లేపాక్షి బడి హాస్టల్‌లో మొత్తం 468 మంది విద్యార్థులు ఉంటారు. అందరూ తినేందుకు వీలుగా ఒక భోజనశాల, ఉపాధ్యాయులకు-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలూ, పిల్లలు స్వేచ్ఛగా తిరిగేందుకు, చదువుకునేందుకు, ఆడుకునేందుకు తగిన వాతావరణం‌- ఇవన్నీ ఉంటాయి.

హాస్టల్‌లో పనిచేసే బాలయ్య రోజూ ప్రొద్దునే సైకిల్‌మీద వచ్చేవాడు. పగలంతా పని చేసాక, సాయంత్రం చీకటి పడుతుండగా తమ ఊరికి తిరిగి వెళ్ళేవాడు.

హాస్టల్లో ఉండే వేణు, గోపి, కృష్ణ ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ముగ్గురూ కలసి మెలసి ఉండేవాళ్ళు ఎప్పుడూ.

బాలయ్య ఇంటికి వెళ్ళేముందు ఎప్పుడూ వేణుతో ఏవో కబుర్లు చెప్పి వెళుతుండేవాడు. ఒకసారి అతను చెప్పాడు: "మీరు మొన్న సెలవులకు ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు హాస్టల్లో ఎవ్వరూ లేరు. నేను వచ్చి, మధ్యాహ్నం అవ్వగానే ఇట్లా ఆవుకు గడ్డి కోసుకొచ్చి ఆవుకి వేసి, అట్లా ఆ ప్రక్కనే ఉన్న చింతచెట్టు క్రింద కూర్చున్నాను. ఆవు అక్కడక్కడా పెరిగిన గడ్డిని కొంచెం,నేను తెచ్చిపెట్టిన గడ్డిని కొంచెం-అట్లా తింటూ ఉంది. చెట్టుకి బాగా ఆనుకొని కూర్చున్నానేమో, మరి చల్లగాలికి హాయిగా నిద్రలోకి జారుకున్నాను నేను. కొంచెం సేపు గడిచాక, నాకు దగ్గర్లోనే ఏదో గజ్జెల చప్పుడు వినబడి, హటాత్తుగా మెలకువ వచ్చింది. చూద్దునుకదా, గాలి దుమారం!

సుడిగాలి రేగి, దగ్గర్లో ఉన్న దుమ్ము, మట్టి, కాగితాలు, చెత్త, చెదారం- అంతా గింగిరాలు కొట్టుకుంటూ నా మీదుగా ఎగిరిపోయినై! అది పోయాక చూస్తే, ఈ మైదానం మొత్తం నిర్మానుష్యం అయిపోయి ఉన్నది! నాకు చాలా భయం వేసింది. ఈ ప్రాంతాల్లో దయ్యం‌ తిరుగుతుంటుందని విన్నానుగానీ, దాన్ని అంత దగ్గరగా చూసింది ఆ రోజునే!

ఇంకా మూడునాళ్లలో అమావాస్య కదా, దయ్యాలతో జాగ్రత్తగా ఉండాలి మీరుకూడా. ఊరికే అక్కడా ఇక్కడా తిరగకండి" అని. ఈ సంగతి చెప్పాక, బాలయ్య మామూలుగానే ఇంటికి వెళ్ళిపోయాడు.

వేణుకి దయ్యాలంటే నమ్మకంలేదు గానీ, కథల్లో వాటిని గురించి చదివీ చదివీ వాటిని ఎలాగైనా చూడాలని ఒక కోరిక ఉండేది. అందుకని అతను ఈ సంగతిని వెంటనే గోపికి, కృష్ణకీ చెప్పాడు. అతను చెప్పింది విని గోపి కొంచెం భయపడ్డాడు, కానీ కృష్ణ మాత్రం చాలా సంతోషపడ్డాడు. "నాక్కూడా దయ్యాన్ని చూడాలని ఉందిరా" అన్నాడు.

