వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు భాస్కర్. అమ్మమ్మ పేరు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ, వాళ్ళ పక్కింటి ప్రమీలమ్మ మంచి స్నేహితులు. రోజూ ఒక కూరలబండి అతను వాళ్ల ఇంటిముందు ఆగి పిలిచేవాడు. వీళ్ళిద్దరూ క్రమం తప్పకుండా రోజూ అతని దగ్గరే కూరలు కొనేవాళ్ళు. ఆ కూరలమ్మే అతను ఎంత మంచివాడో, అతను అమ్మే కూరలు ఎంత బాగుంటాయో, అతని దగ్గర కూరగాయల ధరలు ఎంత తక్కువో రోజంతా అందరికీ చెప్తుండేవాళ్ళు వీళ్ళు.

అయితే ఈసారి భాస్కర్ వచ్చేసరికి అమ్మమ్మ, ఈశ్వరమ్మ కొంచెం మారినట్లు అనిపించారు-కూరలతని గురించి ఎక్కువ మాట్లాడలేదు. భాస్కర్ తనే కల్పించుకొని అడిగితే "ఒరేయ్ భాస్కర్, ఆ రోజు ఏమి జరిగిందో తెలుసా?" అంది అమ్మమ్మ. "ఏరోజు, ఏమి జరగడం అమ్మమ్మా?" అడిగాడు భాస్కర్.

"అయ్యో! నీకు తెలియదా, ఇదిగో చెప్తాను- రెండు నెలల కిందట నేను, మన ప్రమీలమ్మ మామ్మ కూరల వాడి కోసమే ఎదురు చూస్తున్నాము గదా, చూడగా చూడగా ఆఖరికి అతను వచ్చాడు. కూరలు కొనేశాక చూస్తే ప్రమీలమ్మ మామ్మ డబ్బులు తెచ్చుకోలేదు. సరేనని డబ్బు కోసం ఆవిడ, నేను ఇద్దరము లోపలికి వెళ్ళాం.." ఆపింది అమ్మమ్మ. అమ్మకు ఇట్లా ఆపి ఆపి కథలు చెప్పటం అంటే ఇష్టం.

"మరేమైంది అప్పుడు?" అడిగాడు భాస్కర్.

"ఏముంది, నేను డబ్బు పట్టుకొని బయటికి వెళ్ళానా, ఆసరికి ప్రమీలమ్మ గారు అక్కడే నిలబడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు! నేను అడిగాను- 'ఏమి అయింది, కూరలవాడేడి?" అని.

"డబ్బులకోసం నేను ఇంట్లోకి వెళ్ళాను గదండి; ఇంట్లో కొంత చిల్లర, ఒక 500రూ. నోటు దొరికాయి. దానితో నా కూరలు, మీకూరలు కూడా కొనేశాను" అన్నారావిడ.

"మరి ఇక్కడ బాధగా నిలబడ్డారెందుకు?" అడిగాను. "అయ్యో, అదే కదా చెబుతున్నది?! చిల్లరతో బాటు ఐదు వందల రూపాయల నోటును కూడా వాడి చేతికి ఇచ్చాను. మళ్ళీ చూసుకునేసరికి కూరగాయల వాడు లేడు- ఎటు పోయాడో పోయాడు- మిగిలిన డబ్బులు ఇవ్వనే లేదు!" అన్నారావిడ.

"అయ్యో! మరి ఏం చేశారింక?" అడిగాడు భాస్కర్.

"నాలుగు రోజుల తర్వాత ఆ కూరలతను వచ్చాడు- ఈసారి అతని వెంట అతని కొడుకు, పదేళ్లవాడు- వాడు కూడా వచ్చాడు. అప్పుడు మేము నోటు గురించి అడిగాం. ఆ కూరలతను ఏమన్నాడో‌ తెలుసా?- 'ఏ నోటు గురించి మాట్లాడుతున్నారమ్మా?' అని అడిగాడు!

ప్రమీలమ్మగారి ముఖం‌ తెలవెలపోయింది. "అదేనయ్యా, పోయిన సారి వచ్చినప్పుడు ఈ ప్రమీలమ్మగారు ఇచ్చిన నోటు!" అన్నాను నేను-

"అయ్యో, నాకు ఎక్కడ ఇచ్చారమ్మా?! చిల్లర తెచ్చి ఇచ్చారు; నేను దాన్ని తీసుకొని ముందుకు పోయాను. అయినా నా దగ్గర ఐదు వందలకు చిల్లర ఎక్కడుంటుందమ్మా, ఎవరు కొన్నా పదివో పదైదువో కూరగాయలు కొంటారు- నా దగ్గర అంతలేసి నోటుకు చిల్లర ఉంటుందా?' అనేశాడు అతను!"

"మర్చిపోయి ఉంటాడు అమ్మమ్మా!" అన్నాడు భాస్కర్.

"ఏం మరపో- తిరిగీ తిరిగీ ఇదంతా ప్రమీలమ్మ మీదికి వచ్చింది. ఆవిడ ఒకటే బాధ పడటం- తర్వాత ఏమైందో తెలుసా?" "ఏమైంది?"

"మేం అట్లా ఊరికే నిల్చుండిపోయాం. కూరలతను సందుదాటి వెళ్ళిపోయేవరకూ అతన్నే చూస్తూ.

కొద్ది సేపటికి ఆ కూరలతని కొడుకు ఒక్కడే వెనక్కి వచ్చాడు- మెల్లటి గొంతుతో చెప్పాడు- 'మామ్మగారూ, నాలుగు రోజుల క్రిందట నా పుట్టిన రోజు అయ్యిందండి- ఆ రోజున, ఎన్నడూ లేనిది, మా నాన్న నాకు ఒక ఐదువందల రూపాయలు బహుమతిగా ఇచ్చాడండి. నేనూ, మా అమ్మా ఇద్దరం ఆశ్చర్యపోయామండి. మా అమ్మ దాన్ని భద్రంగా తీసి పెట్టిందండి- అది మీరు ఇచ్చిన నోటే అయి ఉంటుంది. నేను మా అమ్మకు చెప్పి, రేపు ఈ వేళకల్లా దాన్ని తెచ్చి ఇస్తానండి- మీరు కంగారు పడద్దు' అని.

అన్నట్టే మరునాడు ఐదువందల నోటు తెచ్చి ఇచ్చాడు ఆ పిల్లవాడు!" అన్నది అమ్మమ్మ.

"వావ్! భలేవాడు దొరికాడే" ఆ పిల్లవాడి నిజాయితీని మెచ్చుకున్నాడు భాస్కర్.

"వాడి పేరు సురేష్. ఇప్పుడు తెలుసా, రోజూ వాడు మన దగ్గర ట్యూషన్‌కి వస్తాడు. వాడిని చూశాకే, నేనూ, ప్రమీలమ్మా ఈ ట్యూషన్ సెంటర్ మొదలెట్టింది. రోజూ సాయంత్రం ఎవరు వస్తే వాళ్లకి ఉచితంగా పాఠాలు చెబుతున్నాం ఇప్పుడు!" అన్నది అమ్మమ్మ.

-నిజంగా చూస్తే మంచితనం వల్ల నష్టమేమీ రాదు! పైపెచ్చు ఆ మంచితనం అంటుకొని మరి కొందరు మంచివాళ్ళు అవ్వచ్చు!