మగధ రాజ్యాన్ని మహేంద్రవర్మ మహారాజు పరిపాలించే రోజులవి. రాజుగారి పాలనలో నెలకు మూడు వానలు కురిసేవి. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు. ఎటొచ్చీ మహారాజుకు ఒకటే బాధ. ఆయనకు సంతానం లేదు. రాజుగారు అనేక పుణ్యతీర్ధాలూ, క్షేత్రాలూ దర్శించిన తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరో చెప్పారు- "రాజా! నీకు త్వరలో ఒక కుమార్తె పుడుతుంది. ఆమె తెలివితేటలకు మారుపేరు అవుతుంది. నీకు నిజమైన వారసురాలు అవుతుంది కూడా. అయితే యౌవనంలో గర్విష్ఠి అయి, తన గర్వానికి తగిన ఫలితం అనుభవిస్తుంది. ఆ అనుభవం ఆమెను మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది" అని.
ఆ తర్వాత నిజంగానే రాణిగారు గర్భం ధరించారు. తర్వాత వాళ్లకొక చక్కని పాప పుట్టింది. యువరాణికి ఇందుమతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు రాజదంపతులు. ఇందుమతి తెలివితేటలు అద్భుతమే. గురువులు ఎవరు ఏది చెబితే దాన్ని అవలీలగా అర్థం చేసుకోగలిగేది ఆ పాప. అయితేనేమి, ఆమె ప్రవర్తన దురుసుగానూ, అహంకార పూరితంగాను ఉండేది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఆమెను సరిదిద్దలేక-పోయారు.
యువరాణి యుక్తవయస్సులో ఉండగా ఒకసారి ఆమె గురువుగారి దగ్గరికి బయలుదేరింది. ఆ సమయంలో ఆమె దాసీల్లో ఒకతె, ఆమెకు అడ్డు వచ్చింది. బరువైన వస్తువును దేన్నో మోసుకుపోతూ, యువరాణికి తను అడ్డం వచ్చిన సంగతిని కూడా గుర్తించలేదామె. ఇందుమతి ఆమె మీద నిప్పులు చెరిగింది. ఆ ముసలామె తనను క్షమించమని ఎంత ప్రార్థించినా ఇందుమతి వినలేదు. ఆమెను బయటికి లాక్కెళ్ళి దగ్గర్లోనే ఉన్న పొదల్లో పడేసింది. ఆ సమయానికి అక్కడే ఉన్న పాము ఒకటి చటుక్కున ముసలామెను కాటు వేసి పోయింది!
ముసలావిడ పాపం, పాము కాటుకు నురగలు క్రక్కుతూ పడిపోతే చుట్టూ ఉన్నవాళ్ళ గుండెలు కరిగిపోయాయి. కానీ కఠినత్వం మూర్తీభవించిన ఇందుమతి ఆమెకు వైద్య సహాయం కూడా అందకుండా చేసింది! కొద్ది సేపట్లోనే ముసలామె చనిపోయింది. సభికులందరూ ఎవరికి వారు యువరాణి ప్రవర్తనను అసహ్యించుకున్నారు. అంతలోనే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. వాళ్లందరూ చూస్తుండగానే ఇందుమతి రూపం మారిపోయింది! అంత సుందరమైన ఆమె రూపం అత్యంత సాధారణమైన పాముగా మారిపోయింది! ఆ పాము జరజరా ప్రాకి ఎక్కడికో పోయింది!
రాణిగారు కుప్పకూలిపోయారు. రాజుగారి దు:ఖానికి మేరలేదు. యువరాణి జాడ తెలుసుకొని, ఆమె కష్టాన్ని తీర్చినవారికి అర్థరాజ్యం‌ ఇస్తానని చాటింపు వేయించి ఆయన దు:ఖ సముద్రంలో మునిగి-పోయారు. ఆ తర్వాత ఎంత వెతికినా యువరాణి ఆచూకీ తెలియలేదు ఎవ్వరికీ.


రవి ఒక రోజున ఇంటిబయట నిలబడి ఉన్నాడు. వానవచ్చేట్లున్నది. గాలి వేగంగా వీస్తున్నది. ఆ సమయంలో రవి వాళ్ల ఇంటి ముందున్న చెట్టుమీద ఒక గ్రద్ద వాలింది. తను తెచ్చుకున్న పామును అది పొడుచుకొని తినటం మొదలు పెట్టింది. అయితే రవికి మటుకు అది పామని తెలియలేదు. ఏదో పక్షి పిల్ల అయి-ఉండొచ్చనుకున్నాడు. జాలి కొద్దీ గ్రద్దను 'ఉష్.. ఉష్' మని తరిమాడు. గ్రద్ద పామును అక్కడే పడేసి ఎగిరిపోయింది.
రాముకి ఎందుకనో దాన్ని చూస్తే జాలి అనిపించింది. గ్రద్దలు సాధారణంగా తమకు దొరికిన ఆహారాన్ని ఓ పట్టాన వదిలి పెట్టవు. ఇప్పుడు ఇది గ్రద్ద నోట్లోంచైతే బయట పడింది గానీ, అట్లాగే వదిలేస్తే చీమలకు బలి అవుతుంది.
అందుకని వాడు ఆ పాముని కట్టెతోటే ఎత్తి ఓ బక్కెట్లో వేసి, నీళ్ళతో కడిగి, తమ ఇంటి వసారాలో నిలువుగా పడుకోబెట్టి ఆరనిచ్చాడు. "పాముకి పాలు పోయ-కూడదు" అని విని ఉన్నాడు గనక, తాను జాగ్రత్తగానే ఉంటూ, దూరంనుండే దాని చుట్టూతా చీమలు రాకుండా మందు చల్లి ఉంచాడు. దానికైన గాయాలకు తన దగ్గరున్న మందు చుక్కలు వేశాడు. దూరంగానే ఉంటూ గమనించుకున్నాడు.
రాము వాళ్ల అమ్మ-నాన్న-అవ్వ అందరూ వాడి దయను మెచ్చుకున్నారు గానీ, ఎవరికి వాళ్ళు 'పాములు ప్రమాదకారులొరే-దాన్ని ఎక్కడైనా అడవిలో వదిలెయ్యి' అని చెబుతూ వచ్చారు. అట్లా మూడు రోజులు గడిచాక, అకస్మాత్తుగా ఆ పాము యువరాణి ఇందుమతిగా మారింది!
ఆశ్చర్యపోయిన గ్రామవాసులకు ఆమె తన కథనంతా వివరించి, రవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ "నీ మంచితనం నా పాపాన్ని కడిగేసింది. గర్వంతో కళ్ళు మూసుకొనిపోయి, నిండు మానవ ప్రాణాన్ని పాముకు బలిచేశాను నేను. విషపు పురుగు అని అసహ్యించుకోకుండా పాము మీదే జాలిని కురిపించావు నువ్వు.
నీ దయవల్లే నా రూపం నాకు తిరిగి వచ్చింది. నా అహంకారం నశించింది. ఇకమీద నేను అందరితోటీ మర్యాదగా ప్రవర్తిస్తాను. నువ్వు చూపిన దారిలో నడిచి నేనూ 'మంచి మనిషి' అనిపించుకుంటాను" అన్నది.

మంచి హృదయం సంపాదించుకొని తిరిగివచ్చిన బిడ్డను చూసి రాజు-రాణి ఎంతో సంతోషించారు. అన్నమాట ప్రకారం రవికి అర్థరాజ్యమూ, అనేక బహుమతులూ ఇచ్చి తమ కొడుకులాగా ఆదరించారు.