వేణు, కృష్ణ ఇద్దరూ "మేమున్నాం, నీకు ఏమీ కాదు, మేం‌ నిన్ను కాపాడతాం- ముగ్గురం అమావాస్యరోజు ఇక్కడికి వచ్చి దయ్యాన్ని పలకరించి పోదాం" అని రకరకాలుగా చెప్పాక, గోపి కూడా‌ వాళ్లతోబాటు వెళ్ళేందుకు ఒప్పుకున్నాడు.

మూడో రోజు రాత్రి అమావాస్య. ఆరోజు రాత్రి చీకటి పడ్డాక, పిల్లలు అందరూ భోజనాలు చేసి పడుకున్న తర్వాత, మిత్రులు ముగ్గురూ నిశ్శబ్దంగా బయట పడ్డారు.

నక్షత్రాల వెలుగులో నేల ఎర్రగా-నల్లగా స్తబ్ధంగా ఉన్నది. చెట్లు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. ఎక్కడా ఒక్క దీపం కూడా లేదు. వేణు చేతిలో ఒక టార్చిలైటు ఉన్నది గానీ, అది వేస్తే మిగతా పిల్లలంతా చూసే ప్రమాదం ఉన్నది కదా, అందుకని దాన్ని వేయకుండా ఊరికే చేతిలో పట్టుకొని ఉన్నాడు.

పిల్లలు ముగ్గురూ ఒకరి వెనక ఒకరు నడుస్తూ పోయారు- ముందు వేణు, మధ్యలో గోపి, అందరిలోనూ చివరగా కృష్ణ.

"ఎటు వెళ్దాంరా?" అడిగాడు కృష్ణ.

"ఎటో ఎందుకు, ఆ చింతచెట్టు దగ్గరికే వెళ్దాం. బాలయ్యకు దయ్యం కనిపించింది అక్కడేగా?" అన్నాడు వేణు.

గోపి ఏమీ మాట్లాడలేదు. దయ్యం గురించి ఆలోచించిన కొద్దీ‌వాడికి ఊపిరి ఆడనట్టుగాఉంది.

వాళ్ళు చింతచెట్టు దగ్గరికి చేరుకుంటున్న కొద్దీ మారిన వాతావరణం మరింత బలంగా అనుభూతిలోకి వస్తోంది వాళ్లకి. నేల అంతా చిత్తడి చిత్తడిగా ఉంది. అంతలో వేణు కాళ్ళకి ఒక ముళ్ళ పొద తట్టుకున్నది- అతను ఒకసారి టార్చిలైటును వేసి చూశాడు..తన కాళ్లకి ఎదురుగా ముళ్ళపొద- ఆరడుగుల వరకూ విస్తరించి ఉన్నది. వాళ్ళిప్పుడు చింత చెట్టుకు ఏమంత దూరంగా లేరు.. గాలికి చింత చెట్టు కొమ్మలన్నీ‌ బాగా ఊగుతున్నాయి.

"ఊ, గాలి బాగానే వీస్తోంది. రండి అటువైపుగా వెళ్ళాలి చింతచెట్టు దగ్గరికి-" అన్నాడు వేణు టార్చిలైటును అటుగా చూపుతూ.

"టార్చిలైటు వేయకు- మనం వస్తోంది ఎందుకు? వెలుతురును చూస్తే దయ్యాలు పారిపోతాయి" గుసగుసగా కసిరాడు కృష్ణ.

మిత్రులు ముగ్గురూ చీకట్లోనే చింత చెట్టును చేరుకొని, అక్కడ నేలమీద పరచుకొన్న వేరు ఒకదాని మీద కూర్చున్నారు దగ్గర దగ్గరగా. అంతలో గాలి వేగం పెరిగింది. మేఘాలు అన్నీ లేపాక్షి వైపుకే వచ్చి చేరుకుంటున్నట్లు తోచింది. ఓ మెరుపు మెరిసింది ఆకాశంలో. ఆ మెరుపు వెలుగులో చింతచెట్టు కొమ్మలు ఊగటం కనిపించింది.

