చిన్నారులంతా బాలలదినోత్సవం సంబరంగా జరుపుకొని ఉంటారు కదూ! సంపాదకీయంలో 'సీను'లాగా ఉపన్యాసాలు అదరగొట్టేసారా మరి? పదింట తొమ్మిది పిల్లల కథలతో ఈసారి కొత్తపల్లి పుస్తకం నిజంగా బాలల దినోత్సవ ప్రత్యేక కానుకలాగా అనిపించింది.

వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నట్లు, బద్ధకాన్ని వదలగొట్టటానికి మంచి ఉపాయమే చెప్పారు సౌమ్య అండ్ కో. దేవుడి తరపున పిశాచం‌ రావటం మాత్రం వెరైటీ!

ఏనుగు, సీతాకోక చిలుకల కాంబినేషన్ తమాషాగా ఉంది. మామూలుగా పెద్ద జంతువులు చిన్నవాటిముందు బడాయి పోతాయి కదా! భువనేశ్వరి భిన్నంగా ఆలోచించింది. ఇంతకీ ఏనుగు, సీతాకోకచిలుకలు ఎలాంటి ఆటలు ఆడుకున్నాయో సరదాగా ఆలోచించచ్చుకూడా.

'గాడిద తన్నులు' కథనం కొత్తగా ఉంది. నక్కనుంచి గాడిద, ఆ తర్వాత పాప తప్పించుకోవటం కథలో కథలాగా ఉంది. మొత్తానికి పాప చాలా ధైర్యవంతురాలే!

'చేయగలం' అనే నమ్మకమే మనచేత అసాధ్యమనుకునే పనులు కూడా చేసేలా చేస్తుందని తెలుస్తోంది కదూ, ఆ కథ ద్వారా? 'రాజు పేద' అనే సినిమాలో ఓ 'జేబులో బొమ్మ' ఉంటుంది. అదీ ఇట్లానే, భలే పనులు చేయిస్తుంది, చంద్రశేఖర్ మంత్రంలా!

దొంగతనం చేసిన పవన్‌ని తోటమాలి మొదట కొట్టినా, మళ్ళీ తనే అతని మనసు మార్చటానికి ప్రయత్నించటం చాలా బాగుంది. అందుకు వేసిన ప్లాను కూడా‌ బాగుంది.

ధర్మం రోడ్డుమీద పడిందనటంలో నిజంగానే చాలా పెద్దరికం కనబడింది. గాంధీతాతని ధర్మంతో సరిపోల్చటం నిజంగా ఆ చిన్నిబుర్రకి ఎలా సాధ్యమైందా అనిపించింది.

'పిశాచాల సహాయం' కథని వినిపించినప్పుడు, ఓ ఐదేళ్లపాప మొదట్లో చాలా కంగారు పడింది- రంగడిని వాళ్ల అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపొమ్మన్నదేమిటని బాధపడింది- మళ్ళీ పిశాచాలు సహాయం చేయటం ఏమిటని కాస్త ఆశ్చర్యపోయింది- చివరికి అమ్మే ఆ నాటకం‌ఆడించిందని తెలిసాక తృప్తిగా నవ్వింది! ఎంత బద్ధకస్తుడైనా, కొడుకుని తల్లి అలా వెళ్ళగొట్టదన్న నమ్మకం అబద్ధం కాదనుకుంటా. నాగమణి కథ చక్కగా వ్రాసింది.

చందమామలోని కుందేలుని ఆశ చూపెట్టి, నక్కనీ పులినీ స్పేస్‌షిప్‌లో అక్కడికి పంపించేద్దామన్న ఐడియా అనన్యకే సాధ్యం! కుందేలులా నువ్వూ భలే తెలివిగా ఆలోచించావు, అనన్యా!

రత్నహారపు సమస్యని పుణ్యవతి నిజంగానే చాలా మంచి ఉపాయంతో పరిష్కరించింది. చీమలు ఎంతటి ఘనకార్యమైనా చెయ్యగలవని తనకెలా తెలిసిందో, మరి!

అనురాగ్ చెప్తున్న 'నోటి దుర్వాసన' కథలో చివరికి వాసన పోయిందా, లేదా? ఆసుపత్రి పాలైనట్లున్నాడు, పాపం! ఇంకా నోట్లో మౌత్‌వాష్ పోసుకుంటూనే ఉన్నాడా? ఏమైందో‌వచ్చే పుస్తకంలో చెబుతారనుకుంటా, కదూ?

అట్టమీద బొమ్మ, యువకెరటాలు యథాప్రకారం బాగున్నాయి. క్రిస్మస్ తాతయ్యకోసం, అందరికీ మరిన్ని కథలు, కబుర్లు కానుకలు తీసుకొచ్చే కొత్తపల్లి కోసం ఎదురు చూస్తూ ఉందాం.