ఒక ఊళ్ళో‌ పేద అవ్వ ఒకామె ఉండేది. ఆ అవ్వకు ఒక మనవరాలు ఉండేది. ఒక రోజున అవ్వ కూలికి వెళ్ళి వస్తూంటే దారిలో బక్కచిక్కిన కోతిపిల్ల ఒకటి కనబడింది. దాన్ని చూసి జాలి పడి, అవ్వ దాన్ని ఇంటికి తీసుకొచ్చి, ప్రేమగా పెంచి పెద్ద చేసింది.

పెద్దదవుతున్న కొద్దీ కోతికి బాధ్యత కూడా‌ తెలిసి వచ్చింది. 'తన కోసం అంత కష్టపడుతున్నదే అవ్వ!' అని అదికూడా అవ్వవెంట కూలికి పోవటం, లేకపోతే అడవికి వెళ్ళి కట్టె పుల్లలు ఏరుకు రావటం- ఇట్లా ఏదో ఒక పని చేస్తూ ఉండేది.

ఒకసారి అట్లా కట్టెపుల్లలకోసం అడవిలోకి వెళ్ళిన కోతికి దట్టమైన తీగల వెనక దాగి ఉన్న గుహ ఒకటి కనబడింది. ఆ గుహలో అది లెక్కపెట్టలేనంత బంగారం, వెండి కనబడ్డాయి. అంత సంపదను ఒక్కచోట చూసి కోతి నిర్ఘాంత పోయి నిల్చున్నది- అంతలోనే అక్కడికి ఒక దొంగ వచ్చాడు. వాడు ఆ బంగారాన్ని, వెండిని వేరు వేరు గోతాలలో వేసి మూటలు కట్టాడు. అప్పుడు అర్థమైంది కోతికి- ఆ సంపదంతా దొంగదే- వాడు దాన్ని నిలవచేసుకునే గోదాము అన్నమాట, ఆ గుహ!

దొంగ వెళ్ళిపోయేంతవరకూ అక్కడే తచ్చాడిన కోతి, దొంగ అటు వెళ్ళిపోగానే బంగారంతో నిండిన బస్తానొకదాన్ని భుజాన వేసుకొని అవ్వ దగ్గరికి చేరుకున్నది. "అవ్వా అవ్వా! ఈ బంగారాన్ని జాగ్రత్తగా దాచు! ఇది నా చెల్లికోసం నేను కూడబెడుతున్న సంపద" అన్నది అవ్వతో. అవ్వకు ఏమీ అనుమానం రాలేదు. 'నిజంగానే అది అంత సొమ్మును కూడ బెట్టిందేమో' అనుకున్నది అవ్వ.

ఆ తర్వాత కూడా‌ కోతి చాలా సార్లు గుహలోకి దూరి తనకు దొరికిన సంచీలనల్లా తెచ్చి అవ్వకు ఇచ్చింది. ప్రతిసారీ "ఇది నా చెల్లికోసం నేను కూడబెడుతున్న సంపద" అనే చెబుతూ వచ్చింది అవ్వకు.

చివరికి అవ్వకు అనుమానం వచ్చింది: 'ఇది ఎవరినో మోసం చేస్తున్నట్లున్నదే' అని, కోతి వెనకనే అడవికి బయలుదేరింది అవ్వ, ఒకరోజున. తీరా వెళ్ళి చూస్తే అది దొంగ గుహ! అవ్వకు భయం వేసింది- దాంతో బాటు కోపం కూడా‌ వచ్చింది. కోతి బంగారు మూటని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోగానే ఆమె ధైర్యంగా వెళ్ళి దొంగముందు నిల్చున్నది. దొంగ ఆమెను చూసి తికమక పడిపోయాడు. అవ్వ వాడికి జరిగిందంతా చెప్పి, "నాయనా, నీ సొత్తు నాకు అవసరం లేదు. నాకున్నది ఒకే ఒక్క మనవరాలు- దాని పెళ్ళి చేసానంటే నా బాధ్యత తీరిపోతుంది. ఆ మాత్రం కష్టం నేనూ చేయగలను. అందుకని మా యింటికి వచ్చి నీ సొమ్ముని నువ్వు తీసుకెళ్ళిపో" అన్నది.

ఆ రోజు ఇంకా సాయంత్రం అవ్వకనే అవ్వ ఇంటికి వచ్చాడు దొంగ. అక్కడ అవ్వ మనవరాల్ని చూసేసరికి వాడి మనసూ మారింది. "నేను ఇంక దొంగతనాలు మానేస్తాను. నువ్వు అనుమతించావంటే నీ మనవరాల్ని పెళ్ళి చేసుకొని నీతిగా బ్రతుకుతాను" అన్నాడు అవ్వతో. కొంచెం ఆలోచించిన అవ్వ, మనవరాలి ముఖం చూసి, 'సరే అలాగే కానివ్వు' అన్నది.

అంతలోనే అక్కడికి వచ్చిన కోతికి మాత్రం దొంగని చూసేందుకు ముఖం చెల్లలేదు. అవ్వ తన మనవరాల్ని దొంగకు ఇచ్చి పెళ్ళి చేస్తాననటం కూడా‌ దానికి నచ్చలేదు. అందుకని అది దొంగ వెనకనే వెళ్ళింది- వాడు తన గుహలో దూరి పడుకోగానే గుహకి నిప్పు పెడదామనుకున్నదది! అయితే ఆరోజున దొంగకు అసలు నిద్రే పట్టలేదు. బయటకోతి ఎండు పుల్లలు, గడ్డీ జమ చేస్తుండగా వాడు లేచి నిశ్చింతగా అడవిలో తిరిగి వచ్చేందుకు పోయాడు.

పుల్లలన్నీ జమ అవ్వగానే కోతి నిప్పు తెచ్చి వాటిని అంటించి సంతోషంతో‌గంతులు వేసింది. ఆ సంతోషంలో అది తను ఆ పుల్లల మధ్యలోనే గెంతుతున్న సంగతి చూసుకోనేలేదు. మంటలు అన్నివైపులనుండీ‌ చుట్టుముట్టాక, అది భయంతో అరవటం మొదలు పెట్టింది.

అంతలోనే అక్కడికి వచ్చిన దొంగ దాన్ని కాపాడేందుకు ప్రయత్నించాడు గానీ, ఆ సరికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కోతి మనసును అదుపులో పెట్టుకోలేని కోతి అట్లా తన ప్రాణాలమీదికే తెచ్చుకున్నది!