నాగపుర మహారాజు భస్మసేనుడు దయగలవాడు. ఆయన పరిపాలనలో ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేవారు. సమస్యలేమైనా ఉంటే ప్రజలు రాజుగారి దర్బారులో నివేదించుకోవచ్చు. రాజుగారు అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ప్రజలందరికీ అనువుగా ఉండేట్లు, నెలకు మూడు వారాలపాటు ప్రతిరోజూ రాజ దర్బారు జరిగేది.

నాగపురానికి ఒక చివరన దట్టమైన అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో అనేక క్రూరమృగాలుండేవి. అయినా ఏనాడూ అవి మనుషులమీదికి వచ్చేవి కావు.

అలాంటిది, ఒక ఏడాది వేసవి ప్రారంభం అవుతున్నదనగా శివార్లలోని ఒక గ్రామ ప్రజలు దర్బారుకు వచ్చి "అడవిలోని ఏనుగులు మా పంటపొలాలను నాశనం చేస్తున్నాయి- వాటిని భయపెట్టేందుకు అవసరమైన డప్పులు, టపాకాయలు తయారు చేయించి ఇప్పించాలి" అని మనవి చేసుకున్నారు.

భస్మ సేనుడు వెంటనే ఆదేశాలు ఇచ్చాడు- "వీరికి అవసరమైన వస్తువులను సమకూర్చండి" అని. వాళ్ళు సంతోషంతో‌ వెనుతిరిగారు గానీ, ఆ సమయంలో‌ అక్కడే ఉన్న మంత్రిగారి ముఖం వివర్ణం అవ్వటం గమనించాడు భస్మసేనుడు. వాళ్ళు వెళ్లగానే మంత్రిగారిని దగ్గరికి పిలిచి అడిగాడు- "మీరేదో, విచారంగా ఉన్నారు- అదేమిటో మాకూ చెబితే మేమూ ఆలోచిస్తాం" అని.

అక్కడే ఉన్న రాజకుమారుడు సుందరసేనుడు చిరునవ్వు నవ్వి- "ప్రభువుల పరిశీలనా శక్తి అమోఘం. నేను, మంత్రిగారు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం-

ఏనాడూ లేనిది ఏనుగులు పంటపొలాలమీదికి వచ్చాయంటే, అడవిలో వాటికి ఏదో‌ సమస్య ఎదురై ఉంటుంది. గత సంవత్సరం వానలు కూడా సరిగా పడలేదు; అడవిలోని మడుగులు ఎండి ఉంటాయి. నీళ్లకోసం అవి గ్రామ ప్రాంతాలకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మన వద్దకు వచ్చింది ఒక్క గ్రామ ప్రజలే- త్వరలో అనేక గ్రామాలవాళ్ళకు ఈ సమస్య ఎదురవు-తుంది. మనం అందరికీ డప్పులు, టపాకాయలు ఇవ్వలేం కదా; సమస్య మూలాన్ని స్పృశించేట్లు, మనం త్వరలో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది" అన్నాడు.

"చూద్దాం. సమస్య విస్తృతి ఎంత ఉన్నదో మనకు తెలీదు. ఈరోజే చారులను ఆ ప్రాంతాలకు పంపుదాం. శివారు గ్రామాలలో ఎన్నిటికి ఇటువంటి సమస్యలు ఉన్నాయో చూసి రమ్మందాం" అన్నాడు భస్మసేనుడు, గూఢచారులకు కబురంపుతూ. సుందరసేనుడి అనుమానం నిజమేనని తేలింది చారుల పరిశీలనలో. శివారు గ్రామాలన్నిటిలోనూ అడవి జంతువుల సమస్య మొదలై ఉన్నది. ప్రజలు ఎవరికి వారు అడవి జంతువులను వేటాడు-తున్నారు; చంపుతున్నారు. కొన్ని చోట్ల పులులు, కొన్ని చోట్ల చిరుతలు, నక్కలు, కుందేళ్ళు మరికొన్ని చోట్ల ఏనుగులు, ఎలుకలు- ఇలా ఏ ఊరికాఊరు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నది!

రాజుగారు వెంటనే ఆ గ్రామాలన్నిటిలోనూ రక్షణ బృందాలను ఏర్పరచటమే కాకుండా "అడవుల్లో జంతువులను బెదర గొట్టటం వల్ల, వాటి నివాస స్థలాలను దెబ్బ తీయటం వల్ల అవి ఊళ్ళమీద పడతాయి. అందువల్ల అడవిలోకి వెళ్ళి వేటాడరాదు; అడవిలో చెట్లను నరకరాదు; అడవుల పచ్చదనాన్ని నిలిపి ఉంచేలా ప్రవర్తించాలి. మనం అడవులను నాశనం చేయకపోతే జంతువులు అక్కడే ఉంటాయి" అని ఊరూరా చాటింపులు వేయించారు. అడవిలో వాగుల్ని, వంకల్ని పరిశీలించి, వాననీరు మడుగులలో చేరుకునేందుకు మార్గాలను సరి చేశారు. గ్రామ శివార్లలోని జలాశయాలను బలోపేతం చేశారు.

ఆ సంవత్సరం వానలు పడేసరికి అడవుల్లోని మడుగులన్నీ నీటితో కళకళలాడాయి. అటుపైన ఇక గ్రామాలకు అడవి జంతువుల సమస్యే లేదు!