అనగా అనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎప్పుడూ అడవి అంతా తిరుగుతూ అన్ని విషయాలల్లోనూ తల దూరుస్తూ ఉండేది.

ఒకరోజున అది ఎప్పటి లాగే అడవిలో తిరుగుతూ తిరుగుతూ- ఒక రాళ్ళ గుట్టను చూసింది. ఆ రాళ్ళ గుట్ట కిందుగా తాడులాంటిదేదో బయటికి వచ్చి ఉన్నది. కుందేలుకు దాన్ని చూస్తే ఒక రాతి బండీ- దానికి కట్టిన తాడూ గుర్తుకొచ్చాయి. "తాడును పట్టుకొని లాగితే ఎంచక్కా బండి ఇవతలకి వస్తుంది!” అని దాన్ని లాగేందుకు ప్రయత్నించింది అది. అయినా ఆ తాడు ఏమాత్రం కదలలేదు! "వేరే ఎవరైనా సాయం వస్తారేమో, చూద్దాం" అని అడవిలోకి పరిగెత్తింది కుందేలు. కొంచెం దూరం వెళ్ళే సరికి దానికి ఒక పులి కనిపించింది:

"పులీ! పులీ! నేను ఒక బండిని చూశాను. ఒక్కదాన్నే లాగలేకపోతున్నాను. కాస్త సాయం చేస్తావా, ప్లీజ్!?" అడిగింది కుందేలు.
పులి కొంచెం‌ ఆలోచించింది. "సరే పద" అంటూ కుందేలుతో కలిసి రాళ్ళ గుట్ట దగ్గరకి వచ్చిందది. గుట్ట క్రిందుగా బయటికి వచ్చిన తాడును పట్టుకుని శక్తి కొద్దీ‌ లాగింది పులి. అయినా తాడు బయటికి రా లేదు. "ఊహు! కదలడం లేదు. నువ్వెళ్ళి ఇంకెవరినన్నా పిలుచుకురా" అన్నదది చివరికి.

కుందేలు మళ్ళీ అడవిలోకి పరిగెత్తింది. ఎదురుగా వస్తున్న నక్కని ఆపి "నక్కా! నక్కా! నేను ఒక బండిని చూశాను. దాన్ని నేనూ, పులీ ఇద్దరమూ లాగలేకపోతున్నాము. కొంచెం సాయం వస్తావా?! " అని అడిగింది.

"సరే పద" అంటూ కుందేలుతో కలిసి రాళ్ళ గుట్ట దగ్గరకి వచ్చింది నక్క. తాడుని పులి-పులి తోకని నక్క- రెండూ‌ బలం కొద్దీ లాగాయి. ఉహు.. తాడు కదలనే లేదు!

"కదలడం లేదమ్మా కుందేలూ! నువ్వెళ్ళి ఇంకొకరిని ఎవరినైనా పిలుచుకురారాదూ?" అంది నక్క, ఆయాసంతో‌ వగరుస్తూ. కుందేలు మళ్ళీ అడవిలోకి పరిగెత్తింది. ఎక్కువ దూరం పోకనే దానికి చెట్టుపైన గెంతుతున్న కోతి ఒకటి కనిపించింది.

"కోతీ! కోతీ! నాకు చక్కని వాహనం ఒకటి కనబడ్డది- రాళ్ళ గుట్ట క్రింద. నేను ఒక్కదాన్నీ బయటకి లాగలేక, పులిని సాయానికి పిలిచాను. పులి కూడా లాగలేకపోతే నక్క సాయం వచ్చింది. అయినా ఆ వాహనం బయటకి రావడం లేదు. నువ్వు కూడా వచ్చి సాయం చేయరాదూ, ప్లీజ్!" అని అడిగింది కుందేలు.

"వాహనమా! భలే భలే. ఎందుకు సాయం చేయనూ? పనేమీ లేక ఇందాకటి నుంచీ ఊరికే అటూ ఇటూ గెంతులేస్తున్నాను. పద పద" అంది కోతి గెంతుతూ.

అట్లా కోతి వెళ్ళి నక్క తోకని పట్టుకున్నది. మూడూ ఎంతలాగినా తాడు మాత్రం కదల్లేదు.

"ఊ..ఉహు! కదలడం లేదు. నువ్వెళ్ళి ఇంకోళ్ళని వెంటబెట్టుకురా" అన్నదది కుందేలుతో.

కుందేలు మళ్ళీ అడవిలోకి పరిగెత్తింది. ఈసారి అది నేరుగా ఎలుగుబంటు గుహ దగ్గరకి వెళ్ళి విషయం చెప్పింది.

"సరే పద" అంటూ ఎలుగుబంటు వచ్చి కోతి తోకని పట్టుకుని లాగింది. ఆ దెబ్బకి రాళ్ళ గుట్టలో నుండి ఇవతలకి ఒక్కసారిగా ఏదో దబ్బున పడింది.

తీరా చూస్తే అది ఒక ఏనుగు!

అది కోపంగా అన్ని జంతువులను చూస్తూ "ఎవరు, నా తోకని లాగింది?!" అంది.

అన్నీ కుందేలు వైపు చూశాయి. ఇక అక్కడుంటే ప్రాణాలు పోతాయనుకున్న కుందేలు "క్షమించండి. నేను మీ తోకని చూసి రాతి వాహనానికి కట్టిన తాడు అనుకున్నాను" అన్నది, పరుగు లంకించుకుంటూ.

బిత్తరపోయిన ఏనుగును అలాగే వదిలేసి కుందేలు వెనకే పరుగుతీసాయి, దానికి సాయం వచ్చిన జంతువులన్నీ!!