రామాపురంలో నివసించే పర్వతాలుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు చాలా తెలివైనవాడు. చిన్నవాడు అమాయకుడు. పర్వతాలు తన జీవితంలో పెద్దగా ఏమీ కూడబెట్టలేదు గానీ, కొద్ది రోజులలో చనిపోతాడనగా అతనికి ఒక చింత పట్టుకున్నది- "పెద్దవాడు చిన్నవాడిని మోసం చేస్తాడేమో, ఇద్దరూ కలిసి బ్రతుక్కునే విధానం చూడాలి" అని.

అదే బెంగతో అతను మంచం పట్టాడు. చివరికి చనిపోబోతుండగా అతను పిల్లలిద్దరినీ పిలిచి, ఇద్దరికీ తన ఆస్తులైన మామిడి చెట్టు, ఆవు, ఒక కంబళి చూపించి- "వీటిని మీరిద్దరూ అనుభవించాలి!" అని సైగలు చేసి చెబుతూ కన్నుమూసాడు.

మరుసటి రోజున పెద్దవాడు తమ్ముడిని పిలిచి "ఒరే, తమ్ముడూ! నాన్న మనకు ఒకే చెట్టు, ఒకే ఆవు, ఒకే కంబళి ఇచ్చాడు కదా; వాటిని మనం ఎలా పంచుకుందా-మంటావు?" అని అడిగాడు.

"వాటిని అమ్మి చెరిసగం తీసుకోవచ్చుగానీ, మనం అట్లా చేయకూడదు. స్వర్గంలో ఉన్న నాన్న ఆత్మ సంతోషపడాలంటే మనం‌ వీటిని కలిసి అనుభవించాలి" అన్నాడు తమ్ముడు.

"అదేరా, నేను చెప్పేది కూడాను. వీటిని మనం ముక్కలు చేయకూడదు- కనుక వాటిని కలసి ఉపయోగించుకుందాం. చెట్టు మొదలు నీకు, పై భాగం నాకు. అట్లాగే ఈ కంబళిని పగలంతా నువ్వు వాడుకో, రాత్రంతా నేను వాడుకుంటాను. ఇక ఆవు ముందు భాగం నీకు, వెనుక భాగం నాకు!" అన్నాడు అన్న తెలివిగా.

అయోమయం తమ్ముడికి అందులోని కపటం అర్థం కాలేదు. "నువ్వెట్లా అంటే అట్లా చేద్దాం. నీ మాట కాదంటానా అన్నయ్యా?!" అనేసాడు.

ఇక ఆనాటి నుండి ప్రతి రోజూ తమ్ముడు చెట్టు మొదలుకు నీరు పోసేవాడు. ఆవు నోట్లోకి మేత, కుడితి అందించేవాడు. కంబళిని ఏ రోజుకారోజు ఉతికి, ఆరవేసి, మడత పెట్టేవాడు.

చెట్టు కొమ్మలకు కాసిన కాయలు, పండ్లు తీసుకునేవాడు అన్న; ఆవు పాలు తను పిండుకునేవాడు- పేడ అంతా తనే తీసుకునేవాడు; తమ్ముడు ఉతికి పెట్టిన కంబళిని చక్కగా రాత్రిపూట కప్పుకునేవాడు!

ఇలా కొంతకాలం గడిచిపోయింది. అన్నకు, తమ్ముడికి ఇద్దరికీ పెళ్ళి అయ్యింది. తమ్ముడి భార్య లక్ష్మి తెలివైనది. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అతని అన్న ఎలా మోసం చేస్తున్నాడో గమనించింది.

ఒక రోజు ఉదయాన్నే చెట్టుకు నీరు కడుతున్న భర్తతో లక్ష్మి "ఇదిగోయ్యా, గొడ్డలి తీసుకురా, ఓ మాటు" అన్నది. అతను గొడ్డలి తేగానే, "ఇదిగో, ఈ మాను మొదలు నీదే కదా, మీ అన్నది కాదు కదా?" అన్నది.

"అవును-నాదే" అన్నాడు తమ్ముడు.

"మరైతే ఇంకేమి, దీన్ని నరుకు. పొయ్యిలోకి కట్టెలు లేవు" అన్నది లక్ష్మి, దగ్గర్లోనే నిలబడి వింటున్న పెద్దాయనను గమనిస్తూ.

తమ్ముడు చెట్టుకు ఒక్కవేటు వేసాడో లేదో, అన్న వచ్చి అడ్డుకున్నాడు "మొదలు కొడితే మొత్తం చెట్టు చనిపోతుంది. కొట్టకు. ఇక నుండి మనం‌ ఇద్దరం చెట్టుకు నీళ్ళు పోద్దాం; కాసే కాయల్ని కూడా సమానంగా పంచుకుందాం" అన్నాడు.

ఆరోజు సాయంత్రం అన్న ఆవు పాలు పిండుకుంటుండగా భర్తను పిలుచుకొని అక్కడికి చేరుకున్నది లక్ష్మి. ఆవుకు మొక్కుకొని, దాని ముఖాన్ని కడిగి, బొట్టు పెట్టి, "ఇదిగో, ఈ ఆవు ముందు భాగం నీదే కదయ్యా?" అన్నది భర్తతో.

"అవును" అన్నాడు తమ్ముడు.

"మరైతే ఒక బెత్తం తెచ్చి, కొద్ది సేపు దీని మూతిమీద కొట్టు" అన్నది లక్ష్మి.

తమ్ముడు ఆమెకేసి అదోలాగా చూసాడు కానీ, అన్న ముందుకొచ్చి "ఇదిగో, అలా చెయ్యకు. ఆవు తన్నిందంటే పాలన్నీ‌ నేలపాలు అవుతాయి. ఇకమీద ఆవును ఇద్దరం మేపుదాం; పాలు కూడా చెరి సగం తీసుకుందాం" అన్నాడు.

ఆరోజు సాయంత్రం అవుతుండగా కంబళిని నీళ్ళలో నానబెట్టింది లక్ష్మి. రాత్రికి దాన్ని కప్పుకునేందుకు వచ్చిన అన్న దాన్ని గమనించి "ఒరే! తప్పయిపోయింది. మనం‌ ఇద్దరం రోజుమార్చి రోజు దీన్ని ఉతుకుదాం, ఇద్దరం రోజుమార్చి రోజు ఉపయోగిం-చుకుందాం. నన్ను క్షమించు" అన్నాడు.

'లక్ష్మి తెలివి తేటలు గలది' అని గమనించాక అతను పూర్తిగా మారిపోయాడు. అన్నింటా తమ్మునికి సమాన అవకాశాలిస్తూ వచ్చాడు.

అటుపైన రెండు కుటుంబాలూ కలతలు లేకుండా సఖ్యంగా జీవించాయి!