ప్రకృతి మనోహరంగా ఉంది. ఆకాశాన్నంటే పర్వతాలు పచ్చగా, బరువుగా ఉన్నాయి. దట్టమైన అడవిలో ఎండ పొడ కానని ప్రాంతాలు ఎన్నో. రంగురంగుల పూలు, సెలయేర్లు, పద్మాలతో నిండిన కొలనులు- వాతావరణం చాలా అందంగా ఉంది. కానీ వూ-చాంగ్ ప్రకృతి సౌందర్యాన్ని చూడటం లేదు. దాంతో అతనికి పనేలేదు. అతను, అతని కొడుకు ఈ కొండల్లో దొరికిన ప్రాణినల్లా వేటాడుతూ గడుపుతారు రోజంతా.

బాణాలు వేయటంలో వూ-చాంగ్‌ని మించినవారు లేరు. అతను ఏనాడూ గురి తప్పలేదు. బాణం వెయ్యాలంటే అసలు అతను గురి చూడవలసిన పనేలేదు. అతను లక్ష్యాన్ని చూసేవాడు; ధనస్సునుండి బాణం వెలువడేది; లక్ష్యాన్ని తగిలేది. అతని శరాలనుండి తప్పించుకొనగలిగినంత చురుకుదనం గానీ, శక్తిగానీ ఏ జంతువుకీ లేదు.

అదుగో! అటుచూడు! చిట్టిజింకపిల్ల! ప్రకృతిలో ఏ ప్రాణీ దానంత ముద్దుగా, అందంగా, అమాయకంగా ఉండి ఉండదు. కానీ, వూ-చాంగ్ వచ్చింది ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి కాదు. అతని కంటికి జింక పిల్ల కనబడిందో లేదో, అతని అమ్ములపొది నుండి ఒక బాణం బయటికి వచ్చింది- జూ...మ్...! అంతే! చిట్టి జింక పిల్ల చచ్చి పడిపోయింది. అప్పుడు చూశాడు వూ- జింకపిల్లకు దగ్గర లోనే ఉంది తల్లి జింక- అది అక్కడే, గడ్డిలో ఉండింది అంతసేపూ. తను ఉన్నచోటు నుండి జింకకు సరైన కోణం కుదరలేదు, అందువల్ల వూ-చాంగ్‌ కొంచెంసేపు వేచి చూశాడు .

పిల్ల జింక క్రింద పడిపోగానే తల్లి జింక గబుక్కున లేచి దాని దగ్గరికి వచ్చింది. ఆత్రంగా దాని గాయాన్ని నాకుతూ, కళ్ళలోంచి నీళ్ళు కార్చింది. దాన్ని ఆ పనిలో నిండా మునగనిచ్చి, చకాలున ఒక బాణం వదిలాడు వూ-చాంగ్. దాంతో తల్లి జింక కూడా చచ్చి పడిపోయింది.

కానీ వూ-కి సంతృప్తి కలగలేదు. అక్కడికి దగ్గరిలోనే, గడ్డిలో మరికొంత కదలిక కనిపించింది అతనికి. ఆ ప్రాంతంలో ఇంకా కొన్ని జింకలు ఉండి ఉంటాయి.. కనీసం ఒకటయితే ఉన్నది... బహుశా రెండు కూడా ఉండచ్చేమో. "రెండు జింకలకంటే మూడు మంచివి" అనుకున్నాడతను. ఆ ఆలోచనకి అతని ముఖంలో సంతోషంతో కూడిన చిరునవ్వు ఒకటి మెదిలింది.

కొంతసేపు అలా నిశ్చలంగా నిలబడ్డాక, గడ్డిలో కదులుతూ అతనికొక నీడ కనిపించింది. ఎండుగడ్డిలో ఏదో జరజరా కదిలింది. అతను ఆ నీడను చూసి బాణం వదిలాడు. మరొక శరీరం దబ్బున నేలరాలింది. ఆర్తనాదం మరొకటి వెలువడింది. కానీ అది జింకల అరుపుకాదు! మనిషి అరుపు!!

వూ-చాంగ్ అక్కడికి పరుగెత్తుకెళ్ళాడు. అతని మూడవ బాణానికి బలయింది నిజంగానే జింక కాదు. అతని కొడుకే! వూ-తోపాటు వేటకు వచ్చిన కొడుకు, ఎలా చేరుకున్నాడో, అక్కడ చచ్చిపడిఉన్నాడు. వూ-చాంగ్ నిశ్చేష్టుడైపోయాడు.

ఏదో స్వరం అతనికి చెప్తున్నట్లు అనిపించింది. "వూ-చాంగ్! ఇప్పుడు అర్థమయ్యిందా, బాణం దెబ్బతో కొడుకు చచ్చి పడి ఉంటే ఎలా ఉంటుందో..?! నువ్వు నీ కొడుకును ఎంత గొప్పగా ప్రేమిస్తావో, జంతువులు కూడా తమ పిల్లల్ని అంతగానూ ప్రేమిస్తాయి. నీ చర్యలతో జంతు తల్లులను, జంతు తండ్రులను నువ్వు ఎంత క్షోభ పెట్టావో...!

ఆ స్వరాన్ని వింటూ గుండె పగిలిన వూ-చాంగ్ నిస్త్రాణుడై అక్కడ నిలబడిపోయాడు. అంతలో అకస్మాత్తుగా అతనికి అర్థమైంది- గడ్డిలో తనకు వినిపించిన ఆ స్వరం తన అంతరాత్మది కాదు- నిజానికది అక్కడే దాక్కొని తన కోసం వేచి చూస్తున్న ఓ పులిది! కానీ అప్పటికే ఆలస్యమైపోయింది...