బుద్ధుడు ఒకసారి ఓ గృహస్తు ఇంటి ముందు నిలబడి భిక్ష కోరాడు.
గృహస్తు ఇంట్లోవాళ్లందరూ బుద్ధుడి శిష్యులే. భగవానుడే నేరుగా తమ ఇంటికి వచ్చి భిక్ష కోరుతున్నాడని వాళ్లంతా‌ ఆశ్చర్యంతోటీ, ఆనందంతోటీ ఉబ్బి తబ్బిబ్బయిపోయారు.
"రండి! రండి!‌ లోపలికి రండి!" అని వాళ్లంతా బుద్ధుడిని ఇంటి లోపలికి ఆహ్వానించారు.
ఎవ్వరి ఆహ్వానాన్నీ కాదనడు బుద్ధుడు. వాళ్లింట్లోకి అడుగు పెట్టాడు.
ఇంటివాళ్ళు ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలని మల్లగుల్లాలు పడి, చివరికి ఇంట్లో లోపలి గదిలో ఉన్న పెద్ద మంచం మీదే కూర్చోమన్నారాయన్ని.
ఆ మంచం క్రిందే పడుకొని ఉన్నది, ఓ పెద్ద కుక్క! అది బుద్ధుడిని చూడగానే మొరగటం మొదలు పెట్టింది. దాదాపు ఆయన మీద పడి కరవబోయిందది!

ఇంటివాళ్ళు దాన్ని ఎంత వారించినా అది మొరగటం ఆపలేదు; అక్కడినుండి కదలలేదు.
బుద్ధుడు దాన్ని చూసి చిరునవ్వు నవ్వి, "నేనేమీ తీసుకుపోనులే, ఊరుకో" అన్నాడు. వెంటనే శాంతించింది ఆ కుక్క. వెళ్ళి మూలగా నిలబడి, గుర్రుమని చూస్తూ నిలబడ్డది.
ఇంట్లో వాళ్ళు బుద్ధుడికి చెప్పుకున్నారు- "క్షమించాలి స్వామీ! ఈ కుక్క నాలుగేళ్ళుగా మా యింట్లోనే ఉంది; ఎన్నడూ ఎక్కడికీ పోదు- ఎప్పుడూ ఈ మంచం క్రిందే పడుకొని ఉంటుంది. మిమ్మల్ని కాబట్టి ఇంతమాత్రం సహించింది గానీ, మరొకరినైతే ఈ గది దాపులకు కూడా‌ రానివ్వదు- మిమ్మల్ని చూసిన సంతోషంలో మేం దాని సంగతే మరచాం" అని.
"మూడు బారువుల బంగారం బాగానే కట్టి పడేసిందే?" అని నవ్వాడు బుద్ధుడు.
"అదేంటి?" అని ఆశ్చర్యపోయిన గృహస్తుకు చెప్పాడు- "మీ నాన్న, తన జీవితం అంతా కష్టపడి మూడు బారువుల బంగారం కూడబెట్టాడు. ఎవ్వరూ ఎత్తుకుపోకుండా ఉండాలని, దాన్ని మీ ఇంట్లోనే- ఈ పెద్ద మంచం క్రింద- దాచాడు. అయితే ఆ సంగతి మీకెవ్వరికీ చెప్పకుండానే అకస్మాత్తుగా చనిపోవలసి వచ్చింది. ఇప్పుడు కుక్కలా ఆ బంగారాన్ని కాపలా కాస్తున్నాడు. ఆశాపాశం చాలా గట్టిది. జీవుల మనసును ఆవరించి పట్టుకొని, పలు జన్మలకు కారణమౌతుందది. మనసును శుభ్రపరచుకోవటానికి, లోభం నుండి విముక్తి పొందటానికి అందరూ గట్టిగా ప్రయత్నించాలి. ఆశా పాశం పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని ప్రవచించాడు.
ఆ తర్వాత గృహస్తు కుక్కను తరిమి, త్రవ్వి చూస్తే నిజంగానే మంచం క్రింద మూడు బారువుల బంగారం దొరికింది!
అతను లోభాన్ని దరిచేరనివ్వక, దాన్ని పూర్తిగా ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించాడు!