నక్క: నమస్కారం , కుందేలు బావా.

కుందేలు: నమస్కారం జిత్తులమారి నక్కగారూ.

నక్క: ఏం చేస్తున్నావు?

కుందేలు: నేను క్యారెట్ల కోసం వెతుకుతున్నాను.

నక్క: ఓహో!

కుందేలు: మరి నువ్వు ఏమి చేస్తున్నావు?

నక్క: నా స్నేహితుడైన పులికోసం వెతుకుతున్నాను.

కుందేలు: అవునా! ఇందాకే దాన్ని ఇక్కడికి దగ్గర్లో‌చూశాను. ఈ పాటికి అది తన గుహకి చేరుకొని ఉంటుంది. త్వరగా వెళ్ళు .

నక్క: టాటా కుందేలూ!

కుందేలు: టాటా నక్కగారూ!

(కొంచెం సేపటికి )

నక్క: అయ్యో నా స్నేహితుడు కనిపించటంలేదే! ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకు వెళ్ళి ఉంటుంది?

(అంతలో) పులి: హై! నేను వచ్చేసాను!

నక్క: అయ్యో! ఎక్కడ ఉన్నావు? నేను నీ కోసం ఉదయం నుండి వెతుకుతున్నాను.

పులి: నేను నా ఆహారం వెతుక్కునేందుకు వెళ్ళాను.

నక్క: అయితే సరే మిత్రమా, నేను నీకు మంచి కుందేలును ఆహారంగా చూపిస్తాను- వస్తావా?!

పులి: అయ్యో! ప్రస్తుతం నా కడుపు నిండుగా ఉంది. రేపు ఉదయాన్నే వెళ్దాంలే. సరేనా?

మరునాడు ఉదయం:

పులి: కుందేలును తినేందుకు వెళ్దామా?

నక్క: సరే.

(కుందేలు దగ్గరకు వెళ్ళి..)

నక్క,పులి: శుభోదయం కుందేలు మిత్రమా.

కుందేలు: శుభోదయం .

నక్క, పులి: నీకు ఒక మంచి సమాచారం.

కుందేలు : (లోపల)మళ్ళీ ఏదో పథకం వేసినట్లున్నారు.

(పైకి)ఏమిటది?

నక్క, పులి: తాటి చెట్టు దగ్గర క్యారెట్లు భలే ఉన్నాయి. తెలుసా!

కుందేలు: (లోపల)ఓహో, అదన్నమాట, వీటి పథకం!

(పైకి) సరే అక్కడికి వెళ్దాం గానీ, ముందు నేనూ మీకో మంచి కబురు చెప్పాలి.

నక్క, పులి: ఏంటది?

కుందేలు: మన ఊళ్ళో రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది తెలుసు గదా?

నక్క, పులి: అవును, అయితేనేమి?

కుందేలు: మీరెప్పుడైనా చంద్రుడిని చూశారా?

నక్క, పులి: మాకు చంద్రుడంటే ఏమంత ఇష్టం లేదు.

కుందేలు: అయ్యో! అదేకదా, మీ మూర్ఖత్వం? ఓసారి చూడండి చంద్రుడి మీద- మీకు రెండు కుందేళ్ళు కనబడతాయి. నిజానికి చంద్రుడు తెల్లగా ఎందుకు ఉన్నాడనుకుంటున్నారు? అదంతా కుందేళ్ల రాజ్యమే. అక్కడ ఉన్నన్ని కుందేళ్ళు ఈ భూగ్రహం మీద కూడా లేవు.

నక్క , పులి: అవునా?

కుందేలు: కాకపోతే నేనెందుకు చెబుతాను? వినండి. రేపు ఉదయం ఇక్కడినుండి స్పేస్ షిప్ ఒకటి అక్కడికి వెళ్తున్నదట. దానిలో‌ మా మిత్రుడొక కుందేలు వెళ్తోంది. మీకు ఇష్టమైతే మీరూ అందులో వెళ్ళేట్లు ఏర్పాటు చేస్తానన్నది. చెప్పండి మరి, మీకు ఇష్టమేనా? అక్కడైతే మీకు తోచినన్ని కుందేళ్లను తిని, మళ్ళీ అదే స్పేస్ షిప్ లో‌వెనక్కి రావచ్చు.

నక్క, పులి:(సంబరపడుతూ) ఇదేదో పిచ్చి కుందేలు లాగా ఉంది. ఇందులో మోసం ఏమీ లేదు గద?! సరేలే, దానిదేముంది, ఇది మనల్నిప్పుడు మోసం చేసినా మళ్ళీ దొరుకుతుందిగా, మా చేతికి? (పైకి) ఓహో కుందేలూ! అసలైన మిత్రుడివంటే నువ్వే! రేపు మేం నువ్వు కోరినట్లుగా చంద్రుడిమీదికి వెళ్ళొస్తాం.

కుందేలు: సరే సరే! అయితే రేపు రెడీగా రండి మరి! మరునాడు స్పేస్ షిప్‌లో నక్కి కూర్చున్నై, నక్క, పులి. వాటిని అందులో ఎక్కించిన కుందేలు ఎటు పోయిందో మరి, పోయింది.

నక్క: పులీ! నీ గొంతు మరీ పెద్దది. అస్సలు మాట్లాడకు!

పులి: సరేలే! ఎక్కువ మాట్లాడకు నువ్వూనూ. మనం బయట పడితే కష్టమే. వీళ్ళు మధ్యలోనే దింపేస్తారు మనల్ని. (రాకెట్ పైకి వెళ్తున్నకొద్దీ వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోసాగింది. స్పేస్ షిప్ లో ఉన్న మనుషులు ఆక్సిజన్ మాస్కులు వేసుకొని హాయిగా ఉన్నారు. దొంగతనంగా ప్రయాణిస్తున్న పులి,నక్క మాత్రం ఊపిరాడక చచ్చిపోయాయి)

నక్క పులి: అయ్యో! అయ్యో! ఊపిరి! ఆడట్లేదు! అయ్యో! ఎందుకు? ఏమైంది? వాటిని పైకి పంపించిన కుందేలు అటుపైన హాయిగా బ్రతికింది.