పిల్లి-ఎలుకల కథ
పంచవటీ ప్రాంతంలోని ఓ మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి ఒకటి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు క్రిందే ఉన్న కలుగును ఇల్లుగా చేసుకొని 'పలితుడు' అనే ఎలుక ఒకటి నివసించేది.
ఒక రోజు రాత్రిపూట బోయవాడొకడు వచ్చాడక్కడికి. ఎవరూ గమనించటం లేదని నిర్ధారించుకొని, వాడు ఆ చెట్టు చుట్టూ వల పన్ని పోయాడు. పిల్లికి ఆ సంగతి తెలీదు కదా, అది ఇంకా తెల్లవారకనే లేచి ఆహారానికి పోబోయి, ఆ వలలో చిక్కుకున్నది.
ఎలుక దాన్ని చూసి చాలా సంతోషపడింది. ఇంతకాలమూ పిల్లి భయంతో అది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండింది. 'ఇప్పుడు తనకు పిల్లి పీడ వదిలిపోనున్నది గదా' అని అది నిర్భయంగా కలుగులోంచి బయటికి వచ్చి, ఆ ప్రాంతాల్లో అటూ ఇటూ తిరుగాడటం మొదలు పెట్టింది.

అట్లా ఊరికే తిరుగుతున్న ఎలుకను చూసింది, చంద్రకుడు అనే గుడ్లగూబ. దాన్ని చూడగానే గుడ్లగూబకు నోరూరింది. అది రయ్యిమని ఎగిరి వచ్చి దగ్గరలోనే ఉన్న మరొక చెట్టు మీద వాలింది. దాన్ని చూడగానే ఎలుకకు కాళ్ళు చచ్చుపడ్డట్లయింది; ఒళ్ళు గడ గడా వణికినట్లయింది; గుండె ఝల్లుమన్నది; శరీరం మొత్తం మొద్దుబారిపోయింది.
అలా నిశ్చేష్టం అయిపోయిన ఎలుక త్వరలోనే తెలివి తెచ్చుకొని, తనలో తాను "అయ్యో! ఏమి చేయాలి? ఇంత చక్కటి ఈ శరీరాన్ని ఇన్నాళ్ళూ ఇంత బలంగా పెంచి, చివరికి గూబ పొట్టపాలు చేయాల్సి వస్తున్నదే?! దేవుడా! నాలాంటి బక్కజీవి ప్రాణం నీ కంటికీ ఆనలేదా? నా ప్రాణాలు తీసేందుకేనేమో, విధి నన్ను ఇక్కడికి తెచ్చింది. విధి వ్రాతను తప్పించుకోవటం ఎవరికి సాధ్యం? అడవిలో ఊరికే పండ్లు, వేర్లు తింటూ జీవిత యాత్ర గడుపుతానే, ఇతరులకు ఎవ్వరికీ ఏ చిన్న కీడూ ఎంచని నాకు ముసలితనంలో ఇలా కాని చావు ఎందుకు రాసిపెట్టింది? దేవుడి శక్తి అపారం. ఒక్క నిముషం క్రితమే కదా, 'ఈ పిల్లి పీడ ఇవాల్టితో‌విరగడౌతున్నది; ఇక హాయిగా ఉండొచ్చు' అని అంత సంతోషించింది?! ఇంతలోనే నాకు అకాల మృత్యువు ఎదురవుతున్నది, చూడు! నేనిక ఏమి చేయను? ఎక్కడికి పోను?" అని ఏడ్చింది కొంతసేపు.
అట్లా గుండెలు అవిసేట్లు ఏడ్చేసరికి, దాని శరీరం అంతా బలహీనం అయి నీరసించి పోయింది. చివరికి అది కొంత ధైర్యం తెచ్చుకొని, "ఆపద ఎదురైనప్పుడు తెలివి గలవాడు ఏదో ఒక మార్గాన్ని వెతికి ఆపదనుండి తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప, ఇట్లా నోరు తెరచుకొని ఆకాశంకేసి చూస్తూ నీరసించిపోకూడదు. ఇప్పుడు నాకు ఈ పిల్లి ఒక్కటే శరణ్యం అనిపిస్తున్నది. ఏదో ఒక మాయోపాయం పన్నాలి- ఇతని దయను సంపాదించుకోవాలి. వేరే మార్గం లేదు" అనుకున్నది.
