అనగనగా ఓ సముద్ర తీర గ్రామంలో బీదవాడు ఒకడు ఉండేవాడు. ఒక రోజున వాడు చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆరోజున వాడికి అసలు ఏ చేపలూ దొరకలేదు. చాలా సార్లు వల వేయగా వేయగా, చివరికి ఓ చిన్న- అందమైన చేప ఒకటి అతని వలలో పడింది. బీదవాడు ఆ చేపను వలలోంచి బయటికి తీయబోయాడు.

ఆకస్మాత్తుగా చేపపిల్ల మానవ కంఠంలో మాట్లాడటం మొదలెట్టింది-

"చూడు అన్నయ్యా, నేను ఏదో ఆడుకుంటూ ఏమారిపోయి నీకు దొరికి పోయాను. మా అమ్మవాళ్ళు నాకోసం బెంగ పడుతుంటారు. నేనా, ఇంత చిన్నదాన్ని- నన్ను ఎవరు కొనాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, దాంతో నీకేం ఒరగాలి? నా మీద దయ చూపించు. నన్ను మళ్లీ నీళ్లలో పారెయ్యి" అని బతిమాలింది.

పేదవాడికి జాలేసింది. 'ఇంత చిన్న చేపని నేను ఏం చేసుకుంటానులే' అని, ఆ చేపని నీళ్లల్లో పడేశాడు. "అబ్బ! ఇంకెప్పుడూ చేపలు పట్టకూడదు. తినేందుకు కనీసం దొరక్కపోతే, ఇదేం వృత్తి?" అనుకున్నాడు. చేపలు పట్టే పని కాక వేరే ఇంకేంచెయ్యాలో తెలీక, విచారంగా ఇంటి దారి పట్టాడు.

అతను అట్లా నడిచిపోతుంటే, ఆకస్మాత్తుగా వాడికి ఒక పిశాచం కనిపించింది. ఆ పిశాచం ఒక చక్కని ఆవునొకదాన్ని తోలు కు వస్తోంది. "నమస్కారం అన్నయ్యగారూ! ఏదో విచారంగా కనబడుతున్నారు?" పలకరించింది పిశాచం.

పేదవాడు తన కథంతా చెప్పాడు. "ఇంక ఈ రోజు నుంచి ఎలా బతకాలో తెలియడం లేదు" అని వాపోయాడు. ఆ పిశాచం అన్నది "చూడు అన్నయ్యా! ఈ ఆవుని మూడు సంవత్సరాలు నీ దగ్గరే అట్టే పెట్టుకో. ప్రతిరోజూ ఈ ఆవు మీకిద్దరికీ కావలసినన్ని పాలు ఇస్తుంది. నీకు-నీ భార్యకు ఆకలి బాధ ఉండదు.

అయితే ఒక షరతుంది. మూడు సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానాలు ఇవ్వగలిగావా, ఈ ఆవు నీదే. సరైన సమాధానాలు ఇవ్వలేకపోతే మటుకు ఆవునీ, దానితో బాటూ మిమ్మల్నిద్దర్నీ కూడా- తీసుకుపోతాను! ఆలోచించి, ఏమాటా చెప్పు!" అంది.

"ఆకలితో మాడే కంటే ఆవుని తీసుకోవడమే మంచిది కదా" అనుకున్న పేదవాడు 'సరే' అన్నాడు. పిశాచం షరతుకు ఒప్పుకొని, ఆవుని తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఆవు సహాయంతో పేదవాడు, అతని భార్యా ఆకలి బాధ తెలీకుండా సుఖంగా బ్రతికారు. మూడు సంవత్సరాలు ఇట్టే గడచిపోయాయి. పిశాచం ఇచ్చిన గడువు దగ్గర పడింది.

దానికి గడువు సంగతి గుర్తుంటుందా, ఉండదా, అది ఏం ప్రశ్నలడుగుతుంది, ఏం జవాబులివ్వాలి, అది తమని తినేస్తే ఎలాగ- అని గుబులు మొదలైంది ఇద్దరికీ. పిశాచం ఇచ్చిన గడువు ఇంక రేపు ముగుస్తుందనగా ఆ రోజు సాయంత్రం ఓ చక్కని అందమైన యువకుడు వాళ్ల దగ్గరకు వచ్చాడు. "నేను చాలా అలసిపోయి ఉన్నాను- చీకటి పడుతోంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండటానికి అనుమతివ్వండి, ప్లీజ్" అని అడుగుతూ.

