కోతి మాటలు విని మొసలి తత్తరపాటుతో 'నీ చెల్లెలికి ఆరోగ్యం కొంచెం సరిగా లేదు' అన్నది.

"అయ్యో! అంత చిన్న సమస్యకేనా, నీ ముఖం ఇంత చిన్నబోయింది?! చిన్న చిన్న సమస్యలకే చిన్నబోవటం, అదే మంత శౌర్యం?!" అన్నది కోతి తేలికగా.

"వ్యాధి కొంచెం పెద్దదే" అన్నది క్రకచం, ఒకింత సందేహిస్తూ.

కోతి విచారంగా "వైద్యుల్ని పిలిపించలేదా? మొదట్లోనే మంచి ఔషధాలు వాడలేదా?!" అన్నది. తన స్నేహితుడి భార్యకు ఆరోగ్యం బాగా లేదనే సరికి దాని కళ్లలో నీళ్లు తిరిగాయి.

"ఏమి మాయరోగమో తెలియలేదు. ఎంతమంది వైద్యులు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మేలుకాలేదు. నేను నిన్న ఇక్కడి నుండి వెళ్లేసరికి నీ చెల్లెలు యమయాతన పడుతున్నది. 'దీని నుండి బ్రతికి బట్టకట్టటమే కష్టం' అనిపిస్తున్నది" అని బదులు చెప్పింది క్రకచం, మొసలి కన్నీళ్లు కారుస్తూ.

అది విని కోతి-"అయ్యో! స్నేహితుడా! నీది ఎంత వెర్రి? ఇంట్లో భార్య చావు బ్రతుకుల్లో ఉంటే, ఆమెకు ఏ మందో-మాకో ఇప్పించటానికి బదులు, తనను ఒంటరిగా విడిచిపెట్టి స్నేహితుడి దగ్గరికి ఎట్లా రాబుద్ధయింది నీకు? ఇంట్లో అంత గంభీర స్థితిని ఉంచుకొనికూడా నన్ను విందుకు పిలిచేందుకు నీకు నోరెట్లావచ్చింది?" అని మందలించింది.

"గొప్ప వైద్యుల్ని సంప్రతించాం. వాళ్ళు 'ఈ సమస్య పెద్దదే. దీనికి కోతి గుండెతో చేసిన మందు ఇవ్వాలి" అని చెప్పారు. ఇప్పటికిప్పుడు కోతిగుండె తెమ్మంటే నేనెట్లా తెచ్చేది? నువ్వు గుర్తుకొచ్చావు. అందుకనే నేను ఇంత హడావిడిగా ఇటు రావలసి వచ్చింది"-అని తన గుట్టును బయటపెట్టేసింది- కంగారులోనూ, దు:ఖంలోనూ మతి తప్పిన క్రకచం!

ఆ మాటలువినగానే కోతి ప్రాణాలు డిబడిబలాడాయి. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఏమనాలో, ఏం చెయ్యాలో తెలీనట్లు అది ఒక్క క్షణం నిశ్చేష్టం అయిపోయింది.

అంతలోనే తేరుకొని, మనసులోని కలవరాన్ని ఆణచుకొని, గుండెను గట్టి చేసుకొని, ఒక క్షణం పాటు మనసులో అనుకున్నది- "అయ్యో! బట్ట తల వాడెవడో ఎండ వేడికి ఓపలేక తాటిచెట్టు నీడన కూర్చుంటే తాటి పండొచ్చి పడి తల పగిలిందట! అట్లాగ, దైవం అనుకూలించని వాడు ఎక్కడికి పోయినా ఆపదలు వెంటవస్తాయి గదా!

అడవిని విడిచిపెట్టి మృగసంచారం ఏ మాత్రం లేని సముద్రతీరాన్ని చేరుకున్నానే, అయినా రాక రాక మృత్యువు నోట్లోకే చేరుకున్నట్లయింది!" అని బాధపడుతూనే, మరొక ప్రక్కన లేని నిబ్బరాన్ని ప్రదర్శిస్తూ తటాలున-" అయ్యో! క్రకచా! ఎంత పిచ్చి పనిచేశావు?! కోతి గుండె కోసం వచ్చిన వాడివి, ఆ మాటని కొంచెం నీ స్నేహితుడి చెవిలో వేయాలని కూడా తోచలేదా, నీకు?!

