ఆవునూర్‌లో ఉండే పోశవ్వకు డెబ్భై ఏళ్ళు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కొడుకులు. అందరికీ పెళ్ళిళ్లు అయ్యాయి; కానీ ఈ మధ్యనే అకస్మాత్తుగా కొడుకులు ఇద్దరూ చనిపోయారు. దాంతో పోశవ్వ చాలా దు:ఖంలో ఉంది.

'పులిమీద పుట్ర' లాగా, సరిగ్గా అదే సమయంలో ఆమె నివసించే పూరిగుడిసె కాస్తా కూలిపోయింది. పోశవ్వకు ఇక ఏం చేయాలో తోచలేదు. తన పుట్టింటివాళ్ళు పెట్టిన నగల్లో కొన్నింటిని బిడ్డలకు ఇవ్వగా, మిగిలిన కొన్ని ఆమె ఒంటి మీదే ఉన్నాయి. ఆమె వాటిని ఖర్చు చేయలేదు. అంత వయసు వచ్చినా కూలికి పోయి తన బ్రతుకు తాను బ్రతుక్కుంటూనే ఉన్నది తప్ప, బంగారం అమ్ముకోలేదు. ఇప్పుడు ఉన్న ఈ గుడిసె కూడా పోతే, తను ఇక ఎక్కడ ఉండాలి?

పోశవ్వ ఇక చేసేదేమీ లేక చిన్న కూతురు ఇంటికి వెళ్లింది. ఆమె చిన్న కూతురు పేదరాలు- కూలికి పోతే తప్ప పూట గడవదు. అందుకని ఆమె తల్లిని ఇంట్లో వదిలి పనికి పోయింది.

పోశవ్వ ఒంటరిగా ఇంటి బయట మంచం మీద కూర్చొని చూస్తూ ఉంది. ఆమెకు పాపం ఆకలిగా ఉంది. ఇంట్లో ఏమీ ఉన్నట్లు లేవు- తన ఇంట్లో అయితే ఏదో ఒకటి చేసుకొని తినేది. కానీ ఇది కూతురి ఇల్లాయె! ఊరుకోలేని పోశవ్వ ఊరికే తనలో తాను ఏదో గణగణా గొణుక్కోవటం మొదలుపెట్టింది.

సరిగ్గా ఆ సమయానికి అటుగా పోతున్నాడు రాజం అనే విద్యార్థి ఒకడు. పోశవ్వ మాటలు విన్న రాజం ఆమె దగ్గరకి వచ్చి "ఏమైందవ్వా? ఏంటి ఊరికే గొణుక్కుంటున్నావు?" అని అడిగాడు. బాగా ఆకలి మీద ఉన్న పోశవ్వ సంగతంతా చెప్పి "ఏదో, ముసల్ది కదా, తింటుంది అని కొంచెం కూడా అన్నం వదిలిపెట్టకుండా పోతే, ఇక నేను తినేది ఎలాగ, బతుక్కునేది ఎలాగ నాయనా, చెప్పు?!" అన్నది.

రాజం కరిగిపోయాడు. తన బాక్సులో ఉన్న టిఫిన్ తీసి, పోశవ్వకు ఇచ్చి తినమన్నాడు. ఆకలిగొన్న పోశవ్వ గబగబా తిన్నది.

రాజం ఖాళీ బాక్సుతో బడికి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజున రాజం బాక్సులో పులిహోర తెచ్చుకున్నాడు. దారిలో‌ ఆగి పోశవ్వకు బాక్సు ఇచ్చి తినమన్నాడు. "మరి నీకు ఎలాగ నాయనా?!" అడిగింది పోశవ్వ. మాకు బడిలో భోజనం పెడతారులే అవ్వా! మాకేమీ సమస్య లేదు- నువ్వు కడుపు నిండా తిను చాలు" అన్నాడు రాజం.

మూడో రోజున కూడా ఇలాగే జరిగింది. పోశవ్వకు చాలా సిగ్గుగా అనిపించింది. నాలుగో రోజున ఆమె వాడిని దగ్గరికి పిలిచి, "చూడు రాజం, నీకు ఈ సంవత్సరం పరీక్ష ఫీజు ఎంతవుతుంది?" అని అడిగింది. "ఒక ఐదారు వందలు అవుతుందవ్వా" అన్నాడు రాజం. సరే, అయితే ఈసారి నీ ఫీజు నేను కడతాను. సరేనా? ఇప్పటికి ఈ వంద రూపాయలు ఉంచు. పాపం నీకోసం తెచ్చుకున్నదంతా నాకు పెడుతున్నావు" అన్నది.

రాజం బాగా మొహమాట పడ్డాడుగానీ, పోశవ్వ బలవంతం చేసే సరికి 'సరే' అనక తప్పలేదు. రాజంకు తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఆవిడ రాజం చిన్నగా ఉండగానే పోయింది. రాజంకు పోశవ్వను చూస్తే తన అమ్మమ్మని చూసినట్లు ఉండేది. దాంతో వాళ్ళ అమ్మ తను ఇంటర్వెల్‌లో తినేందుకు పెట్టిన దోశ, చపాతి లాంటి టిఫిన్లను బడికి తీసుకెళ్లకుండా పోశవ్వకు ఇచ్చేసేవాడు. బడిలో తనకు ఎలాగూ మధ్యాహ్న భోజనం పెడతారాయె!

ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజున రాజం వచ్చేసరికి పోశవ్వ ఇంట్లో ఉన్నది. ఆమె కూర్చున్న కుర్చీ ఇంటి కిటికీ లోంచి కనబడుతున్నది. ఆమె ప్రక్కన ఎవరో కుర్రాడు నిలబడి ఉన్నాడు. వాడి చేతిలో ఒక కత్తి- ఆ కత్తిని వాడు పోశవ్వ మెడకు ఆనించి ఉన్నాడు! పోశవ్వ ఏడ్చుకుంటూ తన నగల్ని తీసి వాడి చేతులో పెడుతున్నది!

వెంటనే రాజం సమయస్ఫూర్తితో పోశవ్వ ఉండే ఇంటికి బయటినుండి గొళ్లెం వేసి, పోలీసులకు ఫోన్‌ చేసాడు. లోపల ఉన్న దొంగ ఇదంతా గమనించే స్థితిలో కూడా లేడు. వాడు పోశవ్వ ఒంటిమీద నగలన్నీ ఒలుచుకొని, మూటగట్టుకొని 'ఇక బయటపడుదాం' అనుకునేసరికి పోలీసులు గబగబా లోనికి వచ్చి వాడిని చుట్టు ముట్టేసారు!

పోలీసులు పోశవ్వ కూతురును పిలిపించి, నగల్ని ఆమెకు అప్పజెప్పారు. "ఈ పిల్లాడు అనుమానించి మాకు ఫోన్‌ చేసాడు కాబట్టి దొంగ దొరికాడు. లేకపోతే ఏమయ్యేది? ముసలివాళ్ళ మీద నగలు అట్లా వదిలి పోతారా?!" అని తిట్టారు. ఆ రోజు సాయంత్రం పోలీసు అధికారులు రాజంని అభినందించి ఐదు వందల రూపాయలు బహుమతిగా ఇచ్చారు!

మరునాడు ఎప్పటిమాదిరే పోశవ్వకోసం టిఫిన్ డబ్బా పట్టుకొచ్చాడు రాజం. అయితే ఆమె ఉండే ఇంటికి తాళం పెట్టి ఉన్నది- పోశవ్వ మళ్ళీ తన ఊరికి వెళ్ళిపోయిందట! ఆమె బిడ్డ కూలికి పోయింది.

రాజం మనసంతా వెలితిగా అనిపించింది. పోశవ్వ వాళ్ల ఊరు వెళ్ళి కలుద్దామను-కున్నాడు గానీ, తను పదవతరగతిలో ఉన్నాడు; చదవవలసింది చాలానే ఉన్నది. "సెలవల్లో వెళ్తాను" అని నిశ్చయించుకున్నాడతను.

అంతలో పరీక్ష ఫీజు కట్టే సమయం దగ్గర పడింది. ఫీజు ఆరువందల రూపాయలు. రాజం తల్లిదండ్రులు "ఒక్కసారిగా అంత డబ్బా?!" అన్నారు. పోశవ్వ తనకిచ్చిన వంద రూపాయలు, పోలీసులు ఇచ్చిన బహుమతి ఐదు వందలు గుర్తుకొచ్చాయి రాజంకు. ఆ డబ్బులు కట్టి, బాగా చదివి, చక్కగా, ధైర్యంగా పరీక్షలు రాసాడు.

పదవతరగతిలో రాజంకు 10 GPA వచ్చింది! జిల్లాలోనే అతనిది ప్రథమ స్థానం! బడిలో అధ్యాపకులు, జిల్లా అధికారులు అందరూ అతన్ని అభినందిస్తూ పదివేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు!

రాజంకు చాలా తృప్తిగా అనిపించింది. వాళ్ల అమ్మానాన్నలకు పోశవ్వ గురించి చెప్పి "ఆ అవ్వ ఇచ్చిన డబ్బులే లేకుంటే నేను పరీక్షలు రాయకనేపోదును. ఆమె ఆశీస్సులే నాకు ఈ రోజున పదోతరగతిలో ర్యాంకు తెప్పించాయి- వాళ్ల ఊరు వెళ్ళి ఆమెను కలిసి వద్దాం, రండి" అని వాళ్లని పిల్చుకొని పోశవ్వ వాళ్ళ ఊరికి వెళ్ళాడు.

అయితే వీళ్ళు వెళ్ళేసరికి పోశవ్వ ఆసుపత్రిలో ఉందని తెలిసింది! ఆమెకు రక్తం కూడా కావలసి ఉంది! దీంతో రాజం తనకు తెలిసిన సార్లకు ఫోన్ చేసి, పోశవ్వ రక్తం గ్రూప్ చెప్పి, రక్తం తెప్పించాడు. ఆ రక్తం ఎక్కించాక పోశవ్వ ఆరోగ్యం మెరుగయింది. హాస్పిటల్ ఖర్చును కూడా తానే కట్టి రాజం ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లాడు.

అలా పోశవ్వకు తనను ప్రేమించే మనవడు ఒకడు దొరికాడు. రాజంకు ఒక అమ్మమ్మ దొరికింది.

పై చదువుల్లో కూడా మంచి ఫలితాలు సాధించాడు విజయ్. కోరిన ఉద్యోగం సాధించి జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నాడు. అటుపైన ముసలివారికి సేవ చేయటం కోసం‌ చక్కని ఓ వృద్ధాశ్రమం కూడా నిర్మించాడు.