"మాకేమీ అభ్యంతరం లేదు బాబూ! కానీ నీకే ఇబ్బంది అవుతుందేమోనని ఆలోచిస్తున్నాం. మూడేళ్లకు ముందు మేం ఒక పిశాచం దగ్గర ఓ ఆవును తీసుకున్నాం. ఇన్నాళ్లపాటు ఆ ఆవు చలవన సుఖంగా జీవించాం. అయితే ఆవుని ఇచ్చిననాడే పిశాచం కొన్ని షరతులు పెట్టింది- మూడేళ్ల తర్వాత వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నది. ప్రశ్నలకు సమాధానం చెబితే ఆవు మాదేనట! చెప్పలేకపోతే ఆవుతో పాటు మమ్మల్నికూడా తీసుకెళ్తుందట అది!" చెప్పారు అతనికి.

యువకుడు నవ్వాడు- "అంతేకదా! ఈ పూటకు నన్ను మీతోబాటు ఉండనివ్వండి. పిశాచం అడిగే ప్రశ్నలకు వీలైతే నేనే సమాధానం ఇస్తాను" అన్నాడు ధైర్యంగా.

సరిగ్గా అర్థరాత్రి అయ్యే సరికి పిశాచం వచ్చి తలుపు తట్టింది- "మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం కావాలి" అంది.

"నీ ప్రశ్నలేవో అడుగు- సమాధానం చెబుతాను" అన్నాడు కొత్తగా వచ్చిన యువకుడు. పిశాచం కొత్త గొంతు విని- "నువ్వెక్కడ నుంచి వచ్చావు?" అంది.

"సముద్రంలోంచి" అన్నాడు యువకుడు.

"ఇక్కడికెలా వచ్చావు?" అంది పిశాచం.

"ఎట్లా వచ్చాననుకుంటివి, ఈగ నెక్కి!" అన్నాడు యువకుడు నవ్వుతూ.

"అయితే సముద్రం అంత చిన్నదా?"

"అంత చిన్నదేం కాదు, డేగ కూడా దాన్ని ఈ పక్కనుంచి ఆ పక్కకి ఎగరలేదు" అన్నాడు యువకుడు.

"ఓహొ- డేగదేమున్నది, ఏమీ చేతగాని పిట్ట!" అన్నది పిశాచం.

"అదేం మాట. ఎంత మాత్రం కాదు. దాని రెక్కల నీడ ఒక మహానగరాన్ని కప్పేస్తుంటే, అదేం చిన్న?" అన్నాడు యువకుడు.

"బొమ్మ పట్టణాలు చాలా చిన్నగా కూడా ఉంటైలే" అన్నది పిశాచం.

"అహాఁ అట్లాంటిదేమీ కాదు. పట్టణంలో ఆ మూలనుండి ఈ మూలకు పరుగెత్తాలంటే కుందేలు చేతనవుతుందేమి, వీలే కాదు"

"చిట్టి చిట్టి బొమ్మ కుందేలు ఏం పరుగు పెడుతుందిలే" అంది పిశాచం తీసి పడెస్తున్నట్లు.

"ఏం చిన్నది తల్లీ! దాని చర్మం ఓ ఇంటి కిటికీకి, దాని బొచ్చు ఒక మనిషి టోపీకి సరిపోతుంది!" అన్నాడు యువకుడు గట్టిగా.

"ఆ మనిషి ఏ మరుగుజ్జువాడో అయి ఉండాలిలే. ఎంత శబ్దమైనా వాడి చెవుల్లో పడదు కాబోలు"

"అట్లా ఏం కాదు. ఎక్కడో పర్వతాల్లో లేడి గడ్డి కొరికితే, ఆ శబ్దం కూడా అతనికి వినబడుతుంది" ఇంక పిశాచానికి ఏం అడగాలో తోచలేదు. తలుపు దగ్గరే కొంత సేపు నిశ్శబ్దంగా నిల్చొని, చివరికి ఒక్కసారిగా మాయమైపోయింది. పేదవాడు, అతని భార్య చాలా సంతోషించారు.

ఇంక కొద్ది సేపట్లో తెల్లవారుతుందనగా ఆ యువకుడు పేద దంపతుల దగ్గర సెలవుతీసుకుంటూ "అయ్యా! నేనెవరో గుర్తుపట్టలేదు కదా, ఆ రోజు మీరు జాలిపడి నదిలో పారేసిన మాట్లాడే చేపను నేనే. మీ రుణం నాకు ఇవాళ్ల ఇట్లా తీరింది- సుఖంగా ఉండండి" అన్నాడు.

పేదవాడు ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే ఆ యువకుడు కాస్తా అదృశ్యమయ్యాడు!