పని ఎట్లా నెరవేరుతుందో కొంచెం సేపు ఆలోచించుకొని, ఆ ఎలుక బయలుదేరి పిల్లి వైపుకే నడుస్తూ "ఓ పిల్లి రాజా! నమస్కారం. ఎంతో కాలంగా మనం ఇద్దరం ఈ చెట్టునే ఆశ్రయించుకొని సహోదరులలాగా మసలాము. అట్లాంటి మనం, ఇలా కష్టకాలంలో ఒకరికొకరం శత్రువులలాగా ఉండటం సరి కాదు. నాకు నువ్వుకాని, నీకు నేను కాని ఏనాడూ‌ ఒక్క చిన్న కీడుకూడా తలపెట్టి ఎరుగము. నీకు-నాకు పరస్పర ద్వేషం ఉండటానికి కారణం అంటూ అసలు ఏదీ లేనే లేదు...

మనం అందరం ఏదో ఒకనాడు చనిపోయేదే- ఉన్నట్లు ఉంటాం, ఆపైన ఎప్పుడో‌ఒకప్పుడు మృత్యువు వచ్చి నోట కరచుకొనిపోతుంది. ఈ ఉండేది ఎన్నాళ్లయితే అన్నాళ్ళు, మనం ఇద్దరం ఒకరి పట్ల ఒకరం స్నేహాన్ని అవలంబించి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించటం సబబు. నువ్వు ఇట్లా వలలో చిక్కుకొని కనబడ్డప్పటినుండి, సహవాస దోషమేమో, ఏమి చెప్పను- నా మనసు నిప్పుల్లో చెరిగినట్లు కణకణ మండుతున్నది- నిజం! మనసులోని మాట ఆ దైవానికే ఎరుక. ఇన్ని మాటలెందుకు? నిన్ను ఈ‌ మృత్యుపాశం నుండి కాపాడేంత వరకు నామనసుకు కుదురు అనేదే ఉండదు. అయినా, పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్లు, 'నిన్ను కాపాడటానికి పోతే నా ప్రాణానికి ఎక్కడ ముప్పు వస్తుందో' అని నా మనసే నన్ను ముందుకు పోనివ్వక బంధం వేస్తున్నది.
అది అట్లా ఉండగానే- అదిగో- పాపిష్టి గూబ ఒకటి నన్ను నోట్లో వేసుకుందామని పూనుకొని, అటూ -ఇటూ తిరుగుతూ, నా ప్రక్కన కొండలాగా ఉన్న నిన్ను చూసి ముందుకు దూకేందుకు తటపటాయిస్తూ, తల వంచుకొని, మనసు చలించగా, వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ కూర్చొని ఉన్నది. నీ దయ ఉంటే నాకొచ్చిన ఆపదనుండి తప్పించుకొని- అటుపైన నీ ఆపదనుండి నిన్ను తప్పించేందుకు ప్రయత్నిస్తాను నేను. వేరుగా చూడక, నన్ను నీ మిత్రుడిగా స్వీకరించు" అన్నది.
ఆ మాటలు విని పిల్లికి చాలా సంతోషం కలిగింది. ప్రాణం లేచివచ్చినట్లయింది దానికి. రెండు చేతుల్తోటీ చెవులు మూసుకొని, అది "అయ్యో! కరుణ గలవారిలో‌ ఉత్తముడా! 'నీ బ్రతుకుకే మోసం వస్తుందేమో' అని ఎంత మాట అన్నావు?! ఊరికే ఉపకారం చేసేందుకు వచ్చిన నీలాంటి మూగ ప్రాణులను నా యీ పాడు పొట్టకోసం చంపి, ఇక నేను ఏమి మూట కట్టుకుంటాను? దేనికి భయపడినా భయపడకపోయినా- కనీసం పాపానికన్నా భయపడాలి కదా? నేను ఇప్పుడు 'నావారు' అంటూ ఎవ్వరూ లేని దశలో మ్రగ్గిపోతూ, కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. ఈ పరిస్థితుల్లో ఎంత దుర్మార్గుడైనా ధర్మం తప్పి, నీతి మాలిన పనికి పూనుకుంటాడా?
