రంగాపురంలో నివసించే చిన్నికి అందమైన టీ కప్పులు సేకరించడం ఒక హాబి. అట్లా సరదాగా ఒకరోజున ఓ అందమైన టీ కప్పుని చేతిలోకి తీసుకుని, ముచ్చటగా దాన్ని నిమురుతూ "అబ్బ ఎంతబాగుందో ఇది! పుడితే ఈ కప్పులా అందంగా పుట్టాలి" అన్నది.
"అవునా? నిజంగా నేను అంత నచ్చానా?" అన్నది కప్పు.
అకస్మాత్తుగా అది అట్లా మాట్లాడే సరికి చిన్ని ఉలిక్కిపడింది. అటుపైన దాన్ని ప్రేమగా చూస్తూ "అవునోయ్, చాలా బాగున్నావు నువ్వు" అన్నది.
టీ కప్పు తన కథని చెప్పుకొచ్చింది- "నేను ఇట్లా ఎందుకున్నానో అర్థం కాదు మీకు- ఒకప్పుడు నేను ఎర్ర ముద్దలా, బంక మట్టిలా వుండేదాన్ని. ఒకసారి నా యజమాని నన్ను నీళ్ళతో కలిపి, బాగా తొక్కి, చక్రం పైన రౌండ్లు రౌండ్లుగా చాలా సార్లు తిప్పాడు. 'నాకు కళ్ళు తిరుగుతున్నాయి..ఆపు! నన్ను ఒంటరిగా వదిలేయ్' అని చాలా గట్టిగా అరిచాను. ఎంత అరిచినా మా యజమాని మటుకు "అప్పుడే వదిలేయలేను" అని అడ్డంగా తలాడించాడు.
ఆ తర్వాత అతను నన్ను తీసుకెళ్ళి ఒక కొలిమిలో వేసాడు. ఇంతకు ముందెన్నడూ అంతటి వేడిని ఎరుగను: నా యజమాని నన్ను ఏనాటికైనా అట్లాంటి కొలిమిలో వేసి కాల్చగలడని అనుకోలేదు నేను ఆనాటి వరకూ.
'వేడి భయంకరంగా ఉంది! కొలిమిలో నుండి నన్ను బయటికి తియ్యి" అని గట్టిగా అరిచాను కొలిమిలోంచే.
"అప్పుడే వదిలేయలేను" అని కొలిమి బయట నిలబడి అతను అంటుండటం గమనించాను నేను.
తర్వాత చాలా సేపటికి నన్ను కొలిమిలోంచి తీసి బయట పెట్టాడతను. 'బాగుంది. ఇక్కడ నాకు చాలా బావుంది' అని అనుకుంటుండగానే నన్ను తన చేతిలోకి తీసుకుని రంగులు వేయడం మొదలు పెట్టాడు. ఆ వాసనలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పలేను. వాటిని భరించలేక "ఆపు! ఆపు! ఆ రంగులు నా పైన చల్లకు!" అని అరిచాను. అయినా అతను పట్టించుకోలేదు. "అప్పుడే వదిలేయలేను" అని సమాధానం ఇచ్చాడు.
రంగులు వేసాక అతను నన్ను మళ్ళీ ఓసారి కొలిమిలో పెట్టాడు. ఆ కొలిమి ఇంతకు ముందు దానంత వేడిగా లేదు- దాని కంటే రెట్టింపు వేడిగా వుంది! నాకు చాలా ఉక్కగా కూడా ఉండింది అక్కడ. నేను మా యజమానిని ప్రార్థించాను, ప్రాధేయపడ్డాను, ఏడ్చాను, అరిచాను- బయటకు తీయమని. ఎప్పటిలాగే తన నుండి "అప్పుడే వదిలేయలేను" అని సమాధానం వచ్చింది.
ఇక నేను ఆశలన్నిటినీ వదిలేసుకున్నాను. ఇంక బయటపడలేనని నిశ్చయించు-కున్నాను. అలాంటి సమయంలో నా యజమాని నన్ను బయటకు తీసి ఒక అరలో పెట్టాడు. ఒక గంట తర్వాత నన్ను నేను చూసుకునేందుకు ఒక అద్దం ఇచ్చాడు. నేను ఎట్లా తయారయ్యానో చూసుకుని నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను- నేను ఇట్లా అద్భుతంగా మారి పోయి ఉన్నాను మరి!"
ఆ సమయంలో మా యజమాని నాతో ఏమన్నాడో ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను..
"నేను నిన్ను తొక్కాను, గుండ్రంగా తిప్పాను. నేను అలా చేయకపోతే నువ్వు ఒక మట్టిముద్దలా మిగిలి ఎండి పోయేదానివి . నేను నిన్ను కాల్చాను, నేను అలా చేయకపోతే నీకు ఇంత గట్టిదనం వచ్చేది కాదు, తాకితే పగిలిపోయే పదార్థంగా మిగిలిపోయేదానివి. నేను నీకు వేసిన రంగులు చెడు వాసనలని వెదజల్లి ఉండవచ్చు,కానీ నేను అలా చేయకపోతే నీ జీవితంలో రంగు లేకుండా అందవిహీనంగా కనపడేదానివి. నేను రెండోసారి నిన్ను కొలిమిలో ఎందుకు పెట్టానంటే నీకు మరింత గట్టిదనాన్ని ఇవ్వడానికి. నువ్వు ఇప్పుడు ఒక అందమైన రూపానివి. మొదట నేను ఏదైతే నీలో చూసానో ఇప్పుడు నిన్ను అలాగే తీర్చిదిద్దాను. కష్టాలు వచ్చాయని ఎప్పుడూ బాధపడకూడదు. అవి వచ్చేది నిన్ను మరింత బలంగా, మరింత గట్టిగా, మరింత అందంగా తయారు చేసేందుకే!"