లీల బలే తెలివైన అమ్మాయి. చాలా ధైర్యం కలది కూడా. వాళ్ల ఇల్లు అడవికి ఒక ప్రక్కన ఉంది. వాళ్ల బడేమో, అడవికి అటు ప్రక్కన ఉంది. అడవిలో చాలా జంతువులున్నై; ఒక పులి కూడా ఉంది!

ఒకసారి లీల బడి నుండి ఇంటికి వస్తుంటే అకస్మాత్తుగా ఆ పులి ఆమెను అడ్డగించింది-

"ఊరికే పుస్తకాలు మోసుకొని వెళ్లటం కాదు! నిజంగా తెలివి ఉందో, లేదో నిరూపించుకో, నేను నీకో కథ చెబుతాను; కథ చివర్లో ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సరైన జవాబు చెబితే ఇంటికి వెళ్తావు - లేదంటే నా నోట్లోకి! చెప్పు, సరేనా?" అంది పులి కోరలు చాచి.

లీలకు అస్సలు భయం వెయ్యలేదు. కథ అనే సరికి ఇంకా చాలా ఉత్సాహం వచ్చింది కూడా. "ఓ! అంత మాత్రానికి భయ పడతానా, చెప్పు కథ!" అని తొందరపెట్టింది పులిని. అప్పుడు పులి ఇట్లా చెప్పసాగింది-

కొత్తపల్లిలో నివసించే కోటయ్య చాలా పేదవాడు. అయితేనేమి, చాలా మంచివాడు. రోజూ ఏ కూలి పని దొరికితే ఆ కూలి పనికి వెళ్లేవాడతను, అతనికి ఉన్న ఒకే ఒక ఆస్తి ఒక గొర్రె. తను ఎక్కడి కెళ్తే అక్కడికి దాన్ని కూడా తీసుకెళ్లే వాడతను.

ఒకసారి అతనికి ఏదో పొలానికి గ‌ట్లువేసే పని ఒకటి దొరికింది. తన గొర్రెను దాపులనే ఉన్న కొండ మీదికి వదిలి, అతను తన పనిని పూర్తి చేసాడు. సాయంత్రం అవుతుండగా గొర్రె కోసం కొండ ఎక్కిన కోటయ్యకు, ఆ గడ్డి తుప్పల్లోనే పడి మెరుస్తూన్న రాయి ఒకటి కనబడింది. అతను దాన్ని చేతిలోకి తీసుకొని "భలే మెరుస్తోంది, యీ రాయి?! దీన్ని నా గొర్రె మెడలో కట్టనా, అందంగా ఉంటుంది?!" అనుకున్నాడు.

"ఓ, తప్పకుండా కట్టు! నీకు మేలు జరుగుతుందిలే" అని ఎక్కడి నుండో వినబడింది.

కోటయ్య రాయిని గబుక్కున నేల మీద పడేసి అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ లేరు.

"నేనేలే, మాట్లాడుతోంది! నీకేమీ కాదు. నన్ను తీసుకెళ్లి నీ గొర్రె మెడలో కట్టు!" అన్నది మెరిసే రాయి. కోటయ్య దాన్ని గొర్రె మెడలో కట్టాడు. ఆ తర్వాత అతను కొంతకాలం పాటు తను ధనికుడై పోయినట్లు కలలు కన్నాడు. కానీ అట్లా ఏమీ కాలేదు. కోటయ్య కోటయ్య లాగే ఉన్నాడు; గొర్రె గొర్రె లాగానే ఉన్నది. ఆ తర్వాత అతను దాన్ని గురించి పూర్తిగా మరచే పోయాడు.

కొన్నాళ్లకి, వ్యాపారి ఒకడు అటుగా పోతూ కోటయ్యని, అతని గొర్రెని చూశాడు. గొర్రె మెడలో ఉన్నది 'వెల కట్టలేని వజ్రం' అని తెలుస్తూనే ఉన్నదతనికి- కానీ యీ కోటయ్యకే ఆ సంగతి తెలిసినట్లు లేదు.

అతను బండిని ఆపి, కోటయ్యతో "ఏమయ్యా, గొర్రెని ఎంతకి అమ్ముతావు?" అని అడిగాడు.

"ఐదు వేల రూపాయలండయ్యా!" అన్నాడు కోటయ్య. గొర్రె ధర అంతే ఉంటుంది. మరి! వ్యాపారి అతనితో బేరమాడి గొర్రెను నాలుగువేల ఎనిమిది వందల రూపాయలకు కొనేశాడు.

తీరా అతను దాన్ని తీసుకెళ్లి గొర్రె మెడలోంచి వజ్రాన్ని తీశాడో, లేదో - ఆ వజ్రం ఠపాలున నల్లగా మాడిపోయింది! ఇప్పుడిక దాన్ని సానబెట్టి కూడా ఏమీ ప్రయోజనం‌ ఉండదు!

కొంతసేపు ఆలోచించిన వ్యాపారి వెంటనే వెనక్కి వెళ్లి, కోటయ్యను వెతికి పట్టుకొని, 'నీ గొర్రె మెడలో ఉన్నది అద్భుతమైన వజ్రం' అని చెప్పి, అతను వద్దన్నా వినకుండా పదిలక్షల రూపాయలు అతని చేతిలో పెట్టి వచ్చాడు. చిత్రం-అతను వెనక్కి వచ్చి చూస్తే వజ్రం ధగధగా మెరుస్తోంది!"

పులి యీ కథ చెప్పి, లీలని అడిగింది - "లీలా! ఇప్పుడు చెప్పు! వజ్రం ఎందుకు నల్లగా మాడిపోయింది? వ్యాపారి మనసెందుకు మారింది? వజ్రం మళ్ళీ ఎందుకు మెరిసింది?" అని.

" 'ఆ వజ్రం మహిమ గలది' అని తెలుస్తూనే ఉన్నది. దాని విలువ ఎంతో తెలీని కోటయ్య ఇష్టంగా దాన్ని తన గొర్రె మెడలో వేసినంత మాత్రాన అది చాలా సంతోషపడ్డది. అయితే వ్యాపారికి దాని అసలు విలువ ఎంతో తెలుసు, అయినా అతను దానికి ఏ మాత్రం విలువలేనట్లు ప్రవర్తించి, గొర్రెకు మాత్రం వెల చెల్లించాడు. ఆత్మ గౌరవం ఉన్న వజ్రం యీ అవమానాన్ని భరించలేక, నల్లగా మాడిపోయింది. వ్యాపారి యీ సంగతిని గుర్తించాడు గనకనే తన తప్పును దిద్దుకునేందుకు ప్రయత్నించాడు. వజ్రానికి తగిన గౌరవం లభించింది; దాంతో ఇప్పుడది మళ్లీ మెరిసింది" అన్నది లీల.

"అబ్బో, చాలా సరిగ్గా చెప్పావు! నువ్వు తెలివైన దానివే! యీ సారికి నిన్ను వదిలేస్తున్నాను- అయితే తిరిగి ఎన్నడూ ఇటు రాకు!" అని లీలను విడిచిపెట్టి వెనక్కి తిరిగింది పులి.