గ్రీస్ దేశంలో కొత్తగా ఆటల పోటీలు మొదలైన రోజులవి. తర్వాత తర్వాత ఆ ఆటల పోటీలే 'ఒలింపిక్స్' అనే పేరుతో ప్రసిద్ధిగాంచాయి. ఆ రోజుల్లో ఆ పోటీల్లో ఒక ఐదు దేశాలు మటుకు పాల్గొనేవి.

ఆ రోజున సైక్లింగ్ పోటీ ప్రారంభం కానున్నది. సైక్లింగ్‌లో ప్రావీణ్యత ఉన్న ఆటగాళ్ళు విదేశాలనుండి వచ్చి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రక్కన నిర్వాహకులు ఆటల పోటీని మొదలు పెట్టేందుకు సన్నద్ధం అవుతుంటే, మరొక ప్రక్కన వాటిని చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి చేరారు; ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

సైక్లింగ్ పోటీ‌ ప్రారంభం అయింది. మొదటి విడతలో ఎంపిక చేసిన ఆటగాళ్ళు పదిహేను మంది పాల్గొన్నారు. ప్రేక్షకులంతా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ ఆటగాళ్ళకి ఉత్సాహం‌ కలిగించారు. సైక్లింగ్ పోటీలో మధ్యవరసలో ఉన్నాడు, ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ తండ్రి నోమాజ్ గతంలో ఇదే పందెంలో పాల్గొని ఓడిపోయాడు. ఇప్పుడు కొడుకు కూడా అదే అంశంలో పోటీ పడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉన్నది.

సైకిల్ రేస్‌ ప్రారంభం అయ్యింది. క్రీడాకారులు సైకిళ్ళు తొక్కుకుంటూ రివ్వున ముందుకు దూసుకుపోయారు. ఫ్లెమింగ్ మనసులో తండ్రి నోమాజ్ మెదిలాడు..ఆయన ఆశల్ని ఫలింపజేయవలసింది తనే- ఆ ఆలోచన రాగానే ఫ్లెమింగ్ సైకిల్ వేగం పెంచాడు. ఇప్పుడు అతను అందరికంటే ముందున్నాడు. తోటి నక్షత్రాలను అధిగమించి ముందుకు సాగే తోకచుక్క మాదిరి, అతను క్షణాల్లో మిగిలిన వాళ్లకు అందనంత దూరం చేరుకున్నాడు.

మానవ ప్రయత్నానికి ప్రకృతి అన్నివేళలా సహకరించాలని లేదు. మెరుపువేగంతో సాగుతున్న ఫ్లెమింగ్ సైకిలుకు ప్రకృతే అడ్డువచ్చింది- గొర్రెల మంద రూపంలో.

ఆ రోజుల్లో ఇప్పటి మాదిరి సైక్లింగ్ ట్రాకులు ఏవీ ప్రత్యేకంగా ఉండేవి కావు. గ్రామీణ ప్రాంతాల దారుల్నే ఈ పోటీలకోసం కూడా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు అకస్మాత్తుగా ఫ్లెమింగ్ వేగానికి గొర్రెల మంద ఒకటి అడ్డుకట్ట వేసింది!

ఆటల నిర్వాహకులు గందరగోళ పడ్డారు. అక్కడ నిలబడి చూస్తూన్న అభిమానులు ఆందోళన పడ్డారు. ఎవరికీ ఏం చేయాలో తోచలేదు.

ఫ్లెమింగ్‌ మటుకు సైకిల్ తొక్కుతూనే ఆలోచించాడు. గొర్రెల్ని గుద్దుకుంటూ, నెట్టుకుంటూ పోయి వాటిని గాయపరచటం అతనికి ఇష్టం లేదు. అలాగని తన వేగం తగ్గించటానికీ వీలులేదు. ఎట్లాగ, మరి?

అతను కూడా పల్లె మనిషే. గతంలో అతనికి కూడా గొర్రెల్ని పెంచిన అనుభవం ఉన్నది! మరుక్షణం అతను గబగబా ఈల వేయటం మొదలు పెట్టాడు. గొర్రెలను అదిలించే వింత వింత శబ్దాలు అనేకం అతని నోట్లోంచి వెలువడ్డాయి. గొర్రెలన్నీ తలెత్తి అతనివైపు చూసి, వేటికవి ప్రక్కకు పరుగుపెట్టాయి. సైకిల్ వేగం పిసరంత తగ్గిందేమో, అంతకు మించి నష్టం ఏమీ జరగలేదు!

గొర్రెల మందని దాటుకొని మళ్ళీ వేగాన్ని పెంచిన ఫ్లెమింగ్ ఆ సంవత్సరపు సైక్లింగ్ క్రీడలో మొదటివాడుగా నిలిచాడు. నోమాజ్ కొడుకు సమయస్ఫూర్తే అతన్ని విజేతగా నిలిపిందని చెప్పచ్చు! లేదంటే గొర్రెలమందని చెదరగొట్టటం ఏమంత చిన్న పని?!

అటుతర్వాత నిర్వాహకులు పందేల సమయంలో గొర్రెలమందలు అడ్డు రాకుండా‌ చర్యలు తీసుకోవటం మొదలు పెట్టారు!