ఆ విధంగా కోటను మొత్తాన్నీ కాల్చి తనకు గెలుపు కూర్చిన మేఘవర్ణుడిని నెమలిరాజు అనేక విధాలుగా మెచ్చుకుని, సన్మానించింది. అటుపైన అది సంతోషంగా మంత్రివైపుకు తిరిగి "పనిని పూర్తి చేసి గెలుపు సాధించిన సేవకుడి పని ఊరికేపోదు. అతనికి అన్ని విధాలా మేలుకూర్చే ప్రతిఫలం ఒకటి తప్పనిసరిగా కలుగుతుంది. ఇప్పుడు మనకు ఈ మేఘవర్ణుడు చేసిన మేలూ అంతే. ఇతనినే ఆ కర్పూర ద్వీప రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాను" అన్నది. -

ధవళాంగుడు ఇంతవరకూ చెప్పి ఆపగానే చిన్నబోయి, పరధ్యానంతో తన ఓటమిని గురించిన ఆలోచనలో పడిపోయిన హంసరాజుని చక్రవాక మంత్రి తిరిగి ఈ లోకంలోకి తెస్తూ "ప్రభూ! ఈ వార్తాహరుడేదో ముఖ్యమైన సమాచారాన్నే తెచ్చినట్లున్నాడు. ఇంకా పూర్తిగా చెప్పినట్లు లేదు. తమరు పరాకును వదిలి అతని మాటల్ని శ్రద్ధగా వినాలి" అన్నది.

ఆ మాటలకు తేరుకున్న హంసరాజు కొంగవైపు చూసి "ఓ ధవళాంగా! మేం వింటూనే ఉన్నాం. ఏదీ?! తర్వాత ఏంజరిగిందో వివరించు" అన్నది.

అప్పుడు ఆ సమాచారాన్ని మోసుకొచ్చిన ధవళాంగుడు ఇట్లా చెప్పింది- "అప్పుడు నెమలిరాజుకు అడ్డు వస్తూ వాళ్ల ప్రధానమంత్రి దూరదర్శి 'తమరి మాటకు అడ్డు చెబుతున్నందుకు నన్ను మన్నించండి. ఇతనికి తమరు మేలు చేయదలిస్తే మరేదైనా విధంగా సత్కరించి పంపటం మంచిదని నాకు అనిపిస్తున్నది. తలపైన పెట్టుకునే మాణిక్యం స్థానంలో పాదుకలను ఉంచరాదు: అదే విధంగా గొప్పవారు ఉండవలసిన స్థానాల్లో తక్కువవారిని ఎప్పుడూ నిలపకూడదు. అల్పుడిని పైకి తెచ్చి గొప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉంచిన రాజు కాళ్లకు వేసుకోవల్సిన చెప్పులు నెత్తిన పెట్టుకుని మోసేవాడిలాగా నవ్వులపాలు అవుతాడు. లోకంలో తమకు తెలియనిది ఏమున్నది? గౌరవించినా, అవమానించినా ఒకే విధంగా సేవిస్తూ ఉండటం అల్పుల నైజం. తలకు ఎక్కించుకున్నా, కాలితో తొక్కినా కూడా నాగుపాము వేసేది కాటే కదా?!

నిజానికి, అల్పబుద్ధి గలవానికి గొప్ప పదవిని అంటగడితే ఒకప్పుడు మేలు చేసిన వాళ్లకే కీడు తలపెడతాడు. గతంలో నాగుపాము ఒకటి వర్తకుడిచేత ప్రాణభిక్ష పొంది కూడా తిరిగి అతనినే కాటువేయ బూనలేదా? తమరికి ఆ కథ చెబుతాను. శ్రద్ధగా వినండి: పాము- నక్క- వ్యాపారి

హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక దట్టమైన అడవిలో, ఒక కాలిబాట వెంబడి నడుస్తూ పోతున్నాడు ఒక వ్యాపారి. ఆ సమయంలో ఆ అడవిలో దావానలం మొదలైంది. మంటలు అడవిని నలువైపులనుండీ చుట్టుముట్టాయి.

వ్యాపారి నడుస్తున్న కాలిబాటకు దగ్గరలోనే ఎండిపోయిన చెట్లు అధికంగా ఉన్న ఒక చోటున ఆ మంటలు దట్టంగా క్రమ్ముకున్నాయి. అలా ఆకాశం అంటేట్లు ఎగిసిన జ్వాలలలో చిక్కుకొని, ఎలా తప్పించుకోవాలో, ఎటుపోవాలో తెలియక కొట్టుమిట్టాడింది ఒక నల్లత్రాచు.