ఎప్పుడూ నేనుండే ఆ మేడి చెట్టుకు తగిలించి ఉంచుతాను కదా నా గుండెను?! నీ మనసులో ఉన్నదాన్ని స్నేహితుడికి చెప్పకుండా దాచి ఉంచటం వల్ల, ఇప్పుడు చూడు- పని పూర్తిగా చెడింది! ఇంత చేసిన నువ్వు నీ భార్యకు మేలు కోరేదటుంచు, గొప్ప కీడు చేసిన శత్రువువే అవుతున్నావు! మన మధ్య ఇంతవరకు నడిచినదంతా వృధా త్రిప్పటే అయ్యింది చూడు! అయితే మాత్రం మించిపోయింది ఏమున్నదిలే, వెంటనే వెనక్కి తిరిగి మేడి చెట్టు దగ్గరికి పద- గుండెకాయను తీసుకొద్దాం!" అనేసింది.

అంత ధైర్యంగా అనేసరికి మొసలికి ఇక ఆలోచించాల్సిన అవసరం పడలేదు! ఆ మాయమాటల్ని నమ్మేసి, అది తటాలున వెనక్కితిరిగింది- కోతిని మేడిచెట్టు దగ్గరికి తీసుకొచ్చి విడిచింది.

చెట్టు దగ్గరకు రాగానే అబ్బ! ప్రాణాలు దక్కాయి!" అని ఆకోతి చటుక్కున మేడిని ఎక్కేసింది! చెట్టెక్కి ఊపిరి పీల్చుకొని, దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని, ఆ తర్వాత తనకోసం ఎదురు చూస్తూ ఇంకా నీళ్లలోనే నిలబడిన మొసలిని వెక్కిరిస్తూ - "గుండె లేదు, గిండె లేదు పో, పోరా!" అని గద్దించింది.

అది చూసి నివ్వెర పోయిన మొసలి జరిగిన మోసాన్ని తెలుసుకొని- "అయ్యో! ఏ పాపమూ ఎరుగని నన్ను యీ ముసలికోతి ఎట్లా మోసం చేసిందో చూడు!" అని ఇంకొన్ని కన్నీళ్లు కార్చింది.

అప్పుడు కోతి అది మరింత సిగ్గుపడేటట్లు "నువ్వు అతి మర్యాదగా మాట్లాడి, నొసటన దోసిలి పెట్టుకొని,'మా ఇంటికి రావల్సిందే' అని దేవురించటం వల్ల, యీ దరిద్రపు మొహమాటం ఒకటి ఏడ్చింది కాబట్టి, నా నోటితో నేను 'కాదు' అనలేక, ఒకసారి మోసపోయానే అనుకో- అయినా నన్ను ఇంకోసారి వంచించటం నీ తరమౌతుందా, ఓరి పిచ్చివాడా? చెప్పిన మాట విను! 'వచ్చి నా వలలో అలవోకగా చిక్కుకున్న వాడే మళ్లీ తప్పించుకుపోయాడే!' అని ఊరికే ఏడుస్తూ కూర్చోకు. నీదారిన నువ్వు పో. నక్క అంతటిది ఆనాడు ఒక చిన్న తాబేలు చేత మోసపోయింది కద! ఇంక నువ్వెంత?- నీకాకథ తెలుసోలేదో-విను!" అని తాబేలు-నక్క కథ వివరించసాగింది.

తాబేలు-నక్క:

కర్ణాటక దేశంలో 'కావేరి' అనే నది ఒకటి ప్రవహిస్తుంటుంది. అది సముద్రంలో కలిసే చోటుకు దగ్గరగా, ఆ నదీ తీరంలోనే- పెద్ద మర్రి చెట్టొకటి ఉన్నది. ఒకనాడు మధ్యాహ్నం సమయంలో తాబేలు ఒకటి నదిలోంచి బయటికి వచ్చి, ఆ చెట్టు నీడలో పడుకొన్నది.

