అనగా అనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. అతనికి ఒక ఆవు, ఒక బర్రె ఉండేవి. వాటి పాలు అమ్ముకుంటే వచ్చే డబ్బుతోటే అతని కుటుంబం నడిచేది. అలా మిగిలిన డబ్బులతో వాళ్ళు ఎకరం భూమి కూడా కొనుక్కోగలిగారు.

రామయ్యకు ఊళ్ళో అంతా 'మంచివాడు' అని పేరుండేది. నిజంగా కూడా అతనికి ఎవ్వరినీ‌ మోసం చెయ్యటం తెలీదు. పాలు అమ్మగా వచ్చిన డబ్బులు, పంట డబ్బులతో వాళ్ళు హుందాగా బ్రతకగలిగేవాళ్ళు.

రామయ్యకు చదువుకున్నవాళ్లంటే చాలా నమ్మకం. అతనికి చదువు వచ్చిన దోస్తులు (స్నేహితులు) ఇద్దరు ఉండేవారు. ఈ ఇద్దరు దోస్తులూ 'మీ ఊరికి మంచి నీళ్ళు రప్పిస్తాము; ఊళ్ళోవాళ్లందరినీ అడిగి ఒక్కొక్కళ్ళ దగ్గరా ఇంత డబ్బు ఇప్పించుకో' అని బలవంత పెట్టారు అతన్ని.

నీళ్ళంటే ఎవరికి ఆశ ఉండదు? రామయ్య ఊళ్ళో అందరినీ అడిగి, డబ్బులు తీసుకొచ్చి దోస్తులకు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న దోస్తులిద్దరూ‌ మాయం అయిపోయారు. మళ్ళీ ఎవ్వరికీ కనబడనే లేదు!

బాధ్యత గల రామయ్య తన ఆవును, బర్రెను అమ్మి ఊళ్ళో వాళ్లందరికీ డబ్బులు కట్టాడు. ఆ తర్వాత రామయ్య, లక్ష్మి ఇద్దరూ కైకలికి (కూలికి) పోయి, పొదుపుగా బ్రతికి, అతి కష్టం మీద డబ్బుల్ని కూడబెట్టి, మళ్ళీ ఆవును బర్రెను కొనుక్కో గలిగారు.

'మోసగాళ్లను ఎవ్వరినీ నమ్మకూడదు' అని నిశ్చయం చేసుకొని, అప్పటినుండి ఇద్దరూ హాయిగా బ్రతికారు.