అంతలో ఓ వైపునుండి గజ్జెల శబ్దం వినబడింది.

మిత్రులు ముగ్గురూ ఒకరికొకరు దగ్గరగా జరిగారు.

శబ్దం వినబడిన వైపుకు చూసినై ముగ్గురి కళ్ళూ..ఏమీ కనబడలేదు..

అంతలో మరో మెరుపు మెరిసింది. ఈసారి భడభడమంటూ ఉరిమింది కూడా.

మిత్రులకు ముగ్గురికీ ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి- అంత చీకట్లోనూ మిలమిలా మెరుస్తున్న కళ్ళు రెండు! గల్..గల్.. మనే గజ్జెల మోత బలంగా వినిపిస్తోంది. దయ్యం బుస్..బుస్ మని ఊపిరి పీల్చుకోవటం‌-వదలటం కూడా వినబడిందిప్పుడు!

దట్టమైన ఆ చీకట్లో మిత్రులు ముగ్గురూ ఒకరికొకరు కూడా‌ కనబడటం లేదు. ముగ్గురూ‌ చెమటలతో తడిసిపోయారు. అందరికంటే ముందున్న వేణు కొయ్యబారిపోయాడు, అందరికంటే వెనక ఉన్న కృష్ణ ఒక అడుగు వెనక్కి వేశాడు. మధ్యలో ఉన్న గోపి అయితే స్పృహకోల్పోయి దబ్బున క్రింద పడిపోయాడు!

మిత్రుడు క్రిందపడిపోవటం చూసి వేణు, కృష్ణ ఇద్దరూ బొమ్మల్లాగా స్తంభించి పోయారు: "ఇప్పుడు క్రిందికి వంగి గోపిని లేవనెత్తి తీసుకుపోవటమా, లేక అక్కడే నిల్చొని దయ్యం అంతు చూడటమా?"

గజ్జెల చప్పుడు ఇప్పుడు మరింత దగ్గరయింది.. మెరుస్తున్న కళ్ళు రెండూ వాళ్ల దగ్గరికే వచ్చేస్తున్నాయి..ఏదో వేణు చొక్కా పట్టుకొని అటూ ఇటూ లాగింది. గబుక్కున తేరుకున్న వేణు టార్చ్ లైటు వేసాడు-

ఆ వెలుతురులో తమకు ఎదురుగా ఉన్నదేమిటో చూసి మిత్రులిద్దరూ నిర్ఘాంత పోయారు: అది దయ్యంకాదు- బాలయ్య ఆవు!

బాలయ్య ఆవు కళ్ళు చీకట్లో మెరుస్తున్నాయి. దాని కొమ్ములకు కట్టిన గజ్జెలు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తున్నాయి. అది వచ్చి వేణు చొక్కాను పట్టుకొని లాగుతున్నది.

మిత్రులిద్దరూ‌ ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

ఇక వేణు అక్కడే నిల్చొని ఉండగా కృష్ణ వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చాడు. వేణు, కృష్ణ ఇద్దరూ ఆ నీళ్ళని గోపి మొహం మీద చల్లారు. కొంత సేపటికి తేరుకున్న గోపి లేచి కూర్చొని "దయ్యం మనల్ని ఏమీ చేయలేదా?" అని అడిగాడు భయం భయంగా.

వేణు, కృష్ణ ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వి, వాడికి నీళ్ళు ఇచ్చి త్రాగించి, "అది దయ్యం కాదురా, అక్కడ ఉన్నది- ఇదిగో- ఈ బాలయ్య ఆవు! నల్లటి ఆవు కదా, అందుకని అది మనకు చీకట్లో కనబడలేదు- అంతే!" అని చెప్పి వాడినీ నవ్వించారు.

"దయ్యాలు బయట ఎక్కడో లేవురా, అవి మనలోనే ఉన్నాయి-భయం చాటున దాక్కుని" అని నవ్వుకున్నారు మిత్రులు ముగ్గురూ, బాలయ్య ఆవును నిమురుతూ.