వెచ్చగా, సుఖంగా ఉందేమో, త్వరలోనే అది గాఢ నిద్రలోకి జారుకున్నది. సరిగ్గా ఆ సమయానికి, అక్కడికి దగ్గర్లోని అడవిలో నివసించే నక్క ఒకటి, అక్కడికి వచ్చింది. బాగా దప్పికగొని ఉన్న ఆ నక్క ముందుగా నదిలోకి పోయి, తియ్యటి నదీ జలాన్ని ఇష్టంగా త్రాగింది.

ఆ పైన గానీ అది అటూ ఇటూ చూడలేదు-చూస్తే దానికి కొంచెం దూరంలోనే చెట్టు కింద పడుకొని ఉన్న తాబేలు కనిపించింది. తాబేలును చూసేసరికి నక్కకు చాలా సంతోషం వేసింది. మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయి, ఏమరుపాటుగా ఉన్న తాబేలు వీపు మీద చటుక్కున కాలు మోపి, అదిమి నిలబడ్డది.

అంత బరువు తన మీదకి అకస్మాత్తుగా వచ్చి పడేసరికి, తాబేలు తటాలున తలను, కాళ్లు చేతుల్నీ కడుపులోకి లాక్కొని, ముడుచుకొని- కదలకుండా కూర్చున్నది.

ఆకలిగొని ఉన్న నక్క తాబేలును కాళ్లతో అదిమి, అటూ ఇటూ పొర్లించి, గోర్లతో గీరి, కొరికి-ఏంచేసినా ఆ తాబేలు చిప్పను మాత్రం ఛేదించలేకపోయింది. అట్లా అని దాన్ని విడిచిపెట్టి పోయేందుకూ మనసు రాక, అది క్రింద మీద పడుతూ ఉన్నది.

అది అట్లా తంటాలు పడుతూంటే ముడుచుకొని కూర్చున్న తాబేలు తన మనసులో "లాభం లేదు- ఏదో ఒక విధంగా ఈ తిక్క నక్కను మోసగించి తప్పించుకోవాల్సిందే" అనుకొని, కొంచెం ఆలోచించి, బయటికి నక్కతో ఇట్లా అన్నది- "ఓ నక్కగారూ!

అసలు తత్త్వం ఏంటో తెలుసుకోకుండా ఇట్లా ఎందుకు, వృధాగా అవస్థపడతారు? మీరు ఈ విధంగా వెయ్యేళ్ల పాటు కొరికినా, నా ఒళ్లు మీకు కొరుకుడు పడదు గదా! అయినా 'మీరు పంతం పట్టి ఉన్నారు; ఎట్లా అయినా తంటాలు పడతారు- గానీ నన్ను మాత్రం వదలరు" అని నాకు అర్థం అయ్యింది. బ్రతకాలన్న ఆశ నశించింది. 'అనాయాసంగా మరణించటం మేలు' అన్న నిశ్చయానికి వచ్చేశాను. నీళ్లలోని బ్రతుకు మాది. 'చావు' అన్నది ఎప్పుడూ మా ముందే కోరలు చాపి నాట్యమాడుతూంటుంది. నువ్వు చూడగా ఆకలిగొన్న మహానుభావుడివి- అందుకని నీకు ఒక చక్కని ఉపాయం చెబుతాను, విను. నన్ను నేరుగా తీసుకొని పోయి, కొద్ది సేపు నీటిలో ఉంచి, నానబెట్టు. ఒక నిముషంలో నా శరీరం అంతా నీకు నచ్చినట్లు వెన్నలాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు కడుపారా నా మాంసంతో భోజనం చేసుకొని తిని, నీకెటు పోవాలనిపిస్తే అటు పోవచ్చు- అట్లా చెయ్యి!" అన్నది.