ఆ సమయంలోదానికి దేవునిమల్లే కనబడ్డాడు వ్యాపారి. అది పెద్ద గొంతుతో "ఓ మహాత్మా! ఆర్తులను కాపాడే ధార్మికోత్తమా! ఈ అడవిని నలువంకలా చుట్టుముట్టి దహిస్తున్న ఈ భయంకర దావానలంలో చిక్కి నా బోటి అల్పజీవి ప్రాణాలు కోల్పోవలసిందేనా? నా పాలిటి దేవుడిలాగా నువ్వు ప్రత్యక్షమైనావు.

శరణు కోరిన వారికోసం ప్రాణాలొడ్డిన శిబి చక్రవర్తి వంటి అద్భుత కారుణ్యమూర్తివి, నిన్ను నా దగ్గరికి ఆ భగవంతుడే పంపి ఉంటాడు. నీ శరణు జొచ్చాను- ఇక నాకేమి కొదవ?! ఆలసించక రా! వచ్చి, నన్ను కాపాడి పో!" అంటూ అనేక విధాలుగా దీనంగా ప్రార్థించింది.

అదెంత కృర జంతువైనా, అంతగా మొరపెట్టుకున్న ఆ పాము దు:ఖాన్ని చూడలేకపోయాడు ఆ బాటసారి. అంతులేని దయతో అతను అటువైపుకి దూకి, పొద లోపల మిలమిలా మెరుస్తూ, చుట్టు చుట్టుకొని, వేడికి తట్టుకోలేక భయంతో ఏడుస్తూ ఉన్న పామును చూసి, తన చేతికర్ర కొసకు సంచిని ఒకదాన్ని వ్రేలాడదీసి, రెండవ కొసను చేతబట్టుకొని, ఉపాయంగా సంచిని పొదలోకి జొనిపాడు.

ఆపదలో ఉన్న ఆ పాము దొరికిన ఆ అధారాన్ని దొరకబుచ్చుకొని గబగబా సంచిలోకి దూరింది. వెంటనే ఆ వ్యాపారి మెల్లగా సంచిని పొదలోంచి బయటికి తీసి, పామును మంటలకు ఆవలగా విడిచిపెట్టాడు.

'మొక్కబోయిన గుడి విరిగి మీద పడింది' అన్నట్లు, అదే క్షణంలో ఆ నల్లత్రాచు బుసకొడుతూ లేచింది! 'పాములు కనబడగానే చంపుతూంటారు మనుషులు. కాబట్టి అట్లాంటి వాళ్లు చేత చిక్కినప్పుడు కాటు వెయ్యకుండా వదలకూడదు మేము!' అంటూ నోరు తెరచి, నాలుక చాపుతూ, అతని మీదికే దూకి, కరవబోయిందా పాము!

ప్రాణభయంతో బాటసారి పరుగు పెట్టటం, పాము వదలక అతని వెంట పడటం మొదలయిందప్పుడే.

అంతలో అక్కడికి దగ్గర్లోనే మరో పొదలో నక్కి ఉన్న నక్క ఒకటి గబుక్కున బయటికి వచ్చి, పాముకు, వ్యాపారికి మధ్య నిలబడి- " ఓ నాగరాజా! ఊరికే ఎందుకు, భయపడి పారిపోతున్న ఈ పిరికివాడి వెంట పడుతున్నావు, నువ్వు?! కొంచెం ఆగి, అసలు సంగతేంటో నాకు చెప్పరాదా, నేనూ నా చేతనైన సహాయం చేస్తాను?!" అన్నది.

ఆ పాము నవ్వుతూ జరిగిన సంగతి అంతా చెప్పగానే నక్క ఆశ్చర్యపోయినట్లు నటిస్తూ "మిత్రమా! నువ్వు ఇప్పుడు చెప్పిన కథ బాగానే ఉన్నదిగానీ, వాస్తవం అనిపించటం లేదు. లేకపోతే, ఇంత చిన్న ఈ సంచీ ఎక్కడ, అంత పెద్ద నీ శరీరం ఏమిటి; ఈ సంచిలోకి దూరటం ఏమిటి?! నువ్వేమో బారెడు పొడుగున్నావు; ఈ సంచి పట్టుమని జానెడంత కూడా లేదు. నేను నమ్మలేను నాయనా" అన్నది.