'ఇతరులు ఏమి చేస్తే తన మనసుకు అయిష్టమవుతుందో, అట్లాంటి పనులు తాను ఇతరులకు చేయకుండా ఉండటం'- అదే కదా పరమ ధర్మమూ, సర్వ శాస్త్ర సారమున్నూ?
నేను కూడా చిన్ననాటినుండి నీవంటి పెద్దల శిక్షణలో పెరిగినవాడినే తప్ప, వివేకం తప్పి ప్రవర్తించినవాడిని కాదు.
మిత్రమా!‌ నీ దర్శనం వల్ల నాలోని అజ్ఞానం అంతా పటాపంచలై పోయింది. నేను ఎప్పుడూ నీ పొందుకోసమే గుటకలు మ్రింగుతూ‌ ఉంటాను. నేటికి అది, ఈ విధంగా నెరవేరుతున్నది. నీ స్నేహాన్ని పొందిన ధన్యుడు పరమ పుణ్యాత్ముడు కాక ఇంకేమి అవుతాడు? నీ సహచర్యంతో వెయ్యి మంది బంధువులు వచ్చి తోడుగా నిలబడ్డట్లున్నది.
లోకంలో మంచివారికి సజ్జన దర్శనాన్ని మించి సంతోషాన్నిచ్చేది వేరే ఏమున్నది? 'ఇతరు-లకు మేలు చేద్దాం' అన్న నీ ఆలోచనతో నా మనసు పూర్తిగా ఏకీభవించింది. మనం చేసిన మంచి పనులే మనల్ని కాపాడతాయి.
కాబట్టి, బుద్ధిమంతులు కాలు-చెయ్యి ఆడేనాడే ధర్మం గురించి ఆలోచించాలి. అటు తర్వాత జవ సత్వాలు ఉడిగాక, శరీరంలో కేవలం ఎముకలు, చర్మం మాత్రమే మిగిలాక, ముసలితనం వచ్చేశాక ఇక ఏం చేయాలన్నా వీలవ్వదు. మన ఈ ఆయుష్షు అన్నది తుఫానులో ఉంచిన దీపం మాదిరి, ఎప్పుడు ఆరిపోతుందో తెలీనట్లు క్షణక్షణమూ కొట్టు మిట్టాడుతూ ఉంటుంది. అది తెలుసుకొని, రేపు చేయాల్సిన మంచి పనిని ఇప్పుడు, మరునాడు చేయవలసిన దానిని రేపు- చేస్తూండాలి. 'ధర్మం త్వరగా గడచిపోతుంది' అని చెబుతారు కదా, పెద్దలు?!

దు:ఖ సముద్రంలో‌మునిగి , దారీ-తెన్నూ తెలీకుండా ఉన్న నాకు నువ్వొక తెప్ప మాదిరి ఎదురుపడ్డావు. ఆహా! ఏమి నా భాగ్యము! ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అయ్యింది! నేను నీ సహచర్యాన్ని కోరేందుకు తహతహలాడుతుంటే, ఇంతలోనే ఎవరో అడిగినట్లు నీ అంతట నువ్వే నన్ను తరింపజేయాలని ముందుకు వచ్చి నిలచావు.

నీ వంటి పుణ్యాత్ములు ఈ‌ లోకంలోనే ఎవ్వరూ లేరు. నీ అంతటివాడు ఈ గుడ్లగూబని చూసి భయపడేదేమి? నా ప్రాణాలు కాపాడితే చాలు- నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాను. భయం విడనాడి నా దగ్గరికి రా. నా స్నేహం ఉండగా నిన్ను ఈ నీచ పక్షి తాకేందుకు కూడా సాహసించదు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. త్వరగా వచ్చి, ఈ వల పని పట్టు" అన్నది.

