సుబ్బయ్యశెట్టికి మంగాపురంలో పెద్ద సరుకుల దుకాణం ఉంది. ఆ ఊళ్ళో అదే పెద్ద అంగడి. చాలా ఏళ్ళ నుంచి ఉన్నది కూడా అదే. అయితే ఈ మధ్య ఆ ఊళ్ళో కొత్త కొత్త అంగళ్ళు చాలా వెలవడంతో సుబ్బయ్యశెట్టి వ్యాపారం కాస్త తగ్గు ముఖం పట్టింది.

ఆ ఊళ్ళోనే ఉండే సంగీతం మాస్టారు రామశాస్త్రి, ఏదో కొనాలని సుబ్బయ్యశెట్టి కొట్టుకు వచ్చాడు ఒకరోజున- అప్పుడే పిల్లలకు తరగతిలో చెప్పిన పాటను పాడుకుంటూ. శెట్టికి ఆ పాట చాలా నచ్చింది. "భలే ఉంది సార్, పాట! ఏదీ పాడండి, మరోసారి!" అన్నాడు.

ఆ రోజెందుకో ఉత్సాహంగా ఉన్న రామశాస్త్రి పాటలు అందుకున్నాడు. వచ్చే పోయే జనం ఆ పాటలు విని సుబ్బయ్య శెట్టి కొట్టు దగ్గర ఆగారు. ఎలాగూ కొట్టుదాకా వచ్చాం కదా అని ఎవరికి వాళ్ళు తమకు కావలసిన వస్తువులు ఒకటో రెండో కొనుక్కుని వెళ్ళారు. ఆ రోజు సుబ్బయ్య శెట్టికి బేరం బాగా జరిగింది.

ఇదేదో బాగుందనుకున్న శెట్టికి ఒక ఉపాయం తోచింది: 'రామశాస్త్రి దగ్గర తన భార్యకి సంగీతం నేర్పిస్తే..?! తను రోజూ కొట్లో కూర్చుని పాడుతుంది; జనం వినడానికి వస్తారు; బేరం జరుగుతుంది!'

అయితే శెట్టి భార్య సుబ్బలక్ష్మికి సంగీతం‌ అంటే ఇష్టమూ లేదు; తన గొంతుమీద తనకి నమ్మకమూ లేదు. అయినా భర్త పోరు పెట్టేసరికి "సరేలెండి. అయినా ముందు నాకు సంగీతం నేర్పించడానికి ఆ రామశాస్త్రిని ఒప్పించండి మరి" అనేసింది. 'ఆయన ఒప్పుకోకపోతే ఆ సంగీతం నేర్చుకునే బాధ తప్పుతుంది కదా' అనుకుంటూ.

భార్యకి సంగీతం నేర్పించమని రామశాస్త్రిని అడిగాడు శెట్టి. "నాకెలా కుదురుతుందీ? పిల్లలకి నేర్పించడానికే సమయం లేదు!" అన్నాడు రామశాస్త్రి.

"బాబ్బాబు! మీకు ఎక్కువ ఫీజు ఇచ్చుకుంటాను. ఎలాగైనా ఇంటికొచ్చి సంగీతం నేర్పించండి" అన్నాడు శెట్టి- "సంగీతం నేర్పించేటపుడు కూడా అందరూ వినడానికి వస్తారుకదా, అట్లా కూడా బేరం జరుగుతుంది కదా!” అని మనసులోనే లెక్కలు వేసుకుంటూ .

ఎక్కువ ఫీజు అనేటప్పటికి రామశాస్త్రి ఒప్పుకున్నాడు. పాఠం మొదలుపెట్టిన రోజే ఆయనకు పరిస్థితి అర్థం అయింది - 'సుబ్బలక్ష్మికి బొత్తిగా సంగీత జ్ఞానమూ లేదు; నేర్చుకుందామన్న ఇష్టమూ లేదు' అని. అయినా ఫీజు పోగొట్టుకోవడం ఇష్టం లేక "సాధన చేయాలమ్మా! ఇంకా సాధన చేయాలి" అంటూ ఒక్కో పాఠాన్ని చెప్పసాగాడాయన.

ఆ పాఠాలు ఊరికే పోలేదు. "సరిగమా" అని అరుస్తూ, కూతలు వేస్తూ, అపస్వరాలతో ఘోరంగా సాధన చేస్తున్న సుబ్బలక్ష్మి గొంతు వింటూనే పారిపోవటం‌ మొదలుపెట్టారు జనం.

మామూలుగా వచ్చే ఒకటి రెండు బేరాలు కూడా రావడం మానేశాయి శెట్టికి.

మరి ఆమె గొంతు స్థాయి కూడా కొంచెం ఎక్కువేనేమో, శెట్టికి చెవులు దిబ్బెడ పడటం మొదలయింది.

ఇక భరించలేని శెట్టి రామశాస్త్రిని పిలిచి, నెల జీతం పూర్తిగా ఇచ్చి, పంపించేశాడు.

సాధన చేసుకుంటున్న భార్య దగ్గరికి పళ్ళు గిట్ట కరుచుకుని వచ్చి "ఆపవేయ్! ఆపు. నీ సంగీతం వల్ల నా బేరసారాలు ఉడిగాయి; నా చెవులు దిబ్బలు పడ్డాయి" అని మండిపడ్డాడు.

సంగీతపు రుచి తెలిసిన సుబ్బలక్ష్మి తన పాటని ఇక ఆపలేదు- భర్త మాటలను పట్టించుకోకుండా 'సరిగమపా' అనటం మొదలు పెట్టింది!

లబోదిబోమన్నాడు శెట్టి.