ముష్టివాడు వాళ్ళదగ్గరికి వచ్చాడు- మొదటి వాడిని (శిచిచక్రవర్తి) అడిగాడు "అయ్యా! నాలుగు రోజులుగా తిండిలేదు, కనికరించి కొంచెం అన్నం పెట్టండి బాబూ" అని.

"అబ్బా! ఎక్కడికి వెళ్ళినా ఈ ముష్టివాళ్ళగోల- భరించలేక పోతున్నాను. వెళ్ళవయ్యా!" అని కసురుకున్నాడు శిబి చక్రవర్తి. రెండవ వాడి(కర్ణుడు) దగ్గర చెయ్యి చాచాడు ముష్టివాడు- "కొంచెం అన్నం పెట్టండి బాబయ్యా" అని. "నీ కోసం కాదు, ఈ అన్నం తెచ్చింది- మా కోసం! ఇది మాకే చాలకొచ్చేట్లుంది పోవయ్యా!" అరిచాడు కర్ణుడు.

పట్టు వదలని ముష్టివాడు మూడవ వాడిని (సత్యహరిశ్చంద్ర) "ఆకలిగా ఉంది- కొంచెం అన్నము పెట్టండి " అని అడిగాడు. "అన్నం లేదు సున్నం లేదు-పోవయ్యా " అన్నాడు హరిశ్చంద్రుడు.

నాల్గవ వాడు (రాక్షసుడు) తనుతినే ఆహారంలో కొంత తీసి ఆ ముష్టివాడికి పెట్టాడు.

'దయగల మారాజువు- చల్లగా ఉండు నాయనా!' అని వెళ్ళిపోయాడు ముష్టివాడు.

ఇదంతా గమనిస్తున్న నాగయ్య, పగలబడి నవ్వాడు. "రాక్షసుడే మేలు గదయ్యా" అని.

"ఏమట్లా?" అని అడిగిన కళాకారులకు చెప్పాడు- "మీరు వేస్తున్నది మహానుభావుల వేషాలే కావొచ్చు- అయితేనేమి? అవి వేషాలే. వాటి వెనక ఉన్న మీ‌ నిజరూపాలకు, ఆ మహానుభావుల లక్షణాలకూ ఏమాత్రం పోలిక లేదు. దయాపరులైనవారి వేషాలు వేయబోతున్న మీరు నిజ జీవితంలో నిర్దయులే. మీతో పోలిస్తే ఆ బ్రహ్మ రాక్షసుడే నయం. నిజ జీవితంలో కనీసం మనిషిలాగానైనా ప్రవర్తించాడు!" అని.

"మంచి వేషాలు వేయగానే సరిపోదు, మంచి గుణాలు కూడా ఉండాలి" అని నాగయ్య అంటుంటే ముగ్గురు కళాకారులూ వెఱ్ఱి మొహాలు వేశారు.