మొలకవారిపల్లెలో రాముడు, భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాముడు చాలా తెలివైనవాడు. ఏ పనైనా తెలివిగా ఆలోచించి చేస్తాడు. భీముడేమో, మంచి భుజశక్తి ఉన్నవాడు. ఏ పని ఇచ్చినా కష్టపడి చేయగలడు.

'తెలివి ఉంటే ఏ పనైనా సాధించగలం' అనేవాడు రాముడు . 'ఏ పని సాధించాలన్నా భుజశక్తి ఉండాలి' అనేవాడు భీముడు ! ఈ విషయంలో మటుకు ఇద్దరికీ గొడవ అవుతుండేది. అయినా మొత్తంమీద ఇద్దరూ చాలా మంచి స్నేహితులే.

పెద్దయ్యాక రామయ్య భీమయ్యలు వాళ్ళ వాళ్ల మనస్తత్వానికి తగిన వృత్తులనే ఎన్నుకున్నారు. రామయ్య వ్యాపారం, భీమయ్య వ్యవసాయం చేపట్టారు. ఇద్దరూ బాగా పైకి వచ్చారు కూడా. రాముడికి ఒక కూతురు , భీముడికి ఒక కొడుకు.

తమ చిన్ననాటి స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకుందామనుకున్నాడు భీమయ్య. రామయ్య కూతురినే తన కోడలుగా చేసుకోవాలని అనుకొని రామయ్యకు కబురంపాడు. రామయ్య కూడా అందుకు ఎంతో సంతోషించాడు. మంచి ముహుర్తం నిర్ణయించుకుని నిశ్చితార్థం ఏర్పాటు
చేయాలనుకున్నాడు. అదే సంగతి ఊరి పెద్దలకూ చెప్పేందుకని పంచాయితీ ఆఫీసుకి వెళ్ళాడు రామయ్య. గ్రామాధికారి, ఇతర పెద్దలు అందరూ రామయ్య స్నేహితులే మరి!

అదే ఊళ్లో పంచాయతీ గుమాస్తా చలమయ్య. చలమయ్యది వక్రబుద్ధి. వాళ్ళ మాటలు వీళ్ళకు, వీళ్ళ మాటలు వాళ్ళకు చెప్పడం, స్నేహితుల మధ్య తగాదాలు పెట్టడం- ఇవి చలమయ్యకు చాలా ఇష్టం. చలమయ్యకి కూడా ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయిని భీమయ్య కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని కొంతకాలంగా కలగంటున్నాడు చలమయ్య. ఇప్పుడు ఈ సంగతి వినగానే అసూయతో అతని కడుపు రగిలిపోసాగింది. ఎలాగైనా ఈ సంబంధాన్ని చెడగొట్టి, 'భీమయ్య కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్ళి చెయ్యాల్సిందే' అనుకున్నాడు చలమయ్య.

ఆ రోజు సాయంత్రమే అతను భీముడి ఇంటికి వెళ్ళి "భీమయ్యా! నీ కొడుక్కి రామయ్య కూతురిని అడిగావుటగా!? పంచాయితీ ఆఫీసు దగ్గర ఆ రామయ్య ఏం మాట్లాడుతున్నాడో తెలుసా?!" అన్నాడు.

"ఏమన్నాడు?!" ఆశ్చర్యంగా అడిగాడు భీమయ్య.

"ఆఁ! ఏమంటాడా?! 'గొడ్డులాగా కష్టపడటం తప్ప భీమయ్యకు కాస్తంత కూడా తెలివి లేదు; వాడి కొడుకు కూడా అలాంటివాడే. అట్లాంటి మొద్దుకు నా కూతుర్ని ఇవ్వాలా వద్దా- అని ఆలోచిస్తున్నాను' - అని అందరితో చెప్తున్నాడు చూడు!" అన్నాడు చలమయ్య.

రామయ్య చిన్ననాటి నుండీ భీమయ్యను తమాషాగా ఇలాగే ఆటపట్టిస్తూ ఉండేవాడు- కాబట్టి 'చలమయ్య చెప్పింది నిజమే అయి ఉంటుంది' అనుకున్నాడు భీమయ్య. మర్నాడు ముహుర్తం పెట్టుకోవడానికి వచ్చిన పెద్ద మనుష్యులతో "పంచాయితీ ఆఫీసు దగ్గర ఆ రామయ్య మీతో ఏం మాట్లాడాడో మీకు కూడా తెలుసు కదా; మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ముహుర్తాలు పెట్టుకోవ డానికి వచ్చారు?" అంటూ విస విసా లోపలికి వెళ్ళిపోయాడు.

జరిగిన విషయం రామయ్యకి చెప్పారు పెద్దమనుషులు. 'పంచాయితీ ఆఫీసు దగ్గర ' అన్నాడు కదా, భీమయ్య? ఆ వాక్యం అధారంగాఏం జరిగి ఉంటుందో ఊహించాడు రామయ్య. ఇదంతా చలమయ్య పని అని గుర్తించాడు. చలమయ్య మనసులో ఉన్న దుర్బుద్ధిని కూడా తెలివైన రామయ్య కనిపెట్టాడు.

వెంటనే అతను గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి, తన అనుమానం వివరించి, సహాయం చేయమని కోరాడు. గ్రామాధికారి వెళ్ళి భీమయ్యతో మాట్లాడేసరికి చలమయ్య దుష్టత్వం బయట పడ్డది.

వెంటనే భీమయ్య కోపంతో చలమయ్య ఇంటికి వెళ్ళి "నిజంగా జరిగినదేమిటో చెప్తావా, లేదా?!" అని గట్టిగా అరుస్తూ చలమయ్య మీదికి చెయ్యెత్తాడు.

"క్షమించు భీమయ్యా! దుర్బుద్ధితో నీకు చెప్పుడు మాటలు చెప్పాను!" అంటూ భీమయ్య కాళ్ళ మీద పడ్డాడు చలమయ్య. తేరుకున్న
భీమయ్య అప్పటికప్పుడే రామయ్యని, పెద్దమనుషులని పిలిపించి ముహుర్తం పెట్టుకున్నాడు.

"చూశావా! తెలివితో చలమయ్య పని పట్టించాను!" అన్నాడు రామయ్య భీమయ్యతో .

"ఆ!! సరేలే! నీ తెలివితోనే పని అయిందా? గట్టిగా బెదిరిస్తూ చెయ్యెత్తితే గాని నిజం బయటికి రాలేదే ?!" అన్నాడు భీమయ్య.

"నేను చెప్పిందే రైటు అని అనుకోవడం వల్ల, 'అది తప్పు-ఇది రైటు' అంటూ ఏర్పరచుకునే పనికిరాని అభిప్రాయాల వల్లనే మనుషుల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. మీ అభిప్రాయ భేదాల వల్లనే కదా, బంగారం లాంటి మీ స్నేహం పాడవబోయింది? ఇకనైనా ఇలాంటి వ్యర్థ వాదనలు మానండి!" అన్నాడు గ్రామాధికారి గంభీరంగా.

అంగీకరించినట్లు, సిగ్గుగా నవ్వారు రామయ్య-భీమయ్యలిద్దరూ.