అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పేద్ద వేప చెట్టు. దాని మీద ఒక కోతి జంట కాపురం ఉంది.
ఒకరోజు మగ కోతి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకు దూకుతుండగా కోసుగా ఉండే కొమ్మ ఒకటి దాని కాలికి తగిలి, పాదం చీలమండ దగ్గర గీసుకుపోయింది. ఆ రోజు అది ఆ గాయం గురించి ఏమీ పట్టించుకోలేదు. మర్నాటికి గాయం సలపసాగింది.
"అబ్బ! అమ్మ!" అని మూలుగుతూ అది గద్ద దగ్గరకి వెళ్ళి "గద్ద మామా! గద్ద మామా! కాలికి గాయం అయింది. కొంచెం చూడవా!" అంది.
గద్ద గాయాన్ని తన ముక్కుతో అటూ ఇటూ కెలికి ఏదో ఆకుని కట్టింది.
మర్నాడు కోతికి నొప్పి ఎక్కువయింది.
'అబ్బే! ఈ గద్ద లాభం లేదు ' అనుకుంటూ అది కొంగ దగ్గరకి వెళ్ళి "కొంగ బావా! కొంగ బావా! కాలికి గాయం అయింది. కొంచెం చూడవా" అంది.

కొంగ తన పొడవైన ముక్కుతో గాయాన్ని లోపలకి బాగా కెలికి, వేరే ఏదో ఆకు తెచ్చి కట్టింది.
మర్నాడు పాపం కోతికి గాయం పెద్దదయిపోయింది. భరించలేనంత నొప్పి పుట్టింది.
ఈసారి అది మంత్రాలు వేసే గబ్బిలం దగ్గరకి వెళ్ళింది. గబ్బిలం గాయాన్ని చూసి - "ఏవో దిష్టి నీళ్ళు తొక్కినట్లున్నావు. నీ కాలికి దయ్యం పట్టింది. ఇప్పుడెట్లా?! ఊరికే ఉండక ప్రాణం మీదికి తెచ్చుకుంటావు ఇలాగ!" అంటూ ఏవో మంత్రాలు చదివి గాయం పైన నీళ్ళు చల్లింది. ఇంత దుమ్ము తీసుకుని 'ధూం! ధూం!' అంటూ ఆ తడి గాయం పైన చల్లి, "ఇక దయ్యం వదిలింది ఫో!" అంది.
అయినా మర్నాడు ఇక కోతి లేవలేకపోయింది. కాలుని కదిలిస్తే చాలు- గాయం విపరీతంగా నొప్పి. కానీ ఊరికే ఉండలేదు కదా, అందుకని అది అలాగే కాలుని ఈడ్చుకుంటూ ఈ సారి నక్క దగ్గరకి వెళ్ళింది.
ఆ సరికి గాయం బాగా చీము పట్టి ఉంది. నక్క ఆ గాయాన్ని చూసి "ఇది దయ్యం అని ఎవరన్నారు?! దయ్యం కానే కాదు - ఇది రాక్షసి. దీన్ని నేను వదిలిస్తాను. చూడు- నా తడాఖా!" అంటూ వేపాకు మండలు తీసుకుని గాయం పైన బాదడం మొదలు పెట్టింది. కోతి కింద పడిపోయి "కుయ్యో! మొర్రో! అంటూ అరుస్తున్నా నక్క వినిపించుకోలేదు.

ఈ గోలంతా విని ఏనుగు వచ్చింది అక్కడికి. దానికి కూడా వైద్యంలో కొంత ప్రవేశం ఉన్నది. అది వచ్చి "ఇది రాక్షసి కాదు - బ్రహ్మరాక్షసి. నా కాలుతో దీన్ని నలిపి పారేస్తాను ఆగు" అంటూ కోతి పాదం పైన తన కాలు మోపబోయింది!
కోతి "వామ్మో!" అని అరుస్తూ తటాలున పక్కకు దొర్లి, కుంటుకుంటూ, మూలుక్కుంటూ ఇంటికి పరిగెత్తింది.
కోతి భార్య కోతిని బాగా తిట్టి డాక్టర్ చిలుక దగ్గరకి తీసుకెళ్ళింది.
అంతా విన్న డాక్టర్ చిలుక నవ్వుతూ "కోతి పుండును బ్రహ్మరాక్షసి చేశారన్నమాట!" అంటూ గాయాన్ని శుభ్రం చేసి కట్టు కట్టింది.
పాపం కోతి. ముందే డాక్టర్ దగ్గరకి వెళ్ళినట్లయితే పుండు రెండు రోజుల్లో తగ్గి ఉండేది. ఇప్పుడు బ్రహ్మరాక్షసి తగ్గడానికి నెల రోజులు పట్టింది!