ఒక రాజుకు కలలో దేవుడు ప్రత్యక్షమై ఒక రత్నాన్ని బహూకరించాడు.

దానికి రెండు వైపులా రంధ్రాలు ఉన్నాయి. దాన్ని హారంలో వేసుకొని ధరించాలనిపించింది రాజుకు.

ఆస్థాన కంసాలిని పిలిచి "మంచి హారంలోకి ఎక్కించండి దీన్ని" అని ఆదేశించాడు.

మరుదినం కంసాలి వచ్చి "మహారాజా! ఎంత ప్రయత్నించినా బంగారు తీగ రత్నం గుండా దూరటం లేదు. రత్నానికి రంధ్రం సరిగా ఉన్నట్లు లేదు- మధ్యలోనే అడ్డుకుంటున్నది. పోనీ, 'దారాన్ని ఇంకొంచెం సన్నం చేద్దామా' అంటే, అది ఇప్పటికే చాలా సన్నం అయిపోయిందాయె!" అన్నాడు.

దాంతో రాజు దేశ దేశాల స్వర్ణకారులను పిలిపించాడు. అయినా ఫలితం లేదు- ఆ రత్నంలోంచి దూరేంత సన్నటి దారాన్ని ఎవ్వరూ చెయ్యలేకపోయారు.

అదే దేశంలోని తెలివైన యువకుడు ఒకడు ఒకసారి రాజువద్దకు వచ్చి, "నేను ప్రయత్నించి చూస్తాను" అన్నాడు. "చూద్దువు గాని, అయినా ఇంతమంది దగ్గర లేనిది, నీ దగ్గర ఉన్నది ఏమిటి? అదీగాక మీది స్వర్ణకార కుటుంబం కూడా కాదాయె!" అన్నాడు రాజు.

"తెలివి, పట్టుదల- ఈ రెండూ ఉన్నై నాలో. అయినా ప్రయత్నిస్తే తప్పేముంది?" అన్నాడు యువకుడు. రాజు సంతోషించాడు. "నువ్వేకాదు, ఆ పని ఎవరు చేసినా వాళ్లకు మంచి బహుమతి ఇస్తాను" అన్నాడు. కంసాలి తయారుచేసిన బంగారుతీగనే తీసుకున్న యువకుడు, ముందు ఒకరోజంతా ఆ రత్నంతో‌ కుస్తీపట్టాడు- అయినా ఏమీ లాభం లేదు- రత్నపు రంధ్రంలోకి నిజంగానే దూరటంలేదు దారం. "రత్నం చాలా గట్టి వస్తువు- దాని బెజ్జాన్ని పెద్దది చేయగల వస్తువు ఏదైనా కావాలి.. అది రత్నం కంటే గట్టిది అయి ఉండాలి.."

కొంత సేపటికి అతనికి ఓ ఆలోచన వచ్చింది. "ప్రభూ! నాకు కొద్దిగా తేనె ఇప్పించండి. దానితోబాటు ఒక రోజు సమయం దయ చేయించండి" అని అడిగాడు. రాజుగారు సరేనన్నారు.

మరునాడు తెల్లవారే సరికల్లా రత్న హారాన్ని తీసుకువచ్చి రాజుకి అందజేశాడు యువకుడు! హారంలో రత్నం చక్కగా అమరి ఉన్నది! రాజు ఆనందానికి హద్దులు లేవు .

"భళా! ఎందరో గొప్ప స్వర్ణకారుల వల్ల కాని పని నీవల్ల అయింది. ఎట్లా చేశావు?" అని అడిగాడు యువకుడిని, నిండు సభలో సన్మానిస్తూ.

"మహారాజా! రకరకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాక, ఇక ఆ పని మానవమాత్రుల వల్ల సాధ్యమయ్యేది కాదని అర్థం అయ్యింది నాకు. అందుకని ఆ బంగారు తీగను తేనెలో ముంచి, రత్నపు బెజ్జంలో అది దూరినంత వరకు దూర్చి, గదిలో మూలగా- ఒక చీమల పుట్టకు ఎదురుగా- పెట్టాను. కొంచెం సేపటికల్లా తేనె వాసన పట్టి, చీమలు రత్నంలోకి రాసాగాయి. నేను రత్నాన్ని కదలకుండా ఇరికించి పెట్టాను; అలాగే తీగ రత్నంలోంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డాను. అంతే, తెల్లారే సరికి చీమలు తీగను బెజ్జంగుండా రెండో‌వైపుకు లాక్కెళ్ళాయి! మరి అవి రత్నపు బెజ్జాన్నే పెద్దగా చేశాయో, లేక తీగను సన్నగా చేశాయో మరి, తెలీదు. ఇది నా గొప్పతనం కాదు. ఆ చిన్న చీమలు చేసిన ఘనకార్యం ఇది" అని జవాబిచ్చాడు.

అది విని సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు. రాజు ఆ యువకుడిని ఘనంగా సత్కరించటంతో పాటు, అతన్ని తన ఆంతరంగిక సలహాదారుగా నియమించు-కున్నాడు.