హంసరాజు మాటలు విని సేనాని ఇట్లా అనుకున్నది- "ఎంతవాడైనాగానీ చావునుండి తప్పించుకోలేడు. ఏనాటికైనా ఈ శరీరం అనేది మట్టిపాలు కావలసిందే. అస్థిరం అయిన ఈ శరీరం కోసం సుస్థిరం అయిన కీర్తిని కోల్పోయేదెందుకు? 'యజమాని చెప్పిన పనిచేస్తూ చనిపోయినసేవకుడు పుణ్యలోకాలకు వెళ్తాడు' అని పెద్దలు అంటారు. ఈ శరీరం ఎప్పటికైనా పోవలసినదే కదా, దీనిని ఇప్పుడే విడిచేందుకు భయం ఏల? ప్రభువుకోసం ప్రాణత్యాగం చేసి కీర్తినొందెదను గాక . ఏనుగు చెవుల అంచులు అనుక్షణం కదులుతూ ఉండేటట్లు, సంపదలనేవి ఎల్లప్పుడూ చంచలంగా ఉంటాయి. ఇక శరదృతువులో మెరిసే మెరుపులవంటివి ఈ శరీరాలు. ఈ యవ్వనం అనేది నీటి అలల మాదిరి అశాశ్వతమైనదే. నిన్న చూసినవాడు ఇవ్వాళ కానరాడు. మనం ఉన్నా-పోయినా, మన పేరు మాత్రం పోకుండా నిలుస్తుంది.

ఏ రకంగాచూసినా ప్రభువులవారు రక్షణీయులే. 'ప్రభువు, మంత్రి, మిత్రుడు, ధనాగారము, రాజ్యము, కోట, బలం' అనే ఏడు అంగాలలోనూ ముఖ్యమైనవాడు రాజే. మిగిలినవి ఎంత బలంగా ఉన్నప్పటికీ, రాజు అన్నవాడే లేనప్పుడు అవేవీ నిలువవు. దేవ వైద్యుడు ధన్వంతరి కూడా ఆయువు మూడినవాడికి ఏం వైద్యం చేయగలడు? పద్మం సూర్యునిపై ఆధారపడినట్లుగా, లోకమంతా రాజుయొక్క క్షేమము- దీనత్వములను అనుసరించి అభివృద్ధి చెందటమో, నాశనమవ్వటమో జరుగు-తూంటుంది..." అని అది ఇంకా ఏదో అనుకుంటూండగానే చిత్రవర్ణుడి సేనాపతి అయిన తామ్రాచూడుడు తన కోడిపుంజుల సేనతో వాళ్లమీదికి వచ్చి పడింది.
కోడికి, హంసకు అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. వెల్లువలెత్తిన శౌర్యంతో, గెలుపునొందే తలపులతో అవిరెండూ ఘోరంగా పోరాడాయి. రెండూ వెనుకకు జరిగి, మళ్ళీ ముందుకు దూకి, ఎగిరి, కాళ్ళతో శత్రువుని అదరకొట్టినట్లు చరచి, అరుస్తూ పరుగెత్తి వచ్చి, ముక్కును ముక్కుతో పొడిచి, రెక్కలతో మోది, శత్రువు శరీరాన్ని చింపుతూ, వాడి గోళ్లతో శత్రువు ఒంటిని రక్కుతూ, నెత్తురుతో రెండింటి శరీరాలూ ఎర్రబడగా, రెక్కలుగల మహా పర్వతాలమాదిరి, అవి రెండూ ఆకాశానికి ఎగిరినాయి.

వాటి రెక్కలకు అయిన గాయాలనుండి భోరున కారే రక్తం మేఘాలనుండి కురిసే నీటిజల్లుని పోలింది. ఆ విధంగా హంస-కోడి ఒకదానినొకటి లక్ష్యపెట్టక, చాలాసేపు యుద్ధం చేసి, తిరిగి నేలమీదకు దూకి - ఇట్లా వెనుకంజ వేయకుండా కొంతసేపు పోరాడినాయి.
అటుపైన అంతకంతకూ హంసరాజు శక్తి సన్నగిల్లుతూ వచ్చింది. దాన్ని గమనించిన కోడిపుంజుల నాయకుడు, తనది పైచేయి కాగా, మెరుపు మెరిసినట్లు హిరణ్య-గర్భుడిమీదకి దూకి, తన రెక్కలతో హంస తలను గట్టిగా మోదింది. ఆ తాకిడికంటే శత్రువు నవ్విన నవ్వు చిచ్చులాగా హంసరాజు మనసును దహించింది. జూలును పీకినప్పుడు సింహానికి ఎంత కోపం వస్తుందో, ఆ సమయంలో హంసరాజుకు అంత కోపం వచ్చింది.

ఆ కోపంలో అది తన దగ్గరలో ఉన్న శత్రు సైన్యాన్ని కొందరిని తటాలున చంపివేసింది. అంతలో కోడిపుంజు హంసను ఎగిరి తన్నడంతో అది పల్టీలు కొట్టి దిగ్గున సంభాలించుకున్నది. క్రోధంతో దాని కనుబొమలు ముడిపడ్డాయి. తోక రెక్కలు మెలిపడ్డాయి. మెడ సాగింది. వేటుపడ్ద పాము లాగా రొప్పుతూ అది లేచి నిలబడేందుకు ప్రయత్నించింది.

