ఒకసారి ఓ వేటగాడు ఒక అడవిలోకి పోయి, అక్కడ వల పన్నాడు. తను ఓ మూలగా నక్కి కూర్చున్నాడు- 'ఏమైనా పక్షులో, జంతువులో అటుగా వచ్చి వలలో చిక్కకపోతాయా' అని.
అంతలో అటువైపుకు వచ్చిందొక బుజ్జి పిట్ట. వస్తూ వస్తూనే అది కాస్తా వలలో చిక్కుకున్నది. చూసేందుకది చిన్నదే, కానీ దాని తెలివి అమోఘం. అది ఏమీ కంగారు పడకుండా వలలో అలాగే కూర్చున్నది.
వేటగాడు సంతోషంగా దాని దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. "బుజ్జి పిట్ట బలే రుచిగా ఉంటుంది" అనుకున్నాడు. అయితే వాడు దాన్ని చంపబోగానే, బుజ్జి పిట్ట వాడితో మాట్లాడింది- "వేటగాడా! ఓ సారి నామాట విను. నేను ఎంత చిట్టి పిట్టనంటే, నన్ను చంపి తిన్నంత మాత్రాన నీ ఆకలి చల్లారదు; నీ కడుపు నిండదు. దానికంటే నయం, నువ్వు నన్ను ఊరికే వదిలెయ్యి- అలా వదిలేస్తే, బదులుగా నేను నీకు అమూల్యమైన సలహాలు మూడు ఇస్తాను. అవి నీకు ఎనలేని మేలు చేస్తాయి. మొదటి సలహాను నేను ఇక్కడినుండే, నీ చేతిమీదే కూర్చొని- ఇస్తాను. రెండవదాన్ని నేను ఈ చెట్టు కొమ్మమీద కూర్చొని ఇస్తాను. మూడో సలహాను నేను ఆ చెట్టు మీద వాలి ఇస్తాను" అన్నది.
వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు- "నిజమే, ఈ‌ పిట్ట చాలా చిన్నది. దీన్ని తింటే కడుపేమీ నిండదు. దాని బదులు, ఇదేదో మంచి సలహాలు ఏవో ఇస్తానన్నది కదా, అవి తీసుకుంటే సరి. వాటి వల్ల నాకు ఎనలేని మేలేదో కలుగుతుందట కూడా! మరింకేమి?!" అని, పిట్టను వలనుండి తప్పించి చేతిలో పట్టుకున్నాడు.
పిట్ట అతనికి తన మొదటి సలహాను ఇచ్చింది: "ఎప్పుడైనాగానీ- సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా సరే- నమ్మద్దు" అని.
"సరేలే" అన్నాడు వేటగాడు.
సలహా ఇచ్చేసాక పిట్ట ఎగిరి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నది. వేటగాడు ఇంకా మొదటి సలహా గురించి ఆలోచిస్తూండగానే తన రెండో సలహాను అందించింది: "జరిగిపోయినది ఏదైనా సరే- దాన్ని గురించి బాధపడద్దు" అని.
వేటగాడు సరే నన్నాడు, పరధ్యానంలోనే.
పక్షి వెంటనే అక్కడినుండి ఎగిరి వెళ్ళి ప్రక్కనున్న చెట్టు పైన వాలి, చెప్పింది- "చూడబ్బీ! నా పొట్టలో వంద గ్రాముల బంగారు ముక్క ఒకటి ఉంది. నువ్వు గనక దాన్ని దొరకపుచ్చుకొని ఉంటే, నువ్వొక్కడివే కాదు- నీ తర్వాత పది తరాల వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికి పోయేవాళ్ళు. నాకు నీ మీద ఎంత జాలిగా ఉందో చెప్పలేను- నువ్వు తొందరపడి నన్ను వదిలివెయ్యటం వల్ల, నీకు అందబోయిన సంపద ఆసాంతం పోయింది!" అని.
వేటగాడు నిర్ఘాంతపోయాడు . బాధ పడ్డాడు. "నువ్వు నన్ను మోసం చేశావు" అని మొత్తుకున్నాడు.

పక్షి నవ్వి, వేటగాడితో‌అన్నది- "చూడు, నీకు నేను ఇచ్చిన సలహాలు ఇంకా సరిగ్గా అర్థం అయినట్లు లేదు- 'జరిగిపోయింది ఏదైనా సరే, దాన్ని గురించి బాధ పడద్దు; ఎందుకంటే అట్లా బాధపడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు' అని చెప్పాను. మరి, నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు?
అంతేకాదు- 'సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా నమ్మద్దు' అని చెప్పాను. ఇందాకే కదా, నువ్వు నన్ను పట్టుకున్నది?- నా బరువు వంద గ్రాములు ఉంటే నీకు తెలీకపోయేదా? ఇంత చిన్న నా కడుపులో‌ వంద గ్రాముల బంగారం అసలు ఎట్లా చేరుకుంటుంది? అసంభవం కదా; మరి దాన్ని నమ్మకూడదు కదా?" అన్నది.
వేటగాడు సిగ్గు పడ్డాడు. "నిజమే. మంచి మాటలు విన్నంత మాత్రాన అవి మన ఆచరణలోకి వచ్చేస్తాయని లేదు. మంచిని ఆచరణలో పెట్టేందుకు కూడా‌ ప్రత్యేకించి ప్రయత్నించాలి. నువ్విచ్చిన సలహాలను అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిసాను ఇకమీద" అన్నాడు. "మరి నువ్విచ్చే మూడో సలహా ఏంటి?" ఉత్సాహంగా అడిగాడు పిట్టను.
"మంచి సలహాలు వినగానే వాటిని ఆచరణలోకి తెచ్చేసుకోవాలి- లేకపోతే ఇక సలహాలు రావు" అని చెప్పి తుర్రున ఎగిరిపోయింది పిట్ట.