పిల్లి మాటలకు ఎలుక సంతోషించి, మెల్లగా ఆ పిల్లి దగ్గరికి పోయింది. అది చూసి, దూరంగా ఉన్న గుడ్లగూబ నిరాశపడి, తనకు ఇక అక్కడ పని లేదనుకొని, తిరిగి చూడకుండా వచ్చిన త్రోవ పట్టింది.
సరిగ్గా అదే సమయానికి బోయవాడుకూడా ఆ ప్రాంతానికి రాసాగాడు. వెంట వేటకుక్కలు నాలుకలు బారచాపి పరుగెత్తుకొని రాగా అతను 'సాక్షాత్తూ యమభటుడేమో' అనిపిస్తున్నాడు.
అతను అలా రావటాన్ని దూరం నుండే గమనించిన పిల్లి గుండెలో రాయి పడ్డట్లయింది. భయంతో వణికిపోతూ అది ఎలుకతో "మిత్రమా! మనం మాటల్లో పడి ఏమారి ఉన్నాం, చూడు-అదిగో- ఆ దారిన వేటగాడు చేతిలో కట్టెను పట్టుకొని యముడిమాదిరి నడచి వస్తున్నాడు. ఆ దుర్మార్గుడు నా కంట పడినప్పటినుండి నా ప్రాణాలు పోయినట్లే అవుతున్నాయి. మనసు అదుపుతప్పి పోతున్నది. ఇంక నా బ్రతుకంతా నీ చేతిలోనే‌ ఉన్నది. పుట్టి బుద్ధి ఎరిగాక ఇదివరకు ఎన్నడూ‌ నాకు ఇటువంటి కష్టం ఎదురవ్వలేదు. సమయం గడిచిపోతున్నకొద్దీ నాలో అసహనం ఎక్కువైపోయి, భయంతో ఒళ్ళు కంపిస్తున్నది. నన్ను ఆ క్రూరుడి చేతిలో చిక్కనివ్వకు. త్వరగా విడుదల చెయ్యి- త్వరపడు!" అని తొందరచేసింది.
ఎలుక మాత్రం వల చుట్టూ తిరుగుతూ, త్రాళ్ళు కొరుకుతున్నట్లు నటిస్తూ, 'భయపడకు, భయపడకు- ఇదిగో విడిపిస్తున్నాను' అంటూ వేటగాడు మరింత దగ్గరయ్యేంత వరకూ గడిపింది. అటుపైన, వాడు మరీ దగ్గరికి వచ్చాక గబగబా వల త్రాటిని తెగకొరికి, ఒక్క పరుగున పోయి తన బొరియలో దూరింది.
అంతవరకూ భయంతో నిశ్చేష్టమైపోయిన పిల్లికూడా, ఆ విధంగా వల త్రాళ్ళు ముక్కలవ్వగానే దబదబా తన్నుకులాడి వల నుండి బయటపడింది. అంతలోనే తన ఎదురుగా నోరు తెరచుకొని నిలబడ్డ యమభటుడిలాంటి వేటకుక్కని చూసి, అది మరోసారి వణికి, దగ్గరలో కనబడ్డ చెట్టు మీదికి ఒక్క గెంతున దూకి పరుగు పెట్టింది.

తన ప్రయత్నం విఫలం అవ్వటమే కాక, 'వల కూడా పాడైందేమి?' అని ఆశ్చర్యపడ్డ వేటగాడు ముక్కున వేలు వేసుకొని కొంతసేపు నిలబడి, ఆనక వల త్రాళ్ళు మోసుకొని తన దారిన తాను పోయాడు.