ఆ వెర్రినక్క దాని మాటలు నిజమనుకున్నది. 'అట్లాగే చేద్దాం' అనుకొని తాబేలును తీసుకెళ్ళి నీళ్ళలో పడేసి కూడా, కొంత మెలకువ కలిగి పట్టుమాత్రం విడవకుండా తన ముందుకాళ్ళు దాని వీపుమీద మోపి కూర్చున్నది. అటుపైన మాటిమాటికి గుటకలు మ్రింగుతూ, తన కాళ్ళ క్రింద ఉన్న తాబేలు మీదే చూపులు నిలుపుకొని, మళ్ళీ మళ్ళీ దాన్ని కొరికి చూస్తూ వచ్చింది. ఎంత సేపటికీ తాబేలు చిప్ప మెత్తబడకపోయే సరికి చికాకు పడుతూ తాబేలుతో "ఎంత సేపైంది! నిన్ను నీళ్ళలో వేసి, నీ ఒళ్ళు మెత్తబడ్డాక తొందర తొందరగా తిని పోదామని ఎంత సేపటినుండి కాచుకొని ఉన్నానో చూస్తున్నావు కదా?! ఎంతసేపటికీ నీ ఒళ్ళు నానే అవకాశం కనిపించటం లేదు. ఎందుకంటావు?” అని అడిగింది.

అప్పుడు తాబేలు దానితో "నేనేం చెప్పేది మిత్రమా?! నా మాట మీద నీకు నమ్మకం లేదు. 'ఎక్కడ పారిపోతానో' అన్నట్లు నా వెన్ను మీద రెండు కాళ్ళూ దిట్టంగా పెట్టి కూర్చున్నావు. నా శరీరానికి నీళ్ళు ఏమాత్రం కూడా అంటే వీలు లేకుండా నా వీపునంతా ఆక్రమించుకొని నువ్వు నీ పెద్ద పెద్ద కాళ్ళు మోపాక, ఇక నా ఒళ్ళు నానమంటే ఏం నానుతుంది, నీ కోరిక తీరమంటే ఏం తీరుతుంది?

ఇదిగో చెబుతున్నాను- ఇందులో నా తప్పు వీసమంత కూడా లేదు. నీ శని కొద్దీ నువ్వే, నీ అపనమ్మకంతో ఇంత సేపు చెడ్డావు. అయినా ఇప్పుడు ఏమైందని, ఇంత చికాకు పడుతున్నావు? ఇప్పుడైనా నా మాట విను. నన్ను నమ్మి, నా వీపుమీదినుండి పాదాలను తీసేసి, కొంచెంసేపు నాకు దగ్గరగా కూర్చొని చూస్తూ ఉండు. క్షణంలో నా ఒళ్ళు నానుతుంది; కలకండ ముక్కల్లాంటి నా మాసపు ముక్కల్ని చకచకా తిని సంతోషంగా‌ ఇంటికి పోదువు” అన్నది తాబేలు.

ప్రాణాలమీద తీపికొద్దీ తాబేలు పలికిన ఆ తీపి పలుకుల్ని పూర్తిగా విశ్వసించింది, ఆకలితో నకనకలాడుతున్న నక్క. తాబేలు వెన్నుమీద బలంగా మోపి ఉన్న పాదాల బరువును మెల్లగా సడలించింది. బరువు అటు తగ్గిందో లేదో, ఇటు జర్రున శరవేగంతో జారి లోతు నీళ్ళలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నది తాబేలు.”

కోతి మొసలికి ఆ కథ చెప్పి, “ఓ నీచపు మొసలీ! మోసకారులకే మోసకారి అయిన నక్కే తాబేలు చేతిలో అంతలా మోసపోయిందే, ఇక పుట్టుకతోటే చూపు సరిగా ఆననిదానివి, నువ్వు నా వల్ల మోసపోవటంలో ఆశ్చర్యం ఏమున్నది? చాలు చాలు. నీతో స్నేహం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది. ఇంక నీ స్నేహాన్ని నీ దగ్గరే ఉంచుకో- (...అని ఇంకా ఏం చెప్పిందో మళ్ళీ చూద్దాం!)