అనగా అనగా సీతాపురంలో పవన్ అనే ఒక అల్లరి పిల్లవాడు ఉండేవాడు. వాడి అల్లరికి అంతు ఉండేది కాదు.సైకిల్ తొక్కుతూ చిన్న పిల్లల్ని భయపెట్టేవాడు,అందరినీ కొట్టేవాడు, స్కూలు ఎగ్గొట్టి రోడ్డు మీద గోలీలు ఆడేవాడు. తోటల్లో జామకాయలు దొంగతనం చేసేవాడు.

ఒక రోజు వాడు దొంగతనం చేస్తూ, తోటమాలికి దొరికిపోయాడు. తోట మాలి వాడిని పట్టుకొని బాగా కొట్టాడు. ఆ రోజు నుంచి పవన్ ఇంకా మొద్దు బారిపోయాడు- మరిన్ని దొంగ పనులు చేయటం మొదలుపెట్టాడు.

ఇలా వాడు దొంగిలించిన వస్తువులు, డబ్బులు అన్నిటినీ వాడు చెరువు గట్టున ఒక చెట్టు క్రింద గుంత తవ్వి పాతిపెట్టేవాడు. కొత్తగా తెచ్చుకున్న వాటిని పాతిపెడుతున్న ప్రతిసారీ తన సంపద మొత్తాన్నీ‌ ఒకసారి చూసుకొని మురిసి పోయేవాడు.

ఒక రోజు అలా దొంగ సొత్తును పాతిపెట్టుతున్న పవన్ మెడకు చల్లగా ఏదో తగిలింది..చూడగా అది ఒక కత్తి! బుర్ర మీసాలు పెట్టుకొని, కండలు తిరిగిన గజదొంగ ఒకడు వాడి వెనకాలే నిలబడి ఉన్నాడు.

"మర్యాదగా ఆ డబ్బంతా ఇచ్చేయ్" అన్నాడు దొంగ.

పవన్ భయంతో వనణికి పోతూ తన డబ్బును , సామాన్లను అన్నిటినీ దొంగ కాళ్ళ ముందు పడేశాడు.

"ఒరేయి పిల్లాడా ఇవన్నీ నీకెక్కడివి? ఇంత డబ్బు ఉందంటే నువ్వు కూడా నాలాగే దొంగవి అయ్యుండాలి. నేను ఇప్పటికే ఐదు సార్లు జైలుకు వెళ్ళాను, ఈ సారి నువ్వు కూడా వస్తావా, నాతో ?" అడిగాడు దొంగ, మెడ మీద కత్తిని మెల్లగా జరుపుతూ .

పవన్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. "బె...బె....బె....బె.." అని మాత్రం అనగలిగాడు.

దొంగ గట్టిగా నవ్వుతూ "ఒరేయ్! చిన్న దొంగ సొమ్ము పెద్ద దొంగ పాలు. ఇక మీద నువ్వు దోచినదంతా నాదే! హ హ్హ హ్హ హ్హ " అన్నాడు సామాన్లు మూట కట్టుకుంటూ.

పవన్ బిత్తర పోయి చూస్తుంటే దొంగవాడు వెనక్కి తిరిగి "ఒరేయ్! నా మాట విను. దొంగ బతుక్కి అర్థం లేదు. నువ్వు కూడా నాలాగా తయారవ్వకు. నువ్వు బాగుపడనంత వరకూ నేను మాత్రం నిన్ను వదలను- నీ దొంగ సొమ్ము అంతా నాదే! -గుర్తుంచుకో !" అని నవ్వుతూ వెళ్లి పోయాడు.

ఆ తరువాత పవన్ దొంగతనాలు మానేశాడు. బడికి వెళ్ళటంకూడా మొదలు పెట్టాడు. క్రమంగా వాడు చాలా మంచివాడు అయ్యాడు. పవన్‌ను మార్చడం కోసం దొంగ వేషంలో వచ్చిన తోటమాలి వాడిలోని మార్పుకు చాలా సంతోషించాడు.