ఇంటర్నెట్లో సమాచారం అందరికీ అందాలని, రహస్యాలంటూ ఉండకూడదని, వ్యాపారం కోసం కాకుండా ఇంటర్నెట్ ప్రపంచ జనులందరికీ మేలు చేసే సాంకేతిక వ్యవస్థగా ఎదగాలని పోరాడిన స్వతంత్ర ప్రేమి ఆరన్ స్వాట్జ్ ఈ మాసపు యువకెరటం. ఆరన్ వాళ్ళ నాన్నకు అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉండేది. అలా అతనికి చిన్ననాటినుండే కంప్యూటర్ల గురించిన పరిజ్ఞానమూ, ఆసక్తీ కలిగాయి. వాళ్ల నాన్న ప్రభావంతో పదేళ్ళ వయస్సులోనే వెబ్సైట్లు తయారు చేయటం మొదలెట్టాడతను. అయితే ఈ వెబ్సైట్లలో ప్రకటనలు ఉండేవి కావు. వ్యాపారాత్మకంగా అస్సలు ఉండేవి కావవి. అంతేకాక, ప్రపంచంలో ఎక్కడినుండైనా ఈ సైట్లను ఒకరికంటే ఎక్కువమంది కలిపి నడిపించేందుకు వీలుగా ఉండేవి. అలా కేవలం ఉపయోగకరంగాను, విజ్ఞాన దాయకాలుగాను ఉండే చాలా వెబ్సైట్లని తయారు చేశాడు ఆరన్.
క్రమంగా అతని దృష్టి ఇలాంటి వెబ్సైట్లని నిర్మించటం వెనక ఉన్న సాంకేతిక చట్రాలమీద పడింది. దాంతోపాటు ఒకరుకాకుండా- అనేకమంది- ఒక సమూహంగా- సాఫ్టువేర్లను తయారు చేసేందుకు అవసరమైన వ్యవస్థల ఏర్పాటు కూడా అతన్ని ఆకర్షించింది. ఒక వెబ్సైటులోని సమాచారం మరొక వెబ్సైటులో ప్రతిఫలించేట్లు చేసే "ఫీడ్" కు సంబంధించిన అంతర్జాతీయ సాంకేతిక కమిటీల్లో పధ్నాలుగేళ్లకే ఆరన్‌కు స్థానం లభించింది.
మీలో చాలామంది "హెచ్టీయమ్మెల్" గురించి విని ఉంటారు కదా, దాని ఆధారంగానే మరో కంప్యూటర్ భావన 'మార్క్‌డౌన్' ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు ఆరన్. అదే సమయంలో 'పైథాన్' అనే మరో కంప్యూటర్ భాషను ఇంటర్నెట్‌కు ఉపయోగపడే విధంగా మలచేందుకు అవసరమయ్యే 'వెబ్ పై ఫ్రేంవర్కు' నియమాల సముదాయాన్ని స్థిరీకరించటంలో ప్రముఖపాత్ర పోషించాడు. ఇదంతా తనకు పదిహేడేళ్ళప్పుడు!
విజ్ఞానానికి సంబంధించిన అంశాన్ని దేన్నైనా కనుగొన్నప్పుడు ఆయా సంస్థలు దాన్ని తమ సొంతంగా భావించి డబ్బు చేసుకోవటాన్ని ఆరన్ తీవ్రంగా నిరసించాడు. 'విజ్ఞానం అందరిదీ-అందరికీ' అని నమ్మిన ఆరన్ ఇంటర్నెట్ ఆర్కైవ్ సంస్థ వారి 'ఓపెన్ లైబ్రరీ ప్రాజెక్టు' ద్వారా ప్రపంచంలోని అన్ని పుస్తకాలనూ కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి అందరికీ ఉచితంగా అందించే ప్రక్రియలో పాలుపంచుకున్నాడు.

ఇంటర్నెట్‌ను సాంకేతికంగా బలోపేతం చేయటంతో మొదలైన ఆరన్‌ ప్రస్థానం త్వరలోనే మరో మలుపు తిరిగింది. అభివృద్ధి చెందిన దేశాలు ఇంటర్నెట్‌ను తమ స్వార్థానికి వినియోగించుకోవటం, వ్యాపార శక్తులు ఇంటర్నెట్‌ను జనుల క్షేమంకోసం కాకుండా తమ లాభాలకోసం నియంత్రించటం దగ్గరగా గమనించిన ఆరన్ వాటికి వ్యతిరేకంగా గొంతెత్తాడు. ఇంటర్నెట్ పైరసీని నియంత్రించే పేరుతో అనేక వెబ్సైటులను మూసివేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తే, దాన్ని నిరసిస్తూ ఉద్యమం నడిపాడు ఆరన్. ఆ ఉద్యమం ఫలితంగా 'సోపా' చట్టం ఆదిలోనే వీగిపోయింది. అయితే ఆ క్రమంలో ఆరన్‌పై 'ప్రభుత్వ వ్యతిరేకి' ముద్ర వేసిన అమెరికా ప్రభుత్వం తర్వాతి కాలంలో అతనిపై 'సమాచారాన్ని దొంగిలించటం'తో సహా లెక్కలేనన్ని ఆరోపణలు చేసింది.
విజ్ఞానం అందరికీ అని విశ్వసించే అనేకమందికి స్ఫూర్తి నిచ్చి, సమాచార సాంకేతిక వ్యవస్థలో స్వాతంత్యం కోసం పోరాడిన ఆరన్ స్వార్జ్‌ 27 ఏళ్ళ వయస్సులోనే, 2013లో మరణించాడు.