'ఈ శీర్షిక కోసం ఈసారి ఎవర్ని పరిచయం చెయ్యాలా' అని ఆలోచిస్తూ ఉంటే, కొన్నేళ్ళ క్రితం చదివిన పుస్తకం గుర్తు వచ్చింది. దాన్ని రాసిన పిల్లలూ గుర్తుకు వచ్చారు. వాళ్ళ గురించి చెబితే మీకూ ప్రోత్సాహకరంగా ఉంటుంది గదా అనిపించింది-ఆ పుస్తకం పేరు

"అడ్వంచర్స్ ఇన్ అంటార్కిటికా" (అంటార్కిటికాలో సాహసాలు). మీకు 'టీనేజ్' అంటే తెలుసుగా? పదమూడేళ్ళ(థర్టీన్)నుండి పంథొమ్మిదేళ్ళ(నైన్టీన్) మధ్య ఉన్న పిల్లల్ని 'టీనేజర్లు' అంటుంటారు.

అట్లాంటి ఇద్దరు టీనేజ్ పిల్లలు తమ అంటార్కిటికా పర్యటన గురించి రాసిన పుస్తకం అది.

సురవి థామస్, రిషి థామస్ అని ఇద్దరు అక్కా తమ్ముళ్ళు. 2005లో ఒకసారి వీళ్ళకి అనుకోకుండా అంటార్కిటికా ఖండం వెళ్ళే అవకాశం వచ్చింది. మరి అంటార్కిటికా ఖండం అంటే మాటలా? సృష్టిలో కెల్లా అతి చల్లగా ఉండే ప్రాంతం కదా! పేరుకి ఒక ఖండమే అయినా, అక్కడ మనుషులు పెద్దగా ఉండరు- పరిశోధన కోసం వచ్చేవాళ్ళు ఉంటారు అంతే. అసలుకి అక్కడికి వెళ్ళడమే అత్యంత సాహసంతో కూడుకున్నది. అలాంటి చోటుకి వెళ్ళి కొన్నాళ్ళు ఉండివచ్చారు వీళ్ళిద్దరూ!

ఆ ప్రయాణంలోనే కాక, అక్కడ ఉన్న పదిహేను రోజుల్లోనూ ఒళ్ళు గగుర్పొడిచే అనుభవాలు ఎదురయ్యాయి వాళ్లకు. అన్నింటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు వాళ్ళు. అంతే కాదు- ఆ చుట్టుపక్కల ఉన్న ఆసక్తికరమైన విశేషాలనన్నింటినీ- పెంగ్విన్ల వంటి జంతువుల విన్యాసాలలాంటివి- దగ్గరగా చూశారు. తిరిగి వచ్చాక, తమ అనుభవాలన్నిట్నీ వివరిస్తూ ఏకంగా "అడ్వెంచర్స్ ఇన్ అంటార్కటికా" పుస్తకమే రాసేశారు!

ఈ పుస్తకం 2007లో విడుదల అయినప్పుడు అక్క సురవి వయసు పదహారేళ్ళు, తమ్ముడు రిషి వయసు పదమూడు. అంటార్కిటికా ఖండంపై పాదం మోపిన అతి పిన్న వయసు భారతీయులు వీరే. కొన్నాళ్ళ తరువాత ఈ పుస్తకంలో ఒక భాగాన్ని 'సి.బి.ఎస్.ఈ' వారి సిలబస్ తో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకి పాఠ్యాంశంగా కూడా పెట్టారు!

వీళ్ల అమ్మ మన విదేశాంగ శాఖలో పనిచేస్తున్నది. దాంతో వీళ్ళిద్దరికీ రకరకాల దేశాలు చూసే అవకాశం కలిగిందట. ప్రస్తుతం సురవి చదువు పూర్తిచేసుకొని, శాస్త్రవేత్తగా పని చేస్తున్నది. ఇప్పటికీ తను తిరిగే ప్రదేశాల గురించి http://suziventures.blogspot.in అన్న బ్లాగులో వ్యాసాలు రాస్తూ ఉంటుంది తను!

వీళ్ళిద్దరి సంగతులూ చెప్పడం ఎందుకంటే, 'మీరు కూడా మీరు వెళ్ళిన ప్రదేశాల గురించి అప్పుడప్పుడూ చిన్న చిన్న వ్యాసాలు రాయొచ్చు' అని. మనం అందరం దేశాలు తిరుగుతామనీ, అందరు రాసినవీ పుస్తకాలు అయిపోతాయనీ, అన్నీ అంతర్జాతీయ గుర్తింపు పొందుతాయనీ కాదు కానీ, అదొక డైరీలాగా అనమాట. కనీసం మనం వెళ్ళిన ఊర్లలో విశేషాల గురించి తోటి వారితో పంచుకున్నట్లు ఉంటుంది గదా, ఆ వివరాలు రాస్తే!? ఏమంటారు?