అంతా సద్దు మణిగాక, పిల్లి చెట్టు దిగి వచ్చి ఎలుక కలుగు ముందు నిలబడి "మిత్రమా! ఇంకా కలుగులో దాగి ఉన్నావెందుకు? నీకున్న పరోపకారగుణం వల్ల నావంటి బలవంతుడైన మిత్రుడు నీవాడయ్యాడు. బయటికి రా! నీ పలుకులతో మరోసారి నా చెవులకు విందు చేయి. ఇవాల్టినుండి నా సంపదలన్నీ నీవి. నీకు పెట్టకుండా ఒక్క మంచి పదార్థంకూడా తినేందుకు నా మనసు అంగీకరించదు. ఇక మీద నాకు చుట్టాలూ పక్కాలూ అన్నీ‌నువ్వే. మా ఇంటిని నీ ఇల్లే అనుకో. నాతోపాటు వచ్చి మాయింటిని పావనం చెయ్యి. ఇవాళ్ళ-రేపు నీ అన్నపానాదులన్నీ‌ మా యింట్లోనే.
ఇదిగో, నా సంపదలు, నా జీవితం అంతా ఇకమీద నీ అధీనం. నన్ను నీవాడనుకో. ప్రాణాలను కాపాడి మహోపకారం చేసిన మిత్రుడిని కృతజ్ఞతా పూర్వకంగాకనీసం కౌగలించుకొని గౌరవించకుండా నా మనసు నిలుస్తుందా? ఇప్పుడు నన్ను ఇంకా దూరంగా ఉంచుతావెందుకు? నీ కలుగులోంచి వేగిరం బయటికిరా, నన్ను అక్కున చేర్చుకొని సంతోషపెట్టు!" అన్నది.
ఎలుక కలుగులోంచే జవాబిచ్చింది: "పని నెరవేరటంకోసం ఒక్కోసారి పగ వానితో స్నేహానికి అంగీకరించినప్పటికీ, తెలివి గలవాడు ఏమారడు. ఇప్పుడు నీ తీపి మాటలకు లొంగి, నీతో చెలిమికి అంగీకరించటం నాకు ప్రాణాంతకమే అవుతుంది. ఇంతవరకూ నువ్వు ఆ వలలో చిక్కుకొని చాలా అలసి ఉన్నావు; బాగా ఆకలిగొని ఉన్నావు. నీ పొట్ట వెన్నును అంటుకొని ఉన్నది. కళ్ళు గుంటలు పడి ఉన్నాయి. నీకిప్పుడు కావలసింది స్నేహం కాదు; ఆహారమే! ఆ ఆహారంకోసం ఇంత స్నేహాన్ని నటిస్తున్నావు. నీ మాయమాటలకు లొంగి ప్రాణాలు కోల్పోమంటావా? నీకు-నీ స్నేహానికీ వెయ్యి నమస్కారాలు. ఇంక నీకిక్కడ వేరే పనిలేదు. స్నేహం పేరిట నేను నీ చేత చిక్కటం జరగదు. భ్రమలన్నీ విడచి నీదారిన నువ్వు పో. ఇంతకు ముందే కదా ఆ వేటగాడి వలనుండి తప్పించుకున్నది? మళ్ళీ ఇంతలోనే ఈ దురాశ అనే వలలో ఎందుకు, చిక్కుకుంటావు?" అని తిట్టి, కలుగులోంచి బయటికి రాక, ఎలుక సుఖంగా ఉన్నది.
ఆ మాటలకు మనసు విరుగగా, పిల్లికూడా చేత చిక్కిన డబ్బును పోగొట్టుకున్న వాడిలాగా ముఖం చిన్నబుచ్చుకొని చెట్టునెక్కి పోయింది.
కాబట్టి, ఒక్కోసారి శత్రువుతోకూడా మనకు నెరవేరవలసిన అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏమారి ఉండటం మాత్రం మంచిది కాదు. ఈ విషయంలో ఆలోచించవలసింది మరేమీ లేదు.
నువ్వు ఇక బదులు చెప్పకు. ఈసారికి కాకితో మిత్రత్వాన్ని అంగీకరించు" అని, ఇంకా దానికొచ్చిన అనుమానాలన్నిటికీ తగిన జవాబులిచ్చింది హంస.
(తర్వాత ఏమయిందో వచ్చేసారి..)