దాన్ని చూసి శత్రుసేనాపతి అయిన వీరవరుడు రోషంతోటీ, క్రోధంతోటీ పరుగున వచ్చి, మెరుపులు మెరిసే చూపులు అతనిపై నిలిపి, మీదికి దూకి, తన ముక్కుతో పొడిచి, గోళ్ళతో రక్కి, కాళ్లతో తన్ని, చివరకు దానిని మట్టి కరిపించింది. ఆ విధంగా కోడికి సహాయంగా దాడిచేసిన వీరవరుడిని చూసి ఆ హంసరాజు భయం ముప్పిరికొనగా ప్రాణాలమీద తీపితో పారిపోయి, నీళ్ళలోకి దూకింది.
ఆ విధంగా తమ యుద్ధం అంతా వృధా అవటాన్నీ, తమ హంసరాజు ఓడిపోవటాన్నీ గమనించిన సారసపక్షి(సేనాపతి) కోపంతో పెచ్చరిల్లింది. శత్రు మూకలన్నీ ఆవేశంగా చుట్టుముట్టినా లెక్కచేయక, ప్రళయ-కాలంలో దారుణ మారణకాండకు కారణమైన యమునిలాగా మహా కోపంతో ఉగ్రమూర్తి అయి అనేక పక్షులను యమపురికి పంపించింది.

చూసినవారంతా మెచ్చుకునేట్లు, ఏటికి ఎదురీదినట్లు అట్లా చిత్రవర్ణుడి సైన్యాన్ని ఎదుర్కొని, వీరవిహారం చేసి, శత్రువులకు చూడ శక్యం కానిదై, రణరంగమంతటా కొవ్వూ-మాంసాలు చెల్లాచెదరుగా పడేటట్లు చేసి, రక్తపుటేరులు పారించింది. ఆ విధంగా, వెన్ను చూపక, యముడు ఆడించే యంత్రపు బొమ్మలవంటి శత్రుమూకలను సింహబలంతో పీనుగులు గావించి, ఎదురులేక సంచరించింది.

ఆ విధంగా చావగా మిగిలిన పక్షుల గుంపులు భయంతో వెనుకకు పారివచ్చి, తన వెనుక దాగటం, అన్ని దిక్కులా తన సైన్య సమూహాలు చచ్చిపడినవీ, చచ్చిన వాటి వలే పడి ఉన్నవీ అవ్వటం చూసి, విచారపడి, నెమలిరాజు తానే స్వయంగా సేనలను పురికొల్పి ముందుండి నడిపించింది.

ఒక్కసారిగా నెమలీ, దాని మంత్రీ బెగ్గురుపక్షి పైకి దూకి, దాని శక్తిని హరించినాయి. చేవ తగ్గినా పౌరుషము తగ్గని ఆ సేనాని ఇంకా వేలాది శత్రువులను సంహరించి, తన శక్తి పూర్తిగా సన్నగిల్లగా, తూగుతూ, అర-కన్నులతో, కొసప్రాణంతో నేలమీద పడి-పోయింది. అప్పుడు ఆ నెమలిరాజు పురివిప్పి వచ్చి, తన రెక్కలతో, కాళ్ళతో వీరవరుడిని మొత్తింది. దాంతో వీరవరుడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయి అది వీర-మరణం చెందింది. చిత్రవర్ణుడు మహదా-నందంతో సింహనాదం చేసింది. ఆ విధంగా చిత్రవర్ణుడు విజయంతో సమకూరిన ఉల్లాసంతో ప్రకాశిస్తూ, శత్రువుల కోటలోకి ప్రవేశించి, రాచనగరునంతటినీ కొల్లగొట్టింది. మనసుల్లో వెల్లివిరిసిన సంతోషం ముఖాలవరకూ ప్రకాశింప చేయగా, సంతోషంతో ఉబ్బినదై "జయ జయ" రావాలు భూమ్యాకాశాలను నింపివేయగా, తన మంత్రులనూ, సైన్యాన్నీ వెంటపెట్టుకొని రోజూ ఆగకుండా ప్రయాణిస్తూ తన రాజధానిని చేరింది. అటుపైన తాను అతి కష్టం మీద సంపాదించుకున్న విజయం సార్ధక-మయ్యేటట్లు, అంతులేని సంతోషంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖంగా ఉన్నది.."

-అని విష్ణు శర్మ పక్షి జాతులకు మధ్య జరిగిన యుద్ధాన్ని ఆసాంతం వివరించి, "యువరాజులారా, యుద్ధం అన్నది ప్రజలందరికీ ప్రళయంతో సమానమైన వినాశనాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి, ఏనాడూ మీకై మీరు యుద్ధానికి కాలు దువ్వకండి. ప్రజలను ఆపదలపాలు చేయక, బాధలకు గురిచెయ్యక, నేర్పుతో పరిపాలన సాగించండి!" అని బోధించాడు.

రాజపుత్రులు ఈ కథ విని, అంతులేని సంతోషంతో విష్ణుశర్మను పలువిధాలుగా కొనియాడారు.

(కందుకూరి వీరేశలింగం రచించిన నీతిచంద్రికలో 'విగ్రహం' అనే నాల్గవ అధ్యాయం ముగిసింది. ఐదవ భాగమయిన 'సంధి' సంగతి మళ్ళీ చూద్దాం..)