'కాదు- ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? కావాలంటే చూడు, నేనెట్లా దూరతానో' అని వెర్రి పాము జరజరా ఆ చేతి సంచీలోకి పాకి చుట్ట చుట్టుకొని కూర్చొని చూపింది.

'కట్టెయ్యి కట్టెయ్యి- సంచీ మూతిని చటుక్కున తాడుతో కట్టెయ్యి!" అని నక్క సైగలు చెయ్యగానే, అప్పటివరకూ పెదవులు కొరుక్కుంటూ నిల్చున్న వ్యాపారి గబుక్కున ముందుకు దూకి, సంచీ మూతిని గట్టిగా బిగించి కట్టి, ఆపైన తన చేతి కట్టెతో సంచి మీద బలంగా నాలుగు దెబ్బలు వేసి, పామును పర లోకానికి పంపించాడు. ఆనక నక్క తెలివిని కొనియాడి, తన దారిన తాను పోయాడు.

అలాగ, కొందరు మనుష్యులు తమకు మేలుచేసిన వారికే కీడు తలపెడుతూ ఉంటారు. ఇసుకలో వేసిన బొమ్మ మాదిరి, పిల్లిని మంచిదానిగా జమకట్టి దాన్ని సేవించబోయిన కుందేలు- పింజల పిట్టల కథలో మాదిరి, నీచులకు చేసిన మేలు కూడా ఎక్కువ కాలం నిలువజాలదు. మీకు ఆ కథ చెబుతాను వినండి:

కుందేలు- పిట్ట- పిల్లికథ

వింధ్యారణ్యంలోఒక చెట్టు తొర్రలో చాలా కాలంగా కపింజలం అనే పక్షి ఒకటి నివసిస్తూ ఉండేది. ఒకనాటి సాయంకాలం దట్టమైన మేఘాలు ఆకాశాన్నంతా కమ్ముకున్నాయి. "కడవలను బోర్లించారా' అన్నట్లు, మహా భయంకరమైన జడివాన ఒకటి అడవినంతా ముంచెత్తింది. కపింజలం పాపం ఆ వానలో చిక్కుకున్నది. బాగా తడిసిపోయిన ఆ పక్షి చాలా శ్రమపడ్డది; కానీ సమయానికి తన గూడును చేరుకో లేకపోయింది.

అయితే ఆలోగా దీర్ఘకర్ణం అనే కుందేలు ఒకటి, అది కూడా వానలో బాగా నాని, తల దాచుకునేందుకు తావు వెదుకుతూ, అదృష్టం కొద్దీ కపింజలం నివసించే చెట్టు తొర్రను కనుగొన్నది. చాలా సంతోషంతో అందులోకి దూరి, వెచ్చగా పడుకున్నది.

ఇంతలో కపింజలం తన గూటిని వెతుక్కుంటూ చిమ్మ చీకట్లో వచ్చి చేరుకొని, తన ఇంట్లో ముడుచుకొని పడుకున్న కుందేలును చూసి, అదిలిస్తూ, కోపంగా- "ఓసీ, దొంగ కుందేలూ! నేనులేని సమయం చూసుకొని నా ఇంట్లోకి దూరి, పైగా పడుకొని గురకపెట్టి నిద్రపోతున్నావే! నీకెంత పొగరు?! ఇకనైనా ఆలస్యం చెయ్యక, నా ఇల్లు నాకు విడిచిపెట్టి, లేచి అవతలికి పో! లేకపోతే- చెబుతున్నాను, నీ ప్రాణాలు నీవి కావు!" అని అరిచింది.

దాంతో కోపం వచ్చిన కుందేలు ఎదురు తిరిగి -"చాలు చాలు, నీ బెదిరింపులు ఇంక కట్టిపెట్టు. దీర్ఘకర్ణుడి ముందరా నీ కుప్పిగంతులు?!

దిగుడు బావులు, చేద బావులు, చెట్ల తొర్రలు- వీటిని ఎవరు ముందు ఆక్రమించుకుంటారో, అవి వాళ్లవే అవుతాయి. అంతే తప్ప ఏనాటికీ ప్రత్యేకంగా అవి ఒకరి సొత్తులుకావు. మారు మాట్లాడకు- పో! పో! కాదంటే- ఎవరైనా పెద్దమనుషుల దగ్గరకు పోదామంటే చెప్పు, వస్తాను. న్యాయం ఏమిటో వాళ్లే తేలుస్తారు" అన్నది .
(అప్పుడేమయిందో‌మళ్ళీ